Congress Vs BRS : కేసీఆర్ ప్లాన్ అమలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై దృష్టి-congress implementing kcr plan to merge brs lp into congress lp on operation akarsh ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Vs Brs : కేసీఆర్ ప్లాన్ అమలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై దృష్టి

Congress Vs BRS : కేసీఆర్ ప్లాన్ అమలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై దృష్టి

HT Telugu Desk HT Telugu
Aug 06, 2024 05:10 PM IST

Congress Vs BRS : బీఆర్ఎస్ ఎల్పీని ఎలాగైనా కాంగ్రెస్ లో విలీనం చేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తుండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గేటు దాటిపోకుండా ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడిని వారిపై చర్యల కోసం కోర్టులకెక్కుతున్నారు.

కేసీఆర్ ప్లాన్ అమలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై దృష్టి
కేసీఆర్ ప్లాన్ అమలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై దృష్టి

Congress Vs BRS : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు గడిచాయి. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ వేసిన రాజకీయాల దారిలోనే కాంగ్రెస్ పయనిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 64 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కూడా గెలుచుకుని 65 ఎమ్మెల్యేలకు బలం పెంచుకుంది. ఈ లోగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన రాజకీయ ప్రకటనల నేపథ్యంలో.. తక్కువ మెజారిటీ సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు బీఆర్ఎస్ నుంచి ఏకంగా 9 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుంది. దీంతో శాసనసభలో ఆ పార్టీ సంఖ్య 74కు చేరింది. మిత్రపక్షం సీపీఐని కూడా కలిపితే 75 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది.

కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్ ఏమిటి..?

తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ఆ హోదా లేకుండా చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే జారిపోయిన వారు జారీపోగా మిగిలిన వారిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నాయకత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు నివేదించడంతో పాటు హైకోర్టును కూడా ఆశ్రయించింది. ‘ రాష్ట్రంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం. పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేలా, అనర్హత ప్రకటించేలా సుప్రీంకోర్టులో పోరాడుతాం..’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్నటికి నిన్న దేశ రాజధాని దిల్లీలో మీడియా ముఖంగా ప్రకటించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పిల్లీ ఎలుక ఆట

ఒక పార్టీలో గెలిచిన ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార పక్షంలోకి మారిపోవడం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చి పాలన చేసిన పదేళ్ల కాలం, ప్రస్తుత కాంగ్రెస్ 9 నెలల పాలన గురించే మాట్లాడుకోవాల్సి వస్తే.. రాజకీయ పునరేకీకరణ పేర ఇరత పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను గంపగుత్తగా తీసుకొచ్చి తమ పార్టీ కండువాలు కప్పింది తొలుత బీఆర్ఎస్ అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ ఆపని చేస్తోంది.

బొటా బొటీ మెజారిటీతో (63 స్థానాలు) తొలిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తమ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు జరిగాయని సమాచారం ఉందంటూ టీడీపీకి చెందిన 15 మంది సభ్యులకు గాలం వేసింది. వీరిలో పది మంది తమ ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్షాన్ని(టీడీఎల్పీ) నాటి టీఆర్ఎస్ శాసన సభా పక్షంలో విలీనం చేస్తున్నామని స్పీకర్ కు లేఖ రాసి విలీనం అయ్యారు. 2016లో జరిగిన ఈ ఉదంతం రాష్ట్రంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేసింది. ఈ కారణంగానే 2018 ఎన్నికల్లో టీడీపీ కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలనే గెలిపించుకోగలింది. 2023 నాటికి అసలు పోటీ కూడా చేయకుండా చేతులు ఎత్తేసింది.

రివర్స్ అయిన కేసీఆర్ వ్యూహం

ఇక, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా 88 స్థానాలను గెలుకుంది. కాంగ్రెస్ 19 స్థానాలకే పరిమితం అయ్యింది. అయినా, కాంగ్రెస్ శాసన సభాపక్షం లేకుండా, సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం దక్కుండా కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడంలో కాంగ్రెస్ కు శాసనసభా పక్ష హోదా దక్కకుండా పోయింది. అవసరం అయిన దానికంటే ఎక్కువ మెజారిటీ ఉన్నా.. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు నాటి సీఎం కేసీఆర్ పన్నిన వ్యూహం ఇప్పుడు ఆ పార్టీకే తిరగబడినట్లు అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2023 ఎన్నికల్లో కేవలం 64 మంది ఎమ్మెల్యేలను ఆ తర్వాత ఉపఎన్నికల్లో ఒక స్థానంతో 65 మంది ఎమ్మెల్యేల, మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యేను కలిపితే.. 66 మందితో కాంగ్రెస్ కూడా బొటాబొటీ మెజారిటీతోనే పాలన చేస్తోంది. దీంతో నాడు బీఆర్ఎస్ వేసిన మంత్రాన్నే కాంగ్రెస్ కూడా ప్రయోగిస్తోంది.

బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై కాంగ్రెస్ నజర్

66 మంది ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ ఆ సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. ప్రభుత్వాన్ని పడగొడతాం, ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతల ప్రకటన నేపథ్యంలో.. మేం మాత్రం చూస్తూ ఊరుకుంటామా అంటూ కాంగ్రెస్ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ పై నజర్ పెట్టింది. గత ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకుంది. వీరిలో ఇప్పటికే తొమ్మది మంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. కంటోన్మెంట్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో కోల్పోయింది.

ఇప్పుడు బీఆర్ఎస్ చేతిలో 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా మరికొందరు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారని వస్తున్న నేపథ్యంలో వారు కూడా జారిపోకుండా బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ కు ఫిర్యాదులు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు అంటూ హడావిడి చేస్తోందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే శాసనసభా పక్షం ఇతర పార్టీలో విలీనం జరుగుతుంది. యాంటీ డిఫెక్షన్ యాక్టు కింద చర్యలు తీసుకోవడానికి, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉంటుంది.

మరో 17 మంది గేటు దాటితే

బీఆర్ఎస్ నుంచి మొత్తంగా 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్ ఎల్పీ రద్దు కావడమే కాకుండా ప్రతిపక్ష నాయకుని హోదాను కేసీఆర్ కోల్పోతారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ .. దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ .. కడియం శ్రీహరి, బాన్సువాడ ... పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ... కాలే యాదయ్య, గద్వాల్ .. క్రిష్ణ మోహన్ రెడ్డి, రాజేందర్ నగర్ .. ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ... అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. వీరు కాకుండా ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేషం, బొగ్గారపు దయానంద్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరో 17 మంది ఎమ్మెల్యేలు గేటు దాటితే బీఆర్ఎస్ కష్టాల్లో పడ్డట్టే. దీనిని అడ్డుకునేందుకే బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )

సంబంధిత కథనం