CM Revanth Vs Sabitha: నన్ను కాంగ్రెస్‌లోకి చేరమని చెప్పి.. తర్వాత సబితా BRSలో చేరి మోసం చేసిందన్న రేవంత్ రెడ్డి-revanth reddy said that sabita cheated after inviting him to join the congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Vs Sabitha: నన్ను కాంగ్రెస్‌లోకి చేరమని చెప్పి.. తర్వాత సబితా Brsలో చేరి మోసం చేసిందన్న రేవంత్ రెడ్డి

CM Revanth Vs Sabitha: నన్ను కాంగ్రెస్‌లోకి చేరమని చెప్పి.. తర్వాత సబితా BRSలో చేరి మోసం చేసిందన్న రేవంత్ రెడ్డి

Sarath chandra.B HT Telugu
Jul 31, 2024 01:49 PM IST

CM Revanth Vs Sabitha: తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్‌ రెడ్డి మధ్య ఆసక్తికరమైన వాగ్వాదం జరిగింది. తనను టార్గెట్ చేశారని సబితా చేసిన ఆరోపణలకు రేవంత్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు.

సబితా ఇంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సిఎం రేవంత్ రెడ్డి
సబితా ఇంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సిఎం రేవంత్ రెడ్డి

CM Revanth Vs Sabitha: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీలో కేటీఆర్‌ ప్రభుత్వానికి సహకరిస్తామంటూ మాట్లాడిన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్‌ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పినా ఎలా సహకరిస్తున్నారో చూస్తూనే ఉన్నామని ఎద్దేవా చేశారు.

కేటీఆర్‌ తన వెనుక ఉండే అక్కల మాట వింటే చివరకు జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి కేటీఆర్‌నుద్దేశించి ఎద్దేవా చేశారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు పోడియం ముట్టడించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానిికి కలిసొస్తామని రామారావు పదేపదే చెబుతున్నాడని, అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుందన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ ఎస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌ బీఆర్‌ఎస్ సభ్యులను తప్పు పట్టారు. సిఎం ఎవరి పేరు చెప్పలేదని, ఎవరి పేరును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయకపోయినా సభను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షాల పట్ల తమకు గౌరవం ఉందని, సభలో అనవసరంగా వివాదం సృష్టించొద్దని పదేపదే విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారని, సభలో గందరగోళం సృష్టించడానికి గొడవ చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. సభ్యుల గందరగోళం మధ్య బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మాట్లడటానికి స్పీకర్ అనుమతించారు. కేసీఆర్‌ ఇంటి మీద కాకి వాలితే కాల్చేస్తానని చెప్పిన రేవంత్‌ ఆ పార్టీ వారిని ఎలా చేర్చుకుంటున్నారని సబితా ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి వచ్చారని బీఆర్‌ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారో అందరికి తెలుసని, తనను ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు. తాను ఏమి మోసం చేశారో చెప్పాలన్నారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని బ్రతిమాలింది తాను అని, భవిష్యత్తు ఉంటుంది, ముఖ్యమంత్రి అవుతారని సూచించానని, సభలో తనను ఉద్దేశించి సిఎం తనపై చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

సబితా మోసం చేసింది…

సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో చర్చ ఉంటుందని, సబితక్క తనను పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం , పార్టీలో భవిష్యత్తు ఉంటుందని సూచించడం ఇదంతా నిజమేనన్నారు. అయితే ఇదంతా వ్యక్తిగత చర్చల్లో భాగంగా జరిగిందని, ఆమెను తాను కుటుంబ సభ్యురాలిగా భావించానని చెప్పారు. సబిత ఇంద్రారెడ్డి ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ బయట పెట్టినందున అప్పట్లో ఏమి జరిగిందో తాను కూడా చెబుతానని ప్రకటించారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు.

కొడంగల్‌లో తాను ఓడిపోయినపుడు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆహ్వానించి పార్లమెంటుకు పోటీ చేయమన్నపుడు తాను సబితాతో మాట్లాడానని చెప్పారు. తనను మల్కాజ్‌గిరిలో పోటీ చేయమని సబితా ఇంద్రారెడ్డి సూచించి, పార్టీ తనను అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత ఆమె తనకు చెప్పకుండా కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారని ఆరోపించారు.

అంతకు ముందు ఎన్నికల్లో తనను గెలిపించే బాధ్యత తీసుకుంటానని చెప్పి, తనను మోసం చేసిందని ఆరోపించారు. ఈ రోజు ఆమె తనకు నీతులు చెప్పడం ఎంత వరకు న్యాయమన్నారు. తాను ఏనాడు వారిని ఖాతరు చేయాల్సిన అవసరం లేదని, అన్ని వివరాలు తాను సభకు చెబుతానన్నారు. కొత్త గవర్నర్‌ ఆహ్వానించాల్సి ఉన్నందున మళ్లీ వచ్చి అన్ని వివరాలు సభకు చెబుతానన్నారు.

సబితా చేసింది ముమ్మటికే తప్పే…

2014లో తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర చరిత్రలో ఓ దళితుడికి సిఎల్పీ నాయకుడిగా అవకాశం ఇస్తే సబితా దానికి అడ్డుపడ్డారని డిప్యూటీ సిఎం భట్టి ఆరోపించారు. దళితుడైన తనను ఎల్వోపిగా నియమిస్తే కేవలం అధికారం కోసం పార్టీ మారిపోయారని, కాంగ్రెస్‌ పార్టీ పరువు పోతుందని బ్రతిమాలానని, మీ అబ్బాయికి ఎంపీ టిక్కెట్ ఇచ్చిందని కూడా నచ్చచెప్పినా ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సిఎల్పీ నాయకుడిని చేయకుండా చేస్తే దానికి సబితా బాధపడలా, తాను బాధపడలా, కాంగ్రెస్ పార్టీ బాధపడలా అని ప్రశ్నించారు. ఇంత చేసి ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని, పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినందుకు బాధపడాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సబితాకు ఎంతో చేసిందని, దళితుడైన తనకు సిఎల్పీ పదవి దక్కకుండా చేయడానికి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారని మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని సబితా ఇంద్రా రెడ్డిని ప్రశ్నించారు. పార్టీలు మారి పరువుతీసింది కాక ఏ ముఖంతో ప్రశ్నిస్తారన్నారు. పదేళ్లు కాంగ్రెస్‌లో పదవి అనుభవించి ఓడిపోయాక కష్ట కాలంలో కాంగ్రెస్‌ పార్టీని వదిలేసి పోయారని మండిపడ్డారు.

Whats_app_banner