RaithuRunaMafi: రేపే మూడో విడత రైతు రుణమాఫీ నిధులు, 14లక్షల మందికి ప్రయోజనం, రెండు లక్షల్లోపు అప్పు మాఫీ
RaithuRunaMafi: తెలంగాణలో మూడో విడత రైతు రుణమాఫీకి ముహుర్తం ఖరారైంది. ఇప్పటికే రెండు విడతల్లో రైతుల రుణాలను మాఫీ తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసింది. మొదటి విడతల 11లక్షలమందికి, రెండో విడతలో ఆరున్నర లక్షల మందికి రుణమాఫీ చేశారు. తాజాగా రెండు లక్షల్లోపు రుణాలను మాఫీ చేయనున్నారు.
RaithuRunaMafi: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన రూ.2లక్షల్లోపు రైతు రుణ మాఫీ తుది విడత చెల్లింపుకు ముహుర్తం ఖరారైంది. పంద్రాగస్టు రోజున ఖమ్మం జిల్లా వైరాలో మూడో విడత రైతు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. ఇప్పటికే రెండు విడతల్లో రైతు రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసింది. మొదటి విడతలో లక్షలోపు రుణాలను మాఫీ చేశారు. రెండో విడతలో లక్షన్నర రుణాలను మాఫీ చేశారు. చివరి విడతలో రెండు లక్షల్లోపు రుణాలను మాఫీ చేయనున్నారు.
తెలంగాణలో చివరి విడత రుణమాఫీని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 14లక్షల మందికి మూడో విడతలో రైతు రుణమాఫీ అమలు చేయనున్నారు. హైదరాబాద్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత సీఎం వైరాకు వెళ్తారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తర్వాత జరిగే బహిరంగ సభలో రుణమాఫీ నిధులు విడుదల చేస్తారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.2లక్షల్లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే రూ.లక్ష రుణాన్ని మాఫీ చేశారు. తెలంగాణలో 11,34,412 మందికి రూ.6034 కోట్లను ఇప్పటికే చెల్లించారు.
రెండో విడతలో 6,40,223మందికి రూ. 6190 కోట్లను విడుదల చేశారు. మొదటి రెండు విడతల్లో రుణమాఫీ లబ్ది పొందిన వారిలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో, చివరి స్థానంలో హైదరాబాద్ ఉంది.
2024 మే6న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే రూ.లక్ష, లక్షన్నర లోపు రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆగస్టు నాటికి మొత్తం రూ.2 లక్షల రుణమాఫీ పూర్తవుతుందని గతంలో ప్రకటించారు. ఆగస్టు 15తో రూ.2లక్షలోపు రుణాల మాఫీని పూర్తి చేయనున్నారు.
తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేస్తామని చెప్పినట్టే రైతాంగానికి రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు.బ్యాంకుల్ని మోసం చేసే ఉద్దేశంతో రుణాలు తీసుకుని, దివాళా తీసాయని మభ్య పెట్టి దాదాపు రూ.14లక్షల కోట్ల రుపాయలు బ్యాంకులకు ఎగవేశారని ఆరోపించారు. ఆగస్టు నెలాఖరులోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు. జూలై, ఆగస్టలో చరిత్రలో నిలిచిపోతాయని రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రూ.31వేల కోట్ల రుణమాఫీని చేయలేదని రేవంత్ రెండో విడత నిధుల విడుదల సందర్భంగా చెప్పారు.
మూడో విడతకు నిధుల కేటాయింపు..
రైతు రుణమాఫీ సాధ్యం కాదని విపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జులై 18న మొదటి విడతలో 1114,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేశారు.
జులై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే రెండో విడతలో రూ. లక్షన్నర వరకు రుణమున్న రైతు కుటుంబాలకు మాఫీ చేశారు. దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేశారు. రెండు వారాల్లో దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లను చెల్లించారు.
మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు జరిపారు.
నేడు రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి…
పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ తిరిగి రానున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ఇతర అధికారుల బృందం బుధవారం ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్ర యానికి చేరుకుంటారు. ఆగస్టు 3న రేవంత్ బృందం విదేశీ పర్యటనకు వెళ్లింది. అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, డాలస్, శాన్ ఫ్రాన్సిస్‌కో నగరాల్లో పర్యటించారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు.ఈ పర్యటనలో రూ.31వేల కోట్లకు పైగా పెట్టుబడులు 30వేల ఉద్యోగాలను తెలంగాణకు వచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారు.
సంబంధిత కథనం