New medical colleges : దేశంలో కొత్తగా 113 మెడికల్​ కాలేజీలు- తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..-113 new medical colleges get nmc approval 22 in up 14 in maharashtra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  New Medical Colleges : దేశంలో కొత్తగా 113 మెడికల్​ కాలేజీలు- తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..

New medical colleges : దేశంలో కొత్తగా 113 మెడికల్​ కాలేజీలు- తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..

Sharath Chitturi HT Telugu
Jul 09, 2024 10:03 AM IST

New medical colleges in India : దేశంలో 113 కొత్త వైద్య కళాశాలలు ఓపెన్​ అవ్వనున్నాయి. 2024-25 విద్యాసంవత్సరం నుంచే వీటిల్లో యూజీ కోర్సులు చెప్పనున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని దక్కాయంటే..

దేశంలో కొత్తగా 113 మెడికల్​ కాలేజీలు
దేశంలో కొత్తగా 113 మెడికల్​ కాలేజీలు (HT_PRINT)

దేశవ్యాప్తంగా 113 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులిస్తూ నేషనల్​ మెడికల్​ కమిషన్​ (ఎన్​ఎంసీ) ఆధ్వర్యంలోని మెడికల్​ అసెస్​మెంట్​ అండ్​ రేటింగ్​ బోర్డ్​ (ఎంఏఆర్​బీ) తాజాగా ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆయా కాలేజీలు, 2024-25 విద్యాసంవత్సరం నుంచే యూజీ వైద్య కోర్సులను ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది.

"2024-25 విద్యాసంవత్సరానికి గాను కొత్త అండర్​ గ్రాడ్జ్యుయేట్​ మెడికల్​ కాలేజీల స్థాపనకు అప్లికేషన్లు అందాయి. 113 అప్లికేషన్స్​కి అనుమతిస్తూ, సంబంధిత వివరాలను ఈ-మెయిల్స్​ ద్వారా ఆయా కాలేజీలకు పంపించాము," అని ఎంఏఆర్​బీ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

ఈ పబ్లిక్​ నోటీస్​తో పాటు ఆ 113 అప్లికేషన్స్​కి సంబంధించిన అప్లికేషన్​ నెంబర్స్​ని సైతం యాడ్​ చేసింది ఎంఏఆర్​బీ.

2024-25 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్​ సీట్లు పెంచేందుకు అనుమతుల కోసం పలు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటితో పాటు కొత్తగా వచ్చిన మెడికల్​ కాలేజీల వివరాలను ఎన్​ఎంసీ కొంత కాలం క్రితం ఓ లిస్ట్​ను విడుదల చేసింది. ఈ విషయంపై 170 అప్లికేషన్లు అందినట్టు, ఆయా సంస్థలకు ఈ-మెయిల్స్​ ద్వారా తుది నిర్ణయాన్ని తెలిపినట్టు స్పష్టం చేసింది.

తాజాగా.. యూపీలో 22, మహారాష్ట్రలో 14, రాజస్థాన్​లో 12, తెలంగాణలో 11, పశ్చిమ్​ బెంగాల్​లో 8, మధ్యప్రదేశ్​లో 7, ఆంధ్రప్రదేశ్​లో 7, కర్ణాటకలో 5, తమిళనాడులో 5, కేరళలో 2 వైద్య కళాశాలలు కొత్తగా ఓపెన్​ అవ్వనున్నాయి.

ఉత్తరాఖండ్​కు 3, ఒడిశా- గుజరాత్​కు రెండు, హరియాణా, అసోం, పంజాబ్​, సిక్కిం, త్రిపురలకు తలో ఒక మెడికల్​ కాలేజ్​ దక్కాయి.

113లో కొన్ని కాలేజీల వివరాలు.. దిల్లీ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్స్​ నజప్​గఢ్​ (దక్షిణ దిల్లీ), స్కూల్​ ఆఫ్​ మెడికల్​ సైన్స్​, శ్రీ సత్య సాయి యూనివర్సిటీ ఆఫ్​ టెక్నాలజీ అండ్​ మెడికల్​ సెహోర్​ (ఎంపీ), ఆటోనొమస్​ స్టేట్​ మెడికల్​ కాలేజీ కుషీనగర్​ (యూపీ), ఆటోనొమస్​ స్టేట్​ మెడికల్​ కాలేజ్​ పిల్బిత్​ (యూపీ), భరత్​ మెడికల్​ కాలేజ్​ అండ్​ హాస్పిటల్​ పురీలియా (యూపీ), అటోనొమస్​ స్టేట్​ మెడికల్​ కాలేజ్​ సొసైటీ డిస్ట్రిక్ట్​ మేల్​ అండ్​ ఫీమేల్​ హాస్పిటల్​ సుల్తాన్​పూర్​, మహాత్మ విధుర్​ ఆటోనొమస్​ స్టేట్​ మెడికల్​ కాలేజీ, బిజ్నూర్​.

ఎన్​ఎంసీ రూల్స్​ ప్రకారం ఎంఏఆర్​బీ అనుమతులు ఇవ్వందే ఏ విద్యాసంస్థ కూడా కొత్త కోర్సులను ప్రారంభించేందుకు వీలు లేదు.

అయితే కొత్త వైద్య కళాశాల అనుమతుల విషయంలో ఎన్​ఎంసీ ఇటీవలే పలు మార్పులు చేసింది. రన్నింగ్​లో ఉన్న హాస్పిటల్​, అన్ని విభాగాల్లో ఫాకల్టీ ఉంటే, ఇప్పుడు 50 సీట్లతోనే వైద్య కళాశాలను ప్రారంభించుకోవచ్చు. ఆయా హాస్పిటల్స్​కి కనీసం 200 బెడ్లు, 20 ఐసీయూ బెడ్ల కెపాసిటీ ఉండాలి.

దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ఎన్​ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.

దేశంలో ఇప్పుడు 706 మెడికల్​ కాలేజీలు ఉన్నాయి. కొత్త మెడికల్​ కాలేజీలతో ఆ సంఖ్య 800 దాటుతుంది. వీటిల్లో 50 ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా మిగిలినవి ప్రైవేట్​ లేదా డీమ్డ్​ వర్సిటీలు.

2013-14తో పోల్చుకుంటే ఎంబీబీఎస్​ కోసం యూజీ సీట్లు 110శాతం పెరిగాయి. నాడు సీట్ల సంఖ్య 51,348. ఇప్పుడు 1,08,990గా ఉంది. పీజీ కోర్సుల సీట్లు 2013-14లో 31,185 నుంచి 2023-24లో 68,073 (118శాతం) పెరిగాయి.

Whats_app_banner

సంబంధిత కథనం