Khammam Sitarama Project : సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - పైలాన్ ఆవిష్కరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మరోవైపు కమలాపురంలో మూడో పంప్ హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కు 2016 ఫిబ్రవరి 16న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
సీతాారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ కావటంతో ఇవాళ కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు పొంగులేటి, తుమ్మలతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కూడా పాల్గొన్నారు.
సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములకలపల్లి మండలం కమలాపురంలో 3వ పంప్ హౌస్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మరోవైపు మొదటి పంప్‌హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు.
పంప్ హౌస్ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్ట్ పూర్తికి సహకరిస్తున్నామన్నారు. ఇది మా ప్రభుత్వ విశ్వసనీయతకు గుర్తింపు వంటిదని వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్ట్….!
సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లా ప్రజల కలల ప్రాజెక్ట్ గా చెబుతారు. నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ తరహా ప్రాజెక్ట్ కోసం తుమ్మల ప్రయత్నాలు చేసినప్పటికీ నిధుల సమస్యతో ఉమ్మడి రాష్ట్రంలో ఆ కల సాకారం కాలేదు. అనంతరం కేసీఆర్ కేబినెట్ లో తుమ్మలకు అవకాశం దక్కడంతో సీతారామకు పునాది పడింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం జరిగి 2104 ఎన్నికల్లో తుమ్మల ఓటమి చెందినప్పటికీ… ఆయనకు మంత్రి పదవి దక్కింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా భూముల్లో పచ్చని పంటలు పండాలంటే సాగు నీటి ప్రాజెక్ట్ ఎంతో అవసరమని భావించిన తుమ్మల గోదావరి జలాలను లిఫ్ట్ చేసేలా తనకున్న అనుభవంతో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గోదావరి జలాలను పారించాలన్న తలంపుతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తుమ్మల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి ప్రాజెక్ట్ పేరును శ్రీ రాముడు కొలువైన ప్రాంతం భద్రాచలం కావడంతో "సీతారామ" ప్రాజెక్ట్ గా నాడు కేసీఆర్ నామకరణం చేశారు.
సీతారామ ప్రాజెక్ట్ కు 2016 ఫిబ్రవరి 16న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై కాటన్ నిర్మాణం చేసిన దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్ధ్యంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. సీతమ్మ సాగర్ బ్యారేజ్ 36 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతుండగా గోదావరి జలాలను లిఫ్ట్ చేసి స్టోర్ చేసేందుకు రిజర్వాయర్లు నిర్మాణం చేశారు.
పనులపై తుమ్మల స్పెషల్ ఫోకస్…
రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి గా తుమ్మలకు అవకాశం దక్కడంతో సీతారామ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత ఐదేళ్లుగా నత్తనడకన సాగిన సీతారామ ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే పట్టుదలతో మంత్రి తుమ్మల ఉన్నారు.
యుద్దప్రాతిపదికన ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం కోసం అధికారులతో వరుసగా సమీక్షలు చేస్తూ వస్తున్నారు. గోదావరి, కృష్ణా రెండు బేసిన్ల మధ్య రెండు పంటలు పండితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారనుంది. ఈ క్రతువులో సీతారామ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.