ఒడిశా టూ కరీంనగర్ వయా ఏపీ - ధర్మపురిలో గంజాయి ముఠా అరెస్ట్..!-ganja gang arrested in dharmapuri ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఒడిశా టూ కరీంనగర్ వయా ఏపీ - ధర్మపురిలో గంజాయి ముఠా అరెస్ట్..!

ఒడిశా టూ కరీంనగర్ వయా ఏపీ - ధర్మపురిలో గంజాయి ముఠా అరెస్ట్..!

HT Telugu Desk HT Telugu
Jul 11, 2024 10:31 PM IST

ధర్మపురిలో గంజాయి ముఠా పట్టుబడింది. ఏడుగురు సభ్యులు గల ముఠాలో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడ్డ వారి నుంచి 6.3 కేజీలను గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ధర్మపురిలో గంజాయి గ్యాంగ్ అరెస్ట్
ధర్మపురిలో గంజాయి గ్యాంగ్ అరెస్ట్

యువత బతుకును నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంది. గంజాయి వాసన లేకుండా సమూలంగా నిర్మూలించేందుకు పోలీసులు నిఘా పెట్టగా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడలో మొన్న గంజాయి ముఠా పట్టుబడగా, తాజాగా ధర్మపురి లో మరో ముఠా పట్టుబడింది.

ఒడిశా వయా ఏపీ మీదుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గంజాయి సప్లై చేస్తూ యువత బతుకు ఆగం చేస్తున్న స్మగ్లర్ ల ఆటపట్టిస్తున్నారు పోలీసులు. వారం రోజుల్లో రెండు ముఠాలకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి దాదాపు 20 కిలోల ఎండు గంజాయిని, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

వారం క్రితం వేములవాడలో….!

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో వారం రోజుల క్రితం గంజాయి స్మగ్లర్ ఒడిస్సా కు చెందిన పుర్థి బిర్సా పోలీసులు అరెస్టు చేసి 14 కిలోల 590 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అది మరిచిపోకముందే తాజాగా ధర్మపురి పోలీసులకు మరో ముఠా పట్టుబడింది. ధర్మపురి లో పట్టుబడ్డ ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.‌ పట్టుబడ్డ వారి నుంచి 6.03 కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్ లు, 3500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్టు అయిన గంజాయి స్మగ్లర్ లను చూపించి వివరాలు వెల్లడించారు. ధర్మపురి మండలం దొంతాపూర్ కు చెందిన దుర్గం రాము, సునర్కాని అజయ్, మగ్గిడి గ్రామానికి చెందిన దుర్గం సంజయ్, రాయపట్నం కు చెందిన బత్తిని చందు,గొల్ల వెంకటేష్ ముఠాగా ఏర్పడి గంజాయి స్మగ్లింగ్ తోపాటు విక్రయిస్తున్నారని ఎస్పీ తెలిపారు.

ఈ ఐదుగురు ఒడిస్సా లో గంజాయి పండించే దినేష్ కుమార్ నాయక్ నుంచి ఏపి విజయనగరం కు చెందిన గుజ్జల పురుషోత్తం ద్వారా కొనుగోలు చేసి ధర్మపురి తోపాటు పలు ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. ఈనెల 4న బత్తిని చందు, గొల్ల వెంకటేష్, దుర్గం రాము లపై ధర్మపురి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి చందు, వెంకటేష్‌లను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపామని తెలిపారు. పరారీలో ఉన్న రాము కోసం గాలిస్తుండగా ధర్మపురి మండలం బుద్దేష్‌పల్లి వద్ద రాము తోపాటు ఒడిస్సా కు చెందిన దినేష్ కుమార్ నాయక్, విజయనగరం కు చెందిన గుజ్జల పురుషోత్తం చిక్కారని తెలిపారు. అజయ్, దుర్గం సంజయ్ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు.

రెండేళ్ళుగా అక్రమ దందా...

రెండేళ్ల క్రితం ఒడిశా చెందిన దినేష్ కుమార్ నాయక్, ఏపీకి చెందిన పురుషోత్తం ముఠాతో పరిచయం ఏర్పడిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అప్పటినుంచి ముఠా సభ్యులు ఒడిశా రాయగడ్ రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడ దినేష్ కుమార్ నాయక్ నుంచి పురుషోత్తం ద్వారా గంజాయిని కొనుగోలు చేసి జగిత్యాల జిల్లాకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. రెండేళ్లుగా ఈ అక్రమ దందా సాగిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని ఎస్పి తెలిపారు. ముఠా పై ధర్మపురి లో NDPS-1985Act Cr.no 219/2024 u/s 20 (b) (ii) (B) NDPS చట్టం క్రింద కేసు నమోదు చేశామని పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఎస్పీ చెప్పారు.

జైల్ లో పరిచయం... గంజాయి స్మగ్లింగ్…

గంజాయి ముఠాలో ఏ2 గా దినేష్ కుమార్ నాయక్, A3 గుజ్జల పురుషోత్తం గతంలో రాయగడ పీఎస్‌లో ఎన్‌డిపిఎస్‌ యాక్ట్‌ కేసులో జైలుకు వెళ్లగా, ఇద్దరికీ రాయగడలో జైల్ లో పరిచయం ఏర్పడిందని ఎస్పీ తెలిపారు. ఆ పరిచయంతో జైలు నుంచి బయటికి వచ్చాక మళ్లీ గంజాయి స్మగ్లింగ్ దందా సాగిస్తూ ధర్మపురి పోలీసులకు చిక్కారని తెలిపారు.‌ ఇద్దరిపై ఒడిశా లో, విజయనగరం GRP పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు.

గంజాయి పై ఉక్కుపాదం….

గంజాయి డ్రగ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడo జరుగుతుందని ఎస్సీ అశోక్ కుమార్ తెలిపారు. ఓ వైపు గంజాయి పై ఉక్కుపాదం మోపడం తోపాటు గంజాయి డ్రగ్స్ వినియోగంతో ఉత్పన్నమయ్యే పరిణామాల పై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. యువత, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీ (ఏడీసీ)లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జగిత్యాల ను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని ఎస్పీ చెప్పారు. జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ లకు లేదా డయల్ 100 కు అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.

రిపోర్టింగ్ - కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner