CM Revanth Reddy : డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించాం.. ఇకపై కాలేజీల్లో కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థ - సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy On Drugs: తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కేరళ తరహాలోనూ మన రాష్ట్రంలోనూ కాలేజీల్లో పోలీసింగ్ సర్వీస్ విధానం అమలు చేస్తామని చెప్పారు.
CM Revanth Reddy On Drugs: మత్తు పదార్థాలపై యుద్ధంలో ప్రతి పౌరుడు సైనికుడు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు.
ఒకప్పుడు సామాజిక చైతన్య ఉద్యమాలకు నిలయమైన తెలంగాణ.. గడిచిన పదేండ్లలో గాడితప్పి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారడం శోచనీయమని వ్యాఖ్యానించారు. అసాంఘికతకు, అశాంతికి కారణమయ్యే గంజాయి, మాదకద్రవ్యాలను కూకటివేళ్లతో పెకిలించి, తెలంగాణ ఉన్నతిని తిరిగి నిలబెట్టే బాధ్యతను ప్రజాప్రభుత్వం తలకెత్తుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ సమాజం మనది, దీనిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే అనే స్పృహ ప్రతి ఒక్కరిలో కలగాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసులా వ్యవహరిస్తేనే సమాజంలో చెడు పోకడలను నియంత్రించడం సాధ్యమవుతుందని అన్నారు.
హైదరాబాద్ లోని జేఎన్టీయూ వేదికగా శనివారం "డ్రగ్స్ వ్యతిరేక పోరు, మహిళా భద్రత, రోడ్డు భద్రతలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల భాగస్వామ్యం" అనే అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. టెక్నాలజీ దుష్ప్రభావాలు, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, కుటుంబ వ్యవస్థలో ఒడిదొడుకులు తప్పని నేటి పరిస్థితుల్లో మన భావితరాలను భద్రంగా కాపాడుకోవాలంటే కమ్యూనిటీ పోలీసింగ్ లో అందరూ భాగం పంచుకోవాలని అన్నారు.
పిల్లలు తెలిసో తెలియకో ఉత్సుకతతో మత్తుపదార్థాలను రుచి చూసి, క్రమంగా వాటిని బానిసలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి కదలికలు, ప్రవర్తనను ఎప్పటికప్పుడు కనిపెట్టాల్సిన అవసరమన్నారు. కొన్ని దేశాల్లో 60 శాతం మంది యువత డ్రగ్స్ కు బానిసలైపోయారని, మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో యువత మత్తుపదార్థాల బారిన పడి నిర్వీర్యం అయిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
తెలంగాణలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల నిర్మూలన కోసం న్యాబ్ విభాగాన్ని పటిష్టంచేసి ఏకంగా యుద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మాదకద్రవ్యాలపై యుద్ధంలో సామాన్య ప్రజలతోపాటు నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్ఎస్ఎస్) వలంటీర్లు, విద్యార్థులు సైనికులై కదలిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
పోలిసింగ్ సర్వీస్ విధానం - సీఎం రేవంత్ ఆదేశాలు…
కేరళలో విజయవంతమైన పోలీసింగ్ సర్వీస్ విధానాన్ని తెలంగాణలోనూ అమలుచేయాలని…. ఆ క్రమంలో అన్ని ఇంటర్ , డిగ్రీ కళాశాలల్లో కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. యువత పెడదారులు పట్టకుండా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించిందని అన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రపంచంలో గొప్పవాళ్లకైనా, సామాన్యులకైనా రోజుకు ఉండేది 24 గంటలే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే తప్పక విజయం సాధిస్తామని విద్యార్థులను ఉద్దేశించి ప్రసగించారు. సమస్య ఎంత పెద్దదైనా భయపడి పారిపోవద్దని, ధైర్యంగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎంచుకున్న పంథాలో పనిచేస్తేనే లక్ష్యాలను సాధించగలమని… లోకంలో ఎవరూ ఎవరికంటే తక్కువ కాదని వ్యాఖ్యానించారు.