Rythu Runa Mafi : మీ రుణమాఫీ నిజమైతే కొడంగల్ కు వెళ్దామా..? సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్-ktr challenges cm revanth reddy that he will resign to his post over 100 percent rythu runamafi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Runa Mafi : మీ రుణమాఫీ నిజమైతే కొడంగల్ కు వెళ్దామా..? సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్

Rythu Runa Mafi : మీ రుణమాఫీ నిజమైతే కొడంగల్ కు వెళ్దామా..? సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 16, 2024 03:00 PM IST

రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రుణమాఫీ నిజమైతే…కొడంగల్ నియోజకవర్గానికి మీడియాతో కలిసి వెళ్దామంటూ సవాల్ విసిరారు. ప్రతి నియోజకవర్గంలో రుణమాఫీ మోసాన్ని ఎండగడుతామని కామెంట్స్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

రైతు రుణమాఫీ మూడో విడత నిధుల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. రుణమాఫీ పచ్చి అబద్ధమని, చాలా మంది రైతులకు రుణాలు మాఫీనే కాలేదంటూ ఆరోపిస్తున్నారు.

ఇదే విషయంపై శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రుణమాఫీ నిజమైతే…కొడంగల్ నియోజకవర్గానికే మీడియాతో కలిసి వెళ్దామంటూ సవాల్ విసిరారు.

రాజకీయాలను వదిలేస్తా - కేటీఆర్ సవాల్

“ఒక్క రైతు వేదికలో వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా నేను రాజకీయాలను వదిలేస్తా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ పచ్చిమోసాన్ని మేము ఎండగడతాం. సీఎంకు దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్నా. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే రేవంత్ రెడ్డిని ప్రజలు పుట్ బాల్ ఆడుతారు. సగం కూడా రుణమాఫీ చేయకుండా మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ చేశామని చెబితే అది సంపూర్ణంగా దిగజారటమే” అవుతుందని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

రుణమాఫీ పచ్చి మోసం, పచ్చి దగా అని కేటీఆర్ అభివర్ణించారు. రైతులను మోసం చేసినందుకు సీఎం పై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పిచ్చి, పిచ్చి మాటలు మానేయాలని కోరారు. సీఎం రైతుల దగ్గరకు పోతే వాళ్లే ఆయన్ను చెడుగుడు ఆడుతారని చెప్పారు. ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి, దివాళా తీసిన ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదంటూ కామెంట్స్ చేశారు.

"డిసెంబర్ 9 నాడు ఒకే సంతకంతో 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. కేసీఆర్ చేసిన రుణమాఫీ పొందిన వాళ్లు కూడా రుణమాఫీకిి అర్హులని చెప్పారు. రెండు లక్షల రుణమాఫీ అన్నప్పుడు ఎంత అవుతుందని అందరూ లెక్క వేశారు. రూ.40 వేల కోట్లు ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే ఎంత విషయమని రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం 2 లక్షల రుణమాఫీ కోసం రూ. 35 వేల కోట్లు కావాలని దినపత్రికల్లో కూడా రాశారు. ఈ సీఎం రేవంత్ రెడ్డియే రుణమాఫీకి కోసం రూ. 40 వేల కోట్లు కావాలని చెప్పారు. ఆ తర్వాత లెక్క మారింది. రూ. 31 వేల కోట్లకే రుణమాఫీ అని కేబినేట్ తీర్మానం చేసింది. 60 శాతం మందికి ఎగ్గొట్టి ఏదో విధంగా రుణమాఫీ చేశామనే మోసం చేస్తున్నారు. 40 శాతం మాత్రమే రుణమాఫీ చేసి అతి పెద్ద దగా, మోసం చేశారు" అని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు.

వైరా సభ వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి… గురువారం హరీశ్ రావుకు సవాల్ విసిరారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పిన హరీశ్ రావు మాటపై నిలబడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో క్షమాపణలు చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ హరీశ్ రావు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ పచ్చి అబద్ధమని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మొక్కిన దేవుళ్ల వద్దకు స్వయంగానే తానే వెళ్తానంటూ చురకలు అంటించారు.

తాము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యిందని హరీశ్ రావు గుర్తు చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా, 17,869 కోట్లు మాత్రమే అవుతాయా…? ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది. మీరు దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దుంకి ఎవరు చావాలి..?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.