CM Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నారు, కారణం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి-abdullapurmet cm revanth reddy says brs mlas joining to congress for state development only ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నారు, కారణం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నారు, కారణం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Jul 14, 2024 03:15 PM IST

CM Revanth Reddy : తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా బీఆరెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొందరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. ప్రభుత్వాన్ని నిలబెట్టాలని మరికొందరు మద్దతుగా వస్తున్నారన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నారు, కారణం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నారు, కారణం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : కులవృత్తులకు చేయూత అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో "కాటమయ్య రక్షణ కవచం” పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని గౌడన్నలు ఎంతో ప్రచారం చేశారని సీఎం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బలహీనవర్గాల గౌరవం పెరుగుతుందని గౌడన్నలు ప్రచారం చేశారన్నారు. పౌరుషానికి, పోరాటానికి మారుపేరు గౌడన్నలు అన్నారు. ఎవరెస్టు ఎక్కిన వారి అనుభవం గౌడన్నల రక్షణకు ఉపయోగపడిందని తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. వైఎస్ఆర్ హయాంలో బలహీన వర్గాల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకొచ్చారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు చేపట్టేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

ప్రభుత్వ భూముల్లో ఈత, తాటి చెట్లు పెంపకం

రాష్ట్రంలో వనమహోత్సవంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టాలని మంత్రి జూపల్లికి సూచిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చెరువు గట్లపై కూడా చెట్లు నాటేలా ఇరిగేషన్ విభాగంతో మాట్లాడాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచిస్తున్నానన్నారు. రహదారులు, చెరువుగట్లు, కాలువ గట్ల వద్ద తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. గౌడన్నల కులవృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కులవృత్తులపై ఆధారపడిన సోదరుల పిల్లలను ఉన్నత చదువులు చదివించండి.. వాళ్లను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారంతా భాగస్వాములు కావాలన్నారు. చట్టాలు రూపొందించే స్థాయికి గౌడన్నల పిల్లలు ఎదగాలని ఆకాంక్షించారు. బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే ఏకైక మార్గం చదువు మాత్రమే అన్నారు.

హయత్ నగర్ వరకు మెట్రో

"త్వరలోనే హయత్ నగర్ కు మెట్రో రాబోతుంది. ఇందుకు సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి. ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూమిలో వివిధ యూనివర్సిటీలను, మెడికల్ టూరిజం, పరిశ్రమల ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరం నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అణువుగా మార్చబోతున్నాం. రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతోంది. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను తీర్చిదిద్దుతాం. ఓడిపోయి ఫామ్ హౌస్ లో ఉన్నోళ్లను నేను అడుగుతున్నా...ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా ఇండస్ట్రీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ కాదా? మీరేం తెచ్చారు... డ్రగ్స్, గంజాయి తప్ప. కాంగ్రెస్ పని అయిపోయింది అన్నవాళ్లు.. ఇప్పుడు వాళ్ల వైపు ఎంతమంది ఉన్నారని లెక్కపెట్టుకునే పరిస్థితి" -సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు మద్దతుగా

తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా బీఆరెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొందరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. ప్రభుత్వాన్ని నిలబెట్టాలని వాళ్లు మద్దతుగా వస్తున్నారన్నారు. పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను అప్పులకుప్పగా మార్చారన్నారు. మేం ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం