KTR : సంక్షేమ హాస్టళ్లలో 8 నెలల్లో 36 మంది విద్యార్థులు మృతి, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు-jagtial brs leader ktr alleged 36 students died since last 8 months in welfare hostels ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : సంక్షేమ హాస్టళ్లలో 8 నెలల్లో 36 మంది విద్యార్థులు మృతి, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR : సంక్షేమ హాస్టళ్లలో 8 నెలల్లో 36 మంది విద్యార్థులు మృతి, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Aug 12, 2024 10:03 PM IST

KTR : తెలంగాణ గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో గత 8 నెలల్లో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని, 500 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

 పాముకాటుతో మృతి చెందిన అనిరుధ్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
పాముకాటుతో మృతి చెందిన అనిరుధ్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

KTR : తెలంగాణలో గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల ఆలనా పాలన కరువయ్యిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. 8 మాసాల్లో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని మరో 500 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులం.. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు హాస్టళ్లను దత్తత తీసుకోవాలని కోరారు.

జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటుతో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ గ్రామానికి చెందిన అనిరుధ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. పార్టీ పరంగా 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు కడుపు కోతకు గురవుతున్నారని తెలిపారు. పాముకాటు, కల్తీ ఆహారంతో విద్యార్థులు అస్వస్థకు గురై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి వాటిని జూనియర్ కళాశాలుగా అఫ్ గ్రేడ్ చేసిందని వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. పట్టించుకునేవారు లేక భువనగిరిలో ఇద్దరు విద్యార్థినిలు, సూర్యాపేటలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. పెద్దాపూర్ గురుకులంలో పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.‌ రాజకీయాలు చేయకుండా దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. మృతి చెందిన 36 మంది విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని... కుదిరితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.‌

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో అధ్యాయన కమిటీ

గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో అధ్యాయన కమిటీ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. నాలుగైదు రోజుల్లో 20 నుంచి 30 పాఠశాలలు తిరిగి లోపాలు సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తామని, రాజకీయాలు అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పరిస్థితులను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని కోరారు.‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.. పాఠశాల ఆవరణాలను క్లీన్ చేయించండి...ఇబ్బందికరమైన పరిస్థితులను వెంటనే తొలగించాలని కేటీఆర్ కోరారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం