తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Formation Day Live Updates: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు దినోత్సవం’
దశాబ్ది వేడుకలకు సిద్ధమైన తెలంగాణ
దశాబ్ది వేడుకలకు సిద్ధమైన తెలంగాణ

Telangana Formation Day Live Updates: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు దినోత్సవం’

03 June 2023, 12:33 IST

  •  Telangana Formation Day Live Updates: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రావతరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేసింది. జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే.

03 June 2023, 12:33 IST

ప్రత్యేక ప్రదర్శనలు…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో చేసిన అభివృద్ధిని, రైతు సంక్షేమ పథకాలను ఆయా గ్రామాల్లోని రైతు వేదికల కేంద్రంగా వివరిస్తున్నారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ విత్తన నాణ్యతపై ప్రత్యేక పాటను రూపొందించింది.

03 June 2023, 8:38 IST

రేపు ‘‘సురక్షా దినోత్సవం’’

జూన్ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘‘సురక్షా దినోత్సవం’’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిలాస్థాయిలో కార్యక్రమాలుంటాయి.

03 June 2023, 8:34 IST

ప్రముఖల ట్వీట్లు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రం గాల ప్రముఖులు ట్వీట్లు చేశారు. తె లంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని కొనియాడారు. హీరో రామ్ చరణ్ తో పాటు ఇతర హీరోలు కూడా విషెస్ చెప్పారు.

03 June 2023, 6:22 IST

తెలంగాణ రైతు దినోత్సవం

దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా  ‘‘తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు.

02 June 2023, 20:12 IST

దశాబ్ధి ఉత్సవాల షెడ్యూల్…

జూన్ 4

జూన్ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘‘సురక్షా దినోత్సవం’’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిలాస్థాయిలో కార్యక్రమాలుంటాయి.

• జూన్ 5

జూన్ 5వ తేదీ సోమవారం నాడు ‘‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.

02 June 2023, 18:49 IST

రేపటి షెడ్యూల్ …

జూన్ 3 శనివారం నాడు ‘‘తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు.

02 June 2023, 18:47 IST

ప్రగతిపథంలో వెళ్తున్నాం - మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందని అన్నారు.

02 June 2023, 16:30 IST

రామ్ చరణ్ ట్వీట్

‘తెలంగాణ స్టేట్ form అయ్యి 10 years అవుతుంది. ఈ పదేళ్లలో we have made progress in all fields. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. Decade celebrations sandarbhamgaa, తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు’ అంటూ మెగా హీరో రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

02 June 2023, 15:32 IST

అభివృద్ధిపథంలో తెలంగాణ - మంత్రి గంగుల

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్పీకరించి జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు.

02 June 2023, 15:31 IST

సాకారం అయింది - స్పీకర్ పోచారం

తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది వేడుకల ప్రారంభం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. అంతకు ముందు అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… దశాబ్దాలుగా వెనుకబడ్డ కామారెడ్డి ప్రాంతంలో మెట్టపంటలకు సాగునీరు కల తెలంగాణ ఏర్పాటుతో సాకారం అయిందన్నారు.

02 June 2023, 13:07 IST

తెలంగాణకు హరితహారం

అడవుల పునరుద్ధరణ కోసం, రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకం కోసం ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టినట్టు కేసీఆర్ వివరించారు. హరించుకుపోయిన వనాలను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించుకున్నామన్నారు. ప్రజా సహకారంతో ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు

తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 273 కోట్ల మొక్కలు నాటుకున్నామని  2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని వివరించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 ఉన్నాయని  చెట్ల సాంద్రత 2014లో 2,549 చ.కి.మీ. ఉండగా.. ప్రస్తుతం అది 2,848 చ.కి.మీలకు పెరిగిందని కేసీఆర్ చెప్పారు.. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొనటం సంతోషదాయకం అన్నారుజ

02 June 2023, 12:51 IST

గృహలక్ష్మి పథకం ప్రారంభం

సొంతస్థలం ఉండి కూడా ఇళ్ళు నిర్మించుకోలేని పేదల కోసం గృహలక్ష్మి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించినట్లు గుర్తు చేశారు. మహిళల పేరిట అమలు చేసే ఈ పథకాన్ని జూలై నెలలో ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. గృహలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయలను మూడు దశల్లో అందిస్తామన్నారు.  పథకం అమలు కోసం ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు.

02 June 2023, 12:48 IST

పోడు భూములకు పట్టాలు

 

తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని కేసీఆర్ ప్రకటించారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తున్నట్లు చెప్పారు. జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నట్లు చెప్పారు. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

02 June 2023, 12:47 IST

వృత్తి పనుల వారికి ఆర్ధిక ప్రేరణ

 

దశాబ్ది ఉత్సవాల కానుకగా బి.సి కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధికసాయం ప్రకటించారు సిఎం కేసీఆర్ రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టినట్టు వివరించారు. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభమవుతుందన్నారు.

