తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Runamafi : మీకు రుణమాఫీ కాలేదా..? ఈ విషయాలను తెలుసుకోండి..!

Rythu RunaMafi : మీకు రుణమాఫీ కాలేదా..? ఈ విషయాలను తెలుసుకోండి..!

17 August 2024, 23:26 IST

google News
    • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 3 విడతల్లో రూ. 2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసేలా అడుగులు వేసింది. పలు జిల్లాల్లోని రైతులు రుణమాఫీ జరగలేదని చెబుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు వ్యవసాయశాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది.
తెలంగాణలో రుణమాఫీ
తెలంగాణలో రుణమాఫీ

తెలంగాణలో రుణమాఫీ

రుణమాఫీ ప్రక్రియను సవాల్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం… మూడు విడతల్లో నిధులను విడుదల చేసింది. దశల వారీగా రూ. 2 లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేసేలా అడుగులు వేసింది. ఇటీవలే మూడో విడత లిస్ట్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సంబంధిత రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే పలు జిల్లాల్లోని కొందరు రైతులు తమకు రుణమాఫీ కాలేదని చెబుతున్నారు. ఇందుకోసం బ్యాంక్ అధికారులను సంప్రదిస్తున్నారు. పలు రకాల సాంకేతిక సమస్యలతో కొందరు రైతులకు మాఫీ జరగలేని తెలుస్తోంది. ఇలాంటి సమస్యలను క్లియర్ చేసేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టి… ఈ తరహా రైతులను గుర్తించాలని నిర్ణయించింది.

మండల వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ జరగనుంది. వీరి రైతుల వద్దకు వెళ్లి వివరాలను సేకరించనున్నారు.ఈ వివరాలను ఎప్పటికప్పుడు పై అధికారులకు చేరవేస్తారు. తప్పులు సరిచేసి క్రాప్‌ లోన్‌ వీవర్‌ వెబ్ సైట్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లో ఏమైనా తప్పులు దొర్లితే.. సంబంధిత పత్రాల కాపీలను తీసుకుంటారు. పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు. తీసుకున్న అప్పు, వడ్డీ విషయానికి సంబంధించి కూడా పలు వివరాలను సేకరించే అవకాశం ఉంది. వీరి సమస్యలను విశ్లేషించి… అర్హత కలిగిన రైతులకు రుణమాఫీ స్కీమ్ ను వర్తింపజేయనున్నారు.

రైతు రుణమాఫీకి సంబంధించి వ్యవసాయశాఖ మూడు విడతల లిస్ట్ లను వెల్లడించింది. ఇందులో కొందరి రైతుల పేర్లు లేవు. దీంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. అయితే రేషన్ కార్డు లేని రైతు కుటుంబాల ఖాతాల విషయంలో తప్పులు దొర్లినట్లు తెలిసింది. వీరి ఖాతాలను మరోసారి పరీశిలించి…రుణమాఫీ చేయనుంది.

ఇక రెండు లక్షలకు పైన రుణాలు ఉన్న రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అందింది. రూ.2 లక్షల కంటే ఎక్కువ డబ్బులు ఉంటే... ఆ ఎక్కువ ఉన్న మొత్తాన్ని రైతులు తొలుత చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం రూ.2 లక్షలను మాఫీ చేయనుంది. ఏ సమయంలోపు పై డబ్బులను చెల్లంచాలి..? ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఈ డబ్బులను జమ చేస్తుందనే దానిపై వ్యవసాయశాఖ నుంచి మరింత క్లారిటీ రావాల్సి ఉంటుంది.

మరోవైపు రుణమాఫీ తీరుపై ప్రతిపక్ష బీఆర్ఎస్…తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) లెక్క రూ. 49,500 కోట్లుగా ఉందని , కేబినెట్ భేటీలో చెప్పింది మాత్రం రూ. 31 వేల కోట్లు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. బడ్జెట్లో కేటాయించింది రూ. 26 వేల కోట్లు అయితే… 3 విడతల వారీగా కలిపి ఇచ్చింది రూ. 17933 కోట్లు మాత్రమే అంటూ రాసుకొచ్చారు. రుణమాఫీపై నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెపుతామన్నారు. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం