ktr apologize: నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
ktr apologize: తెలంగాణలో మహిళల బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపాయి. మంత్రి సీతక్క సహా.. కాంగ్రెస్ మహిళా నేతలు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కేటీఆర్ విచారం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. పార్టీ నేతల సమావేశంలో తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. 'నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల.. మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే.. నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఏంటీ వివాదం..
రాష్ట్రంలో మనిషికో బస్సు వేయాలని.. అప్పుడు కుటుంబాలకు కుటుంబాలు బస్సులో ఎక్కి బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క సహా.. కాంగ్రెస్ మహిళా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
'బస్సుల్లో అల్లం, ఎల్లిపాయలు ఒలిస్తే తప్పా అని సీతక్క అడుగుతున్నారు. అది తప్పని మేం ఎక్కడన్నాం. కాకపోతే దాని కోసమే బస్సు పెట్టారని మాకు తెలియదు. అందుకే ఇన్నిరోజులు మామూలుగా బస్సులు నడిపాం. మనిషికో బస్సు పెట్టండి. అప్పుడు కుటుంబాలకు కుటుంబాలు బస్సుల్లో ఎక్కి కుట్లు, అల్లికలు చేసుకుంటారు. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటారు. మేం ఎందుకు వద్దాంటాం' అని కేటీఆర్ కామెంట్ చేశారు.
గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఉందా..
తమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆఖరికి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తల పట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చూస్తున్నాం. ఇలా గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఉందా అని కేటీఆర్ నిలదీశారు.
మహిళా కమిషన్ సీరియస్..
మరోవైపు కేటీఆర్ కామెంట్స్‌పై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మహిళలను కించపరిచేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని.. కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆక్షేపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తాజాగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.