తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Assembly Elections 2023 Is It Going To Be The Most Expensive Election Ever

Telangana assembly elections 2023: అత్యంత ఖరీదైన ఎన్నికలు కాబోతోన్నాయా?

HT Telugu Desk HT Telugu

08 November 2022, 10:52 IST

    • Telangana assembly elections 2023: వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా మారబోతున్నాయా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారనున్నాయా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారనున్నాయా? (MINT_PRINT)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారనున్నాయా?

Telangana assembly elections 2023: హుజురాబాద్‌ ఉప ఎన్నిక, మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ప్రాచుర్యం పొందాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో పరువు కోసం పాకులాడుతూ వందల కోట్లు ఖర్చు చేశాయని పలు పార్టీలు పరస్పరం దూషించుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

మునుగోడులో ఏకంగా కొన్ని గ్రామాల్లో ప్రజలు తమకు తులం బంగారం రాలేదని నిరసనలు తెలిపినట్టు వార్తలు వచ్చాయి. మరికొన్ని చోట్ల తమకు నగదు పంపిణీలో అన్యాయం జరిగిందని, కొందరికి రూ. 10 వేలిస్తే తమకు రూ. 2 వేలు అందాయనే నిరసనలు తెలిపినట్టు సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టాయి. ఉప ఎన్నిక రాగానే మీకు ఓటుకు రూ. 25 వేల వరకు ఆదాయం వచ్చినట్టేనన్న ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో ఆమేరకు ఓటర్లు భారీగా ఆశించారు.

ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేయగా తాము మాత్రం నైతిక విలువలకు కట్టుబడి పనిచేశామని ఫలితాల్లో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి ఆరోపించారు. అయితే కాంగ్రెస్ కూడా ఓటర్లందరికీ పంచకుండా కేవలం తమ పార్టీ శ్రేణులు, మద్దతుదారులకు కొంత నగదు పంచినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది.

మునుగోడులో ఖర్చు ఎంతైంది?

మునుగోడులో ఒక పార్టీ సుమారు రూ. 250 కోట్లు ఖర్చు చేయగా, మరో పార్టీ సుమారుగా రూ. 150 కోట్లు ఖర్చు చేసినట్టు స్థానికంగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఖర్చుకు భయపడ్డ మరోపార్టీ కూడా సుమారు రూ. 30 నుంచి రూ. 40 కోట్ల మధ్య ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

నిజంగా ఇన్ని కోట్లు ఖర్చయ్యాయా? అని ఆశ్చర్యపోకండి. ఈ లెక్కలు మీరు గమనిస్తే ఈమాత్రం అయ్యే ఉంటుందిలే అని అంటారు.

ఒక పార్టీ మునుగోడు నియోజకవర్గంలో మొత్తంగా 2 లక్షల మంది ఓటర్లకు నగదు పంచినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఓటరుకు తొలుత రూ. 3 వేల చొప్పున పంచిందట. తిరిగి పోలింగ్ రోజున మరో రూ. 1,000 చొప్పున పంచిందని స్థానికులు చెబుతున్నారు. ఇంకా కొందరికి తొలుత నగదు పంచిన సమయంలోనే 10 గ్రాముల వెండి బిళ్లలు, ఒక చీర కూడా పంచిందట. దీనికి తోడు ప్రతి కులానికి ఆత్మీయ సమ్మేళనం పేరుతో పిలిచి అందరికీ మాంసాహార భోజనాలు, రూ. 500 పంచిందంట. ఇవన్నీ బహిరంగ రహస్యాలే. ఈ ఆత్మీయ సమ్మేళనాలను హైదరాబాద్ శివార్లలో కూడా నిర్వహించింది.

మరో పార్టీ దాదాపు రూ. 150 కోట్లు ఖర్చు చేసిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. పార్టీ కూడా భారీగా నిధులు సమకూర్చిందని, వాటికి తోడు అభ్యర్థి కూడా సొంతంగా భారీగా ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికి తోడు ఆ అభ్యర్థి ఎన్నికల్లో పంపిణీ కోసం సిద్ధం చేసుకోగా, అవి రాకుండా మరో పార్టీ కట్టడి చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ అభ్యర్థి కూడా నియోజకవర్గంలో సుమారు 1.5 లక్షల మందికి రూ. 3 వేల చొప్పున పంచారని చర్చ జరుగుతోంది. అయితే కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఈ అభ్యర్థి కూడా రూ. 4 వేల చొప్పున పంచారని ప్రచారం జరుగుతోంది. ఇక పోలింగ్ రోజున కూడా మరికొంత నగదు పంచినట్టు సమాచారం.

ఇక మునుగోడు నియోజకవర్గంలో కనీసం రూ. 50 కోట్ల విలువ చేసే మద్యం పంపిణీ అయినట్టు తెలుస్తోంది.

