Telangana Raitu RunaMafi: నేడే రైతు రుణమాఫీ నగదు విడుదల, తొలి విడతలో రూ.లక్షలోపు రుణం మాఫీ
Telangana Raitu RunaMafi: తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణమాఫీ ముహుర్తం సమీపించింది. గురువారం సాయంత్రానికి లక్ష రుపాయల్లోపు రుణాలు మాఫీ కానున్నాయి.
Telangana Raitu RunaMafi: తెలంగాణ రైతు రుణ మాఫీ ముహుర్తం సమీపించింది. గురువారం సాయంత్రానికి లక్ష రుపాయల్లోపు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. రైతు రుణ మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి లక్ష రుపాయల్లోపు రుణాలను మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారు.మూడు విడతల్లో రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి.
తొలి విడతలో భాగంగా ఇవాళ రూ.లక్షలోపు రుణాలున్న 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాస్ బుక్ ఆధారంగానే రైతు రుణ మాఫీ చేయనున్నారు. నెలాఖరులోగా లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేస్తారు. ఆగస్టు 15లోగా రెండు లక్షల్లోపు రుణాలను మాఫీ చేసేలా కార్యాచరణ రూపొందించారు.
తెలంగాణలో 90లక్షల రేషన్ కార్డులు ఉండగా రెండు లక్షల్లోపు రుణాలు ఉన్న వారిలో 70లక్షల మందికి రైతు రుణాలు ఉన్నాయి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.
రైతు రుణమాఫీ అమలుపై ప్రజా భవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలతో సిఎం సమావేశం అయ్యారు. ఆగస్టులోపు పూర్తిగా నిధులు విడుదల చేస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ అమలు చేయనున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తం అర్హులైన వారిలో 6.36లక్షల మందికి రేషన్ కార్డులు లేవని వారికి కూడా పథకం వర్తిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
స్కీమ్ అమలుకు ముందే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించనున్నారు. సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణలు బ్యాంకర్లకు దిశానిర్దేశం చేస్తారు. రైతు వేదికల్లో రైతు సమావేశం నిర్వహిస్తారు.
రైతు రుణ మాఫీని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రభుత్వ నిధులును రైతు రుణాలకే వాడాలని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. వ్యక్తిగత రుణాలకు వినియోగిస్తే బ్యాంకర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు రుణాల మాఫీకి అర్హులైన లబ్దిదారుల్లో లక్షలోపు వేతనాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులేనని ప్రకటించారు.
మరోవైపు రైతు రుణమాఫీ అమలు కోసం ఇచ్చిన జీవోలో నిబంధనలు ఒక రకంగా, మాటల్లో మరో రకంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రుణమాఫీపై ప్రభుత్వం మభ్య పెడుతోందని ఆరోపించారు. హరీష్ ఆరోపణలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతురుణ మాఫీ చేస్తామన్న హామీ నిలబెట్టుకుంటున్నామని రాజీనామా చేస్తానన్నావు హరీష్ రావు కూడా మాట నిలబెట్టుకోవాలన్నారు.
బుధ వారం నిర్వహించిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెప్పిన సమయం కంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు అన్నారని, అన్నమాట నిలబెట్టుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఆగస్టు 15 లోపల మరో లక్ష వేస్తాం. విజయ్ మాల్యా, నీరవ్, మోదీ లాంటి వాళ్ళు వేల కోట్ల అప్పులు ఉన్నా చావరని రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికే 2లక్షల రుణమాఫీ చేస్తున్నామని రేవంత్ చెప్పారు.
రుణమాఫీపై గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రచారం చేయాలి. ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్ళాం. ఇపుడు రుణమాఫీ చేశామని గ్రామాల్లో చెప్పండి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. రైతుబంధు గురించి 20 సంవత్సరాలు చెప్పుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.