AP New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ..! డిజైన్ల ఖరారుపై కసరత్తు, ఈ 'సర్టిఫికెట్' ఉండాల్సిందే...!-the process of issuing new ration cards will start soon in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ..! డిజైన్ల ఖరారుపై కసరత్తు, ఈ 'సర్టిఫికెట్' ఉండాల్సిందే...!

AP New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ..! డిజైన్ల ఖరారుపై కసరత్తు, ఈ 'సర్టిఫికెట్' ఉండాల్సిందే...!

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 11, 2024 07:04 AM IST

AP New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన డిజైన్లను పౌరసరఫరాల శాఖ పరిశీలిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయనుంది. ముందుగా కొత్తగా పెళ్లైన వారికి త్వరితగతిన కార్డులను పంపిణీ చేసే అవకాశం ఉంది.

త్వరలోనే ఏపీలో కొత్త రేషన్ కార్డులు
త్వరలోనే ఏపీలో కొత్త రేషన్ కార్డులు

AP New Ration Cards : ఏపీలో చాలా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన చాలా మందికి రేషన్ కార్డులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేృతృత్వంలోని ప్రభుత్వం… కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టిపెట్టింది. సాధ్యమైనంత త్వరగా ఈ కార్డులను అందజేయాలని భావిస్తోంది.

కొత్త రేషన్ కార్డుల డిజైన్లను పరిశీలిస్తున్న పౌరసరఫరాల శాఖ…త్వరలోనే తుది డిజైన్ ను ఖరారు చేయనుంది. ఆ వెంటనే కార్డుల జారీ కోసం ప్రకటన వెలువడనుంది. అయితే ఇకపై రేషన్ కార్డు తీసుకోవాలనుకునే కొత్త జంట.. తప్పనిసరిగా మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది.

ఇటీవలే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు. కొత్త కార్డులను డిజైన్ చేసే పనిలోనే ఉన్నామని చెప్పారు.

కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని…. ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నామని నాదెండ్ల తెలిపారు. వివాహం చేసుకొని రేషన్ కార్డులో పేర్లు లేనివారిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఓ కార్యక్రమాన్ని చేపడుతామనిపేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులను తప్పకుండా జారీ చేస్తామని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ముందుగా ఎవరైతే వివాహం చేసుకుని పేర్లు నమోదు చేసుకోలేదో వారిని గుర్తిస్తామని మంత్రి నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా చూస్తే త్వరలోనే ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉంది.

తెలంగాణలో రేషన్ కార్డులు - అర్హతలివే

మరోవైపు రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, మాగాణి 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2 లక్షలు ఉన్న కుటుంబాలను తెల్ల రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.

అలాగే రెండు రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.

రేషన్ కార్డులు జారీపై అన్ని పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల సలహాలు తీసుకోవాలని కేబినెట్ ఉపసంఘం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి వారి సూచనలు తీసుకోవాలని యోచిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సక్సేనా కమిటీ సిఫార్సులను తెల్ల రేషన్‌ కార్డుల జారీలో పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల తెల్ల రేషన్‌ కార్డులున్నాయన్నారు. 10 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Whats_app_banner