BRS MLAs : అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన - ఎమ్మెల్యేలను బయటకు ఎత్తుకెళ్లిన మార్షల్స్-brs mlas lifted by marshals over protesting in assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Mlas : అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన - ఎమ్మెల్యేలను బయటకు ఎత్తుకెళ్లిన మార్షల్స్

BRS MLAs : అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన - ఎమ్మెల్యేలను బయటకు ఎత్తుకెళ్లిన మార్షల్స్

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 01, 2024 02:28 PM IST

BRS MLAs Lifted By Marshals : అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకొని… తెలంగాణ భవన్ కు తరలించారు.

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

BRS MLAs Lifted By Marshals : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై నిన్న ఆందోళన చేయగా… ఇవాళ ఉదయమే స్పీకర్ కు వాయిదా తీర్మానం ఇచ్చింది.

తమ తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది బీఆర్ఎస్. సభలో మహిళా సభ్యులను అవమానించారని.. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే స్పీకర్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సుప్రీకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుపై మాత్రమే మాట్లాడితేనే మైక్ ఇస్తాననడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

ఇదే సమయంలో సభలో బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి మహిళా సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు. ఆ వెంటనే అక్కడికి మార్షల్స్ చేరుకున్నారు. చీఫ్ మార్షల్ ఆదేశాల మేరకు… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటికి ఎత్తుకెళ్లారు. కేటీఆర్, హరీశ్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలను బయటికి తీసుకురాగా… అక్కడ కూడా నిరసనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్ కు తీసుకెళ్లారు.

ప్రజాస్వామ్యం ఖూనీ - హరీశ్ రావు

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ… తెలంగాణలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయిందన్నారు. అసెంబ్లీలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మైక్ ఇవ్వకుండా ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవన్నారు. రాష్ట్రం మొత్తం పోలీస్ రాజ్యంగా మారిపోయిందంటూ విమర్శలు గుప్పించారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి… క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Whats_app_banner