02 June 2023, 12:19 IST

సంపదను పెంచుదాం, పంచడమే నినాదం

‘‘సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం’’ అనే నినాదంతో తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని సిఎం కేసీఆర్ వివరించారు. అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందని  2014లో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 మాత్రమే ఉండేదని  తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో  రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షల 17 వేల 115 రూపాయలకు పెరిగిందన్నారు. పదేళ్ల చిరు ప్రాయంలో ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలకన్నా మిన్నగా నిలిచిందన్నారు. 2014లో రాష్ట్ర జీఎస్.డి.పి విలువ రూ.5,05,849 కోట్లు మాత్రమే ఉండగా, నేడు రాష్ట్రంలోని అన్నిరంగాలూ ఆర్ధికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీ.ఎస్.డి.పి 12,93,469 కోట్లకు పెరిగిందని వివరించారు.

02 June 2023, 11:29 IST

నిరంతర ప్రక్రియగా పేదలకు గృహ నిర్మాణం

తెలంగాణలో  నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం చేపట్టామని కేసీఆర్ వివరించారు. ఎంతో వ్యయంతో, అన్ని వసతులతో అందంగా నిర్మించిన ఈ ఇళ్ళను పేదలకు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. పేదలకు ఉచితంగా రెండు పడకగదుల ఇళ్ళను నిర్మించి ఇచ్చే పథకం మరెక్కడా లేదని, దేశంలో ఎక్కడా పేదల కోసం ఇటువంటి ఇళ్ళ నిర్మాణం జరగ లేదన్నారు. కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ళ సముదాయం ఓ టౌన్ షిప్ ను తలపించేదిగా ఉందన్నారు. ఇక్కడ 117 బ్లాకుల్లో 15,660 ప్లాట్లు నిర్మించామని,పేదలకు గృహ నిర్మాణం అనేది ఓ నిరంతర ప్రక్రియ. దీనిని కొనసాగిస్తునే ఉంటామన్నారు. పేదలెవరైనా తమ స్వంత జాగాలో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం క్రింద 3 లక్షల రూపాయలను మూడు దశల్లో అందిస్తుందని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలోనూ మూడు వేల మందికి గృహలక్ష్మి పథకం ప్రయోజనం అందిస్తామన్నారు. 

02 June 2023, 11:07 IST

తెలంగాణ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ - చేశారు. తెలంగాణ ప్రజల నైపుణ్యాలు, సంస్కృతి వైభవం ఎంతో గుర్తింపు పొందాయిని, తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానని  ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

02 June 2023, 11:04 IST

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో ప్రజలందరికీ సిఎం శుభాకాంక్షలు తెలిపారు. స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఘనంగా తలుచుకుందామని పిలుపునిచ్చారు. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామన్నారు.

02 June 2023, 10:50 IST

హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదన్న గవర్నర్

తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదన్నారు గవర్నర్ తమిళ సై. కొంత మంది మాత్రమే  అభివృద్ధి కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుందన్నారు.  వచ్చే సంవత్సరం నాటికి దేశంలో తెలంగాణ నంబర్1 కావాలని అకాంక్ష వ్యక్తం చేశారు.  జై తెలంగాణ అంటే స్లోగన్ ఒక్కటే కాదని.. ఆత్మ గౌరవ నినాదం అన్నారు.  అమరవీరులందరికీ జోహార్లు తెలిపారు.  జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమేనని,  దేవుడు తనను తెలంగాణ కు పంపడం గొప్ప అదృష్టమన్నారు. 

02 June 2023, 9:03 IST

రాదన్న తెలంగాణ సాధించి చూపామన్న హరీష్ రావు

రానే రాదన్న తెలంగాణను సాధించి, కానే కాదన్న అభివృద్ధిని చేసి చూపెట్టింది కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు కొనియాడారు.  అనతి కాలంలోనే ప్రగతి పథంలో నడిపించి తెలంగాణను ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపింది కేసీఆర్ అని, 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధికి రోల్ మోడల్ గా చేసి, 76 ఏళ్ల స్వతంత్ర భారత్ కు మార్గదర్శిగా మార్చింది కేసీఆర్ అన్నారు.  కేసీఆర్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాయన్నారు.  తెలంగాణ ఆచరిస్తే, నేడు దేశం అనుసరిస్తున్నది. అందుకే ’తెలంగాణ మాడల్‌’ దేశమంతటా ఆకర్షించేలా విరాజిల్లుతున్నదన్నారు.  అవమానాలు, అన్యాయాలకు గురైన చోటే, స్వరాష్ట్రంలో సమగ్రాభివృద్ధి చెంది సగర్వంగా దశాబ్ది సంబురం చేసుకొంటున్న చారిత్రక సందర్బం ఇది ట్వీట్ చేశారు. 

