CM Revanth Reddy: ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే.. ప్రతి హామీ నెరవేరుస్తామన్న రేవంత్-the congress party has a history of keeping every word it has given revanth said that every promise will be fulfilled ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy: ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే.. ప్రతి హామీ నెరవేరుస్తామన్న రేవంత్

CM Revanth Reddy: ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే.. ప్రతి హామీ నెరవేరుస్తామన్న రేవంత్

Sarath chandra.B HT Telugu
Aug 15, 2024 11:07 AM IST

CM Revanth Reddy: తెలంగాణ ప్రజానీకానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తాము కట్టుబడి ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పారు. గోల్కొండ కోటపై త్రివర్ణ పతకాన్ని రేవంత్ రెడ్డి ఎగురవేశారు.

గోల్కొండ కోటలో జరిగిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
గోల్కొండ కోటలో జరిగిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ అకాంక్షల విషయంలో కూడా సమకాలీన సాక్ష్యంగా ఆ విషయం నిలిచిందని చెప్పారు. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

2004లో కరీంనగర్‌ వేదికగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సోనియా గాంధీ మాట ఇచ్చారని, తెలంగాణ ప్రజల మనసు తనకు తెలుసని, వారి అకాంక్ష నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారని సోనియా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు.

జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆమె మాట ఇస్తే శిలాశాసనమని మాట రుజువు చేసుకున్నారన్నారు. స్వాతంత్య్రం అంటే రాజకీయ విమోచనం కాదని, ఆర్ధిక, సామాజిక, సంస్కృతిక పునరుజ్జీవనం అని, అణగారిన వర్గాలకు ఆ ఫలాలు అందాలన్నదే గాంధీ దృష్టిలో అసలైన స్వాతంత్య్రమన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు, అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధికి జరిగినపుడే ప్రజస్వామ్య విలువ గౌరవం పెరుగుతుందన్నారు. నాలుగుకోట్ల ప్రజల బలిదానాలు, విద్యార్ధుల అకాంక్షల తర్వాత ఏర్పాటైన తెలంగాణలో.. దశాబ్దం తర్వాత ప్రజా పాలన ఏర్పాటైందన్నారు.

తెలంగాణ ప్రజలు 2023 డిసెంబర్ 3న నిజమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందారన్నారు. గత పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ప్రజలకు తమ ప్రభుత్వంలో ఉందన్నారు. ప్రతి నిర్ణయంలో ప్రజా సంక్షేమాన్ని చూస్తున్నామన్నారు. మెజార్టీ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, నిర్ణయాల్లో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యం అనే సంగతి గుర్తెరిగి పాలిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాటల ప్రకారం తెలంగాణలో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తూ సాగుతున్నామన్నారు.

తెలంగాణ దశాబ్ది వేడుకల్ని ఇటీవల నిర్వహించినట్టు చెప్పారు. తెలంగాణ సాధించి దశాబ్దమైనా రాష్ట్ర గీతం కూడా లేని పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సూచించేలా టీజీ అక్షరాలను తెలంగాణకు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర ఆవిర్భావ 78,575 కోట్ల అప్పులుంటే, గత ఏడాది డిసెంబర్ నాటికి రూ.7లక్షల కోట్లకు అప్పులు చేరాయని, దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని చెప్పారు. తక్కువ వడ్డీతో రుణాలను తీసుకు రావడానికి ప్రయత్నాలుచేస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక అవరోధాలు ఉన్న ప్రతి ఇంట సౌభాగ్యం నింపేలా అభయ హస్తం అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

ఆర్థిక పరిస్థితి తెలియక ముందే ఇచ్చిన హామీల్లో రెండు గ్యారంటీలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసినట్టు చెప్పారు. జులై ఆఖరు నాటికి 2,351 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలను మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించినట్టు చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల పరిమితిని రూ.5లక్షల నుంచి 10లక్షలతో 1835రకాల చికిత్సలను అందిస్తున్నట్టు చెప్పారు. అవయవ మార్పిడితో సహా ఆధునిక చికిత్సలు అందిస్తున్నట్టు చెప్పారు

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. సత్వర చికిత్సలు రోగ నిర్దారణ అందించేందుకు ఈ పథకం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే నిర్ణయం అమలు చేస్తున్నట్టు చెప్పారు. పదేళ్లలో గ్యాస్‌ సిలిండర్‌ను రూ.1200 ధరకు పెంచారని, పదేళ్ల క్రితం ఉన్న రూ.500 కే సిలిండర్‌ అందిస్తున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 43లక్షల కనెక్షన్లలో 61,77,933 సిలిండర్లకు సబ్సిడీ చెల్లించినట్టు చెప్పారు.

200యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు చెప్పారు. 46,19,236మందికి ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ది పొందుతున్నట్టు చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నూతన గృహ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ప్రతి నియోజక వర్గంలో 3500 ఇళ్ల చొప్పున ఒక్కొక్కరికి రూ5లక్షలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

ప్రజల సమస్యల్ని పరిష్కరించేలా ప్రతి జిల్లాలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎకరాకు రూ.15వేల చొప్పున రైతు భరోసా సాయం అందిస్తామని చెప్పారు. రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, రైతుకూలీలు, మేధావులు నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 48గంటల్లో చెల్లింపులు చేస్తున్నట్టు చెప్పారు. ఉచితంగా 24గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా ఉచిత బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు ముఖ‌్యమంత్రి చెప్పారు.

రంగుల మేడలు, అద్దాల గోడలు మాత్రమే అభివృద్ధి కాదని ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి చెప్పారు.రైతుల పాలిటశాపంగా మారిన ధరణి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలిగింది. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించామన్నారు.

'ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ధరణిలో సమస్యల పరిష్కారం, పరిష్కారం చేయలేనివి ఉంటే సదరు దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు చెప్పారు. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించాం. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకు రావాలని భావిస్తున్నట్టు చెప్పారు.