Joinings in BRS: స్టేషన్ ఘనపూర్‌కు త్వరలో ఉప ఎన్నిక: కేటీఆర్
Joinings in BRS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. త్వరలో రాష్ట్రంలో ఓ ఉప ఎన్నిక రాబోతోందని.. ఆ ఎన్నికలో కారు పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన బై ఎలక్షన్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కీలక అసెంబ్లీ స్థానం స్టేషన్‌ఘనపూర్‌కు త్వరలో ఉపఎన్నిక వస్తుందని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో తాటికొండ రాజయ్య విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన కేటీఆర్.. మూడు ఉప ఎన్నికలు ఒకేసారి వచ్చేలా ఉన్నాయన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై హైకోర్టులో కేసునడుస్తోందని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు.
కడియంపై గుర్రుగా గులాబీ బాస్..
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కారు పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి పోటీచేసి విజయం సాధించారు. అయితే.. 2024 పార్లమెంట్ ఎన్నికల సమయానికి రాజకీయం పూర్తిగా మారిపోయింది. కడియం శ్రీహరి కారు దిగి హస్తం గూటికి చేరారు. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ కడియంపై గుర్రుగా ఉన్నారు. అనేక సందర్భాల్లో కడియం శ్రీహరిని కేటీఆర్ సహా.. ఇతర గులాబీ నేతలు విమర్శించారు.
సొంత గూటికి రాజయ్య..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత.. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీని వీడారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని అంతా అనుకున్నారు. కానీ రాజయ్య తటస్థంగానే ఉన్నారు. దీంతో కొందరు బీఆర్ఎస్ లీడర్లు రాజయ్యకు టచ్‌లోకి వెళ్లారు. మళ్లీ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. గులాబీ బాస్ నుంచి హామీ ఇప్పించారు. దీంతో రాజయ్య తాజాగా మళ్లీ కారెక్కారు. తన అనుచరులతో కలిసి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
వారిపైనే గురి..
ఒక్క కడియం శ్రీహరి మాత్రమే కాదు.. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మరికొందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ గట్టి పోరాడుతోంది. ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని కోర్టుల వరకూ వెళ్లింది. ఈ వ్యవహారంపై త్వరలోనే తీర్పు వస్తుందని.. వారందరిపై వేటు పడుతుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ బై ఎలక్షన్ కామెంట్స్ చేశారని తెలుస్తోంది.
బీఆర్ఎస్‌కు రెండు మాత్రమే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలుండగా.. కేవలం రెండు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి విజయం సాధించారు. ఆ తర్వాత కడియం పార్టీ మారారు. దీంతో ఉమ్మడి జిల్లా మొత్తంలో బీఆర్ఎస్‌కు కేవలం ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారు. కేటీఆర్ చెప్పినట్టు నిజంగానే స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక వస్తే.. ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి.
మరో 50 ఏళ్లు పక్కా..
త్వరలో బీఆర్ఎస్ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం చేసే ప్రసక్తే లేదన్న కేటీఆర్.. మరో 50 ఏళ్లు పార్టీని నడుపుతామని తేల్చి చెప్పారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రుణమాఫీ కాలేదు.. సభకు రాహుల్ గాంధీ రాలేదని ఎద్దేవా చేశారు. సన్నవడ్లకే బోనస్ అని రేవంత్ మాట మార్చారన్న కేటీఆర్.. కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటున్నారని.. రేవంత్‌రెడ్డి అన్నదమ్ముల కుటుంబం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎక్కడచూసినా రేవంత్ తమ్ముళ్ల ఫొటోలే కనిపిస్తున్నాయని విమర్శించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం అని మోసం చేశారని కేటీఆర్ ఫైరయ్యారు.