3rd Phase Rythu Runa Mafi : రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ - రైతుల అకౌంట్లలోకి నిధుల జమ ప్రక్రియ ప్రారంభం, లిస్ట్ విడుదల-cm revanth released the third installment of loan waiver funds to farmer accounts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  3rd Phase Rythu Runa Mafi : రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ - రైతుల అకౌంట్లలోకి నిధుల జమ ప్రక్రియ ప్రారంభం, లిస్ట్ విడుదల

3rd Phase Rythu Runa Mafi : రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ - రైతుల అకౌంట్లలోకి నిధుల జమ ప్రక్రియ ప్రారంభం, లిస్ట్ విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 15, 2024 05:55 PM IST

రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలకు సంబంధించిన నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వైరా వేదికగా పలువురు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలను మాఫీ చేసి చూపించామన్న రేవంత్ రెడ్డి… ఎమ్మెల్యే హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

మూడో విడత రైతు రుణమాఫీ విడుదల కార్యక్రమం
మూడో విడత రైతు రుణమాఫీ విడుదల కార్యక్రమం

మూడో విడత రైతు రుణమాఫీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం… పలువురు రైతులకు చెక్కులను అందజేశారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగనుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి చూపించామన్నారు. మాట ఇచ్చామంటే తప్పే విధానం కాంగ్రెస్ లో లేదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇదే సమయంలో రుణమాఫీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని చెప్పిన హరీశ్ రావు మాట తప్పవద్దన్నారు. క్షమాపణ చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ. 31వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కేవలం 8 నెలల కాలంలోనే…. కీలక హామీలను అమలు చేసి చూపించామన్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పారు. త్వరలోనే ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లను జారీ చేస్తామని ప్రకటించారు.

“ఖమ్మం గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా. మే 6, 2022న రైతు డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా రుణమాఫీ చేస్తున్నాం. 8 నెలల్లోపే రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించాం. హరీశ్ రావు తన మాటపై నిలబడి రాజీనామా చేయాలి. సిద్ధిపేటలో ఉప ఎన్నిక వస్తే ఎలా గెలుస్తాడో చూస్తాం” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

ఆ బాధ్యత నాది - సీఎం రేవంత్ రెడ్డి

“మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు మేం నిరంతరం కృషి చేస్తున్నాం. ఈ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసాం. బీఆరెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లు ఇచ్చినా.. 7 చోట్ల డిపాజిట్లు పోయినా ఇంకా మీ బుద్ధి మారలేదా..? 2026 పంద్రాగస్టులోగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఖమ్మం జిల్లాలో 7లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని వైరా గడ్డ నుంచి మాట ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఏడాదిలోగా 65వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. మీరు అండగా ఉంటే.. బీఆరెస్ ను సమూలంగా పెకలించి బంగాళాఖాతంలో విసిరేసే బాధ్యత నేను తీసుకుంటా” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో బీజేపీకి జాగా లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. “తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 సీట్లు ఇస్తే.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వాళ్లు గాడిద గుడ్డు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బీఆరెస్ కు విసిరిన సవాలుతో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై ఏ సెంటర్ లోనైనా చర్చకు సిద్ధం. హరీష్,కేటీఆర్ ఎవరు వస్తారో రండి... అమరవీరుల స్థూపం వద్దనైనా చర్చకు సిద్ధం” అంటూ ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.