02 June 2023, 8:51 IST

దశాబ్ది వేడుకలకు గవర్నర్‌కు అందని ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు గవర్నర్‌ తమిళసైకు ఎలాంటి ఆహ్వానం అందలేదని రాజ్‌భవన్‌ వర్గాలు  వెల్లడించాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాల నిర్వహణపై  గవర్నర్‌ కార్యాలయానికి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రంలో గవర్నర్‌ పాల్గొంటారని వివరించారు. 

02 June 2023, 8:39 IST

తెలంగాణ ఆవిర్భావ  దినం శుభాకాంక్షలు చెప్పిన పవన్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవని,  ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమన్నారు. అటువంటి త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కాంక్షిస్తూ.. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. 

02 June 2023, 8:04 IST

గొల్కోండ కోటలో తెలంగాణ అవతరణ వేడుకలు

గొల్కొండ కోటలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు నిర్వహించారు.  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు  నిర్వహించారు.  కిషన్ రెడ్డికి సాయుధ బలగాల గౌరవ వందనం సమర్పించాయి. - జాతీయ జెండాను ఎగురవేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,  తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  అమరుల త్యాగాలను మరువలేంమని, తెలంగాణ  కోసం 1200 మంది అమర వీరులు బలిదానం చేశారని గుర్తు చేశారు.  తెలంగాణ కోసం అన్ని వర్గాల వారు పోరాటం చేశారని, - నీళ్లు, నియామకాలు, నిధుల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని,  ప్రజల సమైక్య పోరాటంతోనే తెలంగాణ వచ్చిందిని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. 

02 June 2023, 8:02 IST

ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. - యువత, విద్యార్థుల త్యాగాల ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని,  సోనియా కరుణతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు.  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలని  తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

02 June 2023, 7:35 IST

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని  సెక్రటేరియట్‌  పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి.

02 June 2023, 7:34 IST

మూడోసారి కేసీఆరే.. ముమ్మాటికీ బీఆర్‌ఎస్‌దే అధికారం

బీఆర్‌ఎస్‌ నుంచి మూడోసారి సీఎం అభ్యర్థి ముమ్మాటికీ కేసీఆరేనని, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమ అభ్యర్థి ఎవరో చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బీఆర్‌ఎస్సేనని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. దక్షిణాదిలో వరుసగా తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న అరుదైన రికార్డు సాధించిన కేసీఆర్‌కు కేటీఆర్‌కు అభినందనలు తెలియజేశారు.

02 June 2023, 7:33 IST

జూన్‌ 22 వరకు రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్‌ 3న రైతు దినోత్సవం, 4న పోలీసు శాఖ సురక్షా దినోత్సవం, 5న విద్యుత్‌ విజయోత్సవం, సింగరేణి సంబురాలు, 6న పారిశ్రామిక ఉత్సవం, ఇండస్ట్రియల్‌ ఐటీ కారిడార్లలో సభలు, 7న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్‌, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లెప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న గిరిజనోత్సవం, 18న మంచినీళ్ల పండుగ, 19న హరితోత్సవం, 20 విద్యా దినోత్సవం, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, 22న అమరులకు నివాళి, స్మారక చిహ్నం ప్రారంభోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

02 June 2023, 7:32 IST

సచివాలయంలో  విస్తృత ఏర్పాట్లు

దశాబ్ది వేడుకల కోసం  సచివాలయంలో శాఖలవారీగా 13,398 అధికారులను నియమించారు.అన్ని శాఖల నుంచి 7,250 మందిని వేడుకలకు ఆహ్వానించారు. వారికోసం 151 బస్సులను ఏర్పాటు చేశారు. వేడుకల సమన్వయం కోసం ప్రభుత్వం ఇప్పటికే నోడల్‌ అధికారులను కూడా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా వేడుకల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

02 June 2023, 7:31 IST

విద్యుద్దీప కాంతుల్లో సచివాలయం

దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నాలు, భవనాలను అధికారులు విద్యుద్దీపాలతో అలంకరించారు. త్రివర్ణ విద్యుద్దీపకాంతులతో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం తళుకులీనుతున్నది. అలాగే, 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని రంగు రంగుల లైట్లతో అలంకరించారు.

02 June 2023, 7:30 IST

ఏ ఒక్క పార్టీతో రాష్ట్రం రాలేదు..

ఏ ఒక్క పార్టీతోనో, కుటుంబంతోనో తెలంగాణ రాష్ట్రం ఏర్పలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సమిష్టి పోరాటాలతోనే ప్రత్యేక రాష్ట్రం  సాధ్యమైందని చెప్పారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి