TG Crop Loan Waiver : రుణమాఫీ జరగని వారి కోసం ఇంటింటి సర్వే, వ్యవసాయశాఖ కీలక ప్రకటన
19 August 2024, 19:24 IST
- TG Crop Loan Waiver : రుణమాఫీ జరగని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతున్నారు. రైతుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు వ్యవసాయశాఖ రంగంలోకి దిగింది. ఇంటింటి సర్వే ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తుంది. రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన ప్రతీ రైతు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు అధికారులు.
రుణమాఫీ కాని వారి కోసం ఇంటింటి సర్వే, వ్యవసాయశాఖ కీలక ప్రకటన
TG Crop Loan Waiver : తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. రుణమాఫీ మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. వివిధ సాంకేతిక కారణాల వల్ల మూడు విడతల్లో పంట రుణం మాఫీ కాని రైతుల సంఖ్య అధికంగానే ఉంది. పంట రుణం మాఫీ కాలేదన్న ఆగ్రహంతో ఉన్న రైతులను సముదాయించేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ అధికారిక సమాచారం మేరకు.. తమకు పంటరుణం మాఫీ కాలేదని ఫిర్యాదు చేసి ప్రతీ రైతు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించున్నారు. దీనికోసం వ్యవసాయ శాఖ ఇంటింటి సర్వే జరపనుంది.
పూర్తిగా అమలు కానీ రుణమాఫీ హామీ
గతేడాది శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎన్నికల హామీల్లో రూ.2 లక్షల రుణ మాఫీని ప్రకటించింది. గత ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ అధికారం చేపట్టాక, రుణమాఫీపై కీలక ప్రకటన చేసింది. 2018 డిసెంబరు 12వ తేదీ నుంచి 2023 డిసెంబరు 9వ తేదీల మధ్య పంట రుణం తీసుకున్న రైతులు రుణమాఫీ స్కీమ్ కు అర్హులుగా నిబంధనలు పెట్టింది. రుణమాఫీని కూడా మూడు కేటగిరీలుగా విభజించింది. రూ.లక్ష, రూ.లక్షన్నర, రూ.2లక్షల చొప్పున మూడు విడతలగా రుణాలను మాఫీ చేసింది. అయితే, రైతుల రుణ మాఫీ పూర్తిగా జరగలేదు. వేలాది మంది రైతులు ఈ స్కీమ్ కు అర్హులు కాకుండా పోయారు. మూడు విడతల్లో రుణమాఫీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, రుణమాఫీ జాబితాల్లో పేర్లు లేని రైతులు అటు బ్యాంకులకు, మరో వైపు మండల వ్యవసాయ కార్యాలయాలకు పోటెత్తారు.
చిన్న చిన్న కారణాలు, బ్యాంకు ఖాతాల్లో తప్పిదాలు, ఆధార్, పట్టా పాసుపుస్తకాల్లో పేర్లలోని వ్యత్యాసాలు ఇలా కనీసం 34 రకాలైన అంశాలను కారణంగా చూపి రైతుల పేర్లను తిరస్కరించారు. బ్యాంకర్లు, లేదంటే వ్యవసాయ, రెవిన్యూ శాఖల్లో జరిగిన తప్పులకు తమన బాధ్యలు చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోయారు. మూడు విడత రుణమాఫీ ముగిసిందని, హామీని పూర్తిచేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో రుణమాఫీ జరగని రైతులంతా జిల్లాలా వారీగా రోడ్లెక్కడం మొదలు పెట్టారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అర్హులైన రైతులకు కచ్చితంగా రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది.
వ్యవసాయశాఖ ఇంటింటి సర్వే
రకరకాలైన కారణాలతో రుణాలు మాఫీ కాని రైతులను తమ సమస్యలను వివరిస్తూ ఇప్పటికే జిల్లా అధికారులకు, ముఖ్యంగా వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించి అర్హులకు న్యాయం చేసేందుకు వ్యవసాయశాఖ మండల ఏఓలను నోడల్ అధికారులుగా నియమించింది. రుణ మాఫీ కానీ రైతులంతా తమ తమ మండల వ్యవసాయశాఖ అధికారులను కలిసి వివరాలు సమర్పించాలని కోరింది. ఇలా ఇప్పటికే ఒక్క నల్గొండ జిల్లాలోనే 13 వేల ఫిర్యాదుల అందినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రైతులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలను సరిదిద్ది వారికి రుణమాఫీ వర్తించేలా చూసేందుకు వ్యవసాయ శాఖ ఇంటింటి సర్వే మొదలు పెట్టనుంది. ఈ వారంలోపే రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్ ను తయారు చేస్తోందని, యాప్ అందుబాటులోకి రాగానే ఇంటింటి సర్వే మొదలవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్పాయి.
(రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )