Telangana Assembly Sessions : ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..!-budget meetings of telangana assembly will start from 24th july ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly Sessions : ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..!

Telangana Assembly Sessions : ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 11, 2024 04:02 PM IST

Telangana Assembly Budget Sessions 2024 : ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024

Telangana Assembly Budget Sessions 2024 : ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్దెట్ ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే అన్ని శాఖల నుంచి నివేదికలు తీసుకున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల వేళ నాలుగు నెలల కాలానికి ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ సమావేశాల నిర్వహణపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,మండలి ఛైర్మన్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందుకు ప్రభుత్వ విప్ లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కూడా హాజరయ్యారు. ఏర్పాట్లపై సమీక్షించారు.

వారం రోజులు…?

ఈ అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు సాగనున్నాయి. ఈనెల 23 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రానికి కేటాయింపులు బట్టి  పూర్తిస్థాయి బడ్జెట్ ను సిద్ధం చేయనున్నారు. ఈనెల 25 లేదా 26 న పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను  ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

ఈ బడ్దెట్ సమావేశాల్లో రైతు భరోసా,రైతు రుణమాఫీ వంటి కీలక అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మరింత లోతుగా చర్చ జరగనుంది. ఇక రైతుభరోసా స్కీమ్ పై సభ్యుల నుంచి పలు సూచనలను స్వీకరించనుంది. అయితే వానాకాలం సాగు ప్రారంభమైనప్పటికీ… పంట పెట్టుబడి సాయం అందించకపోవటంపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రివర్గం ఉప సంఘం ఏర్పాటుతో పాటు రైతు భరోసా నిబంధనలపై శాసనసభలో లోతుగా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇక కొత్త ఆర్వోఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ఇక ప్రభుత్వం వైపు నుంచి పలు కీలక బిల్లలను సభ ముందుకు తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. 6 గ్యారెంటీల అమలు,నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే అవకాశం ఉండగా… అదే స్థాయిలో సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కూడా సిద్ధమవుతున్నారు. 

గత అసెంబ్లీ సమావేశాలే హాట్ హాట్ గా సాగిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. గత సమావేశాల్లో ప్రభుత్వం… పలు రంగాలకు సంబంధించి శ్వేతపత్రాలను సభ ముందు ఉంచుంది. దీనిపై వాడీవేడీగా చర్చ సాగింది.

మరోవైపు బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో సభలో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య కూడా తగ్గింది. ఈ వారంలోపు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హస్తం కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య మరింతగా పడిపోనుంది. ఈ నేపథ్యంలో సభలో…. ఎలాంటి పరిణమాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

 

Whats_app_banner