CM Revanth vs Harish Rao : రాజీనామాపై సీఎం రేవంత్ ఛాలెంజ్ - రుణమాఫీ పచ్చి అబద్ధమన్న హరీశ్
రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పిన హరీశ్ రావు.. తన మాటపై నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దమ్ముంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. రుణమాఫీ పచ్చి అబద్ధమని కౌంటర్ ఇచ్చారు.
పంద్రాగస్టు వేళ ఎమ్మెల్యే హరీశ్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గడువులోపే రుణమాఫీ చేశామని… చీము, నెత్తురు ఉంటే హరీష్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా వైరా బహిరంగసభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి…. రాజీనామాకు ముందుకు రాకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. రాజీనామా చేస్తే సిద్ధిపేటలో ఎలా గెలుస్తావో కూడా చూస్తానంటూ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయిందన్నారు.
హరీశ్ రావు రియాక్షన్….
సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుచుకుంటున్నాడని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని విమర్శించారు. అబద్దం కూడా సిగ్గుపడి మూసిలోకి దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉందని ఓ ప్రకటనలో తెలిపారు.
“అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40వేల కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తాన్నన్నది రేవంత్ రెడ్డే. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు. ఆగస్టు 15తేదీ వరకు 31వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికలలో ఊదరగొట్టిండు. అంటే 9వేల కోట్లు కోత పెట్టిండు. అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు. సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా తన నిజస్వరూపాన్ని ఈ రోజు బట్టబయలు చేసుకున్నాడు” అంటూ హరీశ్ రావు బదులిచ్చారు.
తాము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యిందని హరీశ్ రావు గుర్తు చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా, 17,869 కోట్లు మాత్రమే అవుతాయా…? ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది. మీరు దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దుంకి ఎవరు చావాలి..?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.
“రేవంత్ రెడ్డి నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పి నువ్వు చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాని నీకు ఆ సంస్కారం లేదు. నీలో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో..! నువ్వు చేసిన పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని నేను ఆందోళనకు గురవుతున్నాను” అంటూ తన ప్రకటనలో రాసుకొచ్చారు.
“ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పాడో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలోనే నేనే స్వయంగా పోతా. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తాను” అంటూ హరీశ్ కౌంటర్ ఇచ్చారు.