వ్యక్తిగతంగా ఖర్చు పెట్టిన ఇంఛార్జిలు..

మునుగోడు నియోజకవర్గంలో ప్రాంతాల వారీగా పార్టీలకు ఇంఛార్జిలుగా పనిచేశారు. తాము ఇంఛార్జిగా ఉన్న చోట ఓట్లు తక్కువగా వస్తే తర్వాత పార్టీ నాయకత్వం నుంచి మాట వస్తుందని భావించి వారు సొంతంగా ఖర్చు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా వారి వెంట ఉన్న క్యాడర్‌ ఖర్చులు కూడా భారీగానే భరించాల్సివచ్చింది. వీటికి తోడు పలు చోట్ల వైద్య చికిత్సలకు, పరామర్శలకు వెళ్లిన చోట బాధితులకు ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చింది.

వలసలకు ప్రత్యేక పద్దు..

పైకి కనిపించని ఎన్నికల వ్యయం మరొకటి ఉంది. వలసలను అరికట్టేందుకు, ఇతర పార్టీల నుంచి వలసలను ఆకర్షించేందుకు కూడా పార్టీలు భారీగానే ఖర్చు చేశాయి.

అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదేరీతిన ఖర్చువుతుందా?

మునుగోడులో కనీసం రూ. 400 కోట్లు ఖర్చయిందని అంచనాలు రాగా.. అసెంబ్లీ ఎన్నికలో ప్రతి నియోజకవర్గంలో ఇంతేస్థాయిలో ఖర్చవుతుందని చెప్పలేం. మునుగోడులో పరువు కోసం పార్టీలు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఖర్చు చేయడం సాధ్యం కాదు. పార్టీలు అంతపెద్దమొత్తంలో పార్టీ ఫండ్ ఇవ్వవు. అలాగే అభ్యర్థులు కూడా అంత భారీ మొత్తంలో ఖర్చుచేసే పరిస్థితి ఉండదు. ఇక ఇప్పటిలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఇంఛార్జిలుగా పెట్టే పరిస్థితి ఉండదు. అయితే కనీసం ఇందులో సగమైనా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అంటే నియోజకవర్గానికి అన్ని పార్టీల అభ్యర్థులు కలిపి దాదాపు రూ. 200 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్లకు ప్రలోభాలు పెట్టడం మొదలయ్యాక వారి నుంచి ఆశలు కూడా ద్రవ్యోల్భణంలా పెరుగుతూనే వస్తున్నాయి.

ఎలాంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంది?

  1. కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు. అక్కడ మాంసాహార భోజనాలు, హాజరైన వారికి నగదు పంపిణీ చేయాల్సి రావొచ్చు.
  2. నామినేషన్లకు వెళ్లినప్పుడు హాజరైన వారికి నగదు పంపిణీ చేయాల్సి రావడం
  3. ప్రచారానికి వెళ్లినప్పుడు రోడ్ షోలకు హాజరైన ఓటర్లకు నగదు పంపిణీ చేయాల్సి రావడం
  4. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభావం చూపే నేతలు పార్టీలు మారితే వారిని కాపాడుకునేందుకు ప్రత్యేక పద్దుల కింద ఖర్చు చేయాల్సి రావొచ్చు.
  5. ప్రచార సామగ్రికి, పోలింగ్ బూత్ ఇంఛార్జిలకు, ప్రకటనలకు చేసే వ్యయం
  6. మద్యం పంపిణీకి అయ్యే వ్యయం.
  7. ఓటర్లకు నగదు పంపిణీ
  8. పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు చీరలు, వెండి సామాగ్రి, ఇతర ఖరీదైన వస్తువులు పంచడం.
  9. బహిరంగ సభలకు హాజరయ్యే వారికి నగదు పంపిణీ

ఇలా ప్రతి నియోజకవర్గంలో సగటున రూ. 200 కోట్లు అయితే.. 119 నియోజకవర్గాల్లో సుమారు రూ. 24 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. పెరిగిన ధరల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈ ఖర్చు ఇంకా ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉంది.

ఈసారి తెలంగాణలో ముక్కోణ పోటీ ఉన్నందున పార్టీల వ్యయం కూడా భారీగానే ఉండొచ్చు. ఎన్నికలు సమీపించాక కాకుండా.. ఎన్నికలకు చాలా ముందుగానే ఈదిశగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో అత్యంత ధనికులైన అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వర్గాలు, బడా విద్యా సంస్థల అధినేతలు, బడా వైద్య విద్యా సంస్థల అధినేతలు, బడా పారిశ్రామిక వేత్తలు బరిలో నిలవనున్నారు. చాలా చోట్ల అభ్యర్థులకు పలు రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా కార్పొరేట్ సంస్థలు ఎన్నికల ఖర్చుకు అనధికారికంగా ఫండ్ సమకూరుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.