తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy Padayatra: మౌనంగా సీనియర్లు..! రేవంత్ విషయంలో ఇంతేనా..?

Revanth Reddy Padayatra: మౌనంగా సీనియర్లు..! రేవంత్ విషయంలో ఇంతేనా..?

HT Telugu Desk HT Telugu

09 February 2023, 14:29 IST

google News
    • Haath Se Haath Jodo Yatra:రేవంత్ రెడ్డి పాదయాత్ర షురూ అయింది. ములుగు వేదికగా మొదలైన ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ పలు ప్రాంతాలా మీదుగా ముందుకు సాగుతోంది. అయితే రేవంత్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రేవంత్ చేసిన కామెంట్స్ పై కూడా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
పాదయాత్రలో రేవంత్ రెడ్డి
పాదయాత్రలో రేవంత్ రెడ్డి

పాదయాత్రలో రేవంత్ రెడ్డి

Telangana Pradesh Congress : తెలంగాణ కాంగ్రెస్.... ఏదో ఒక ఇష్యూ కుదిపేస్తూనే ఉంటుంది. నేతల మధ్య డైలాగ్ లు పేలుతూనే ఉంటాయి. అంతలోనే కలుస్తారు.. మరోవైపు విమర్శలు గుప్పిస్తుంటారు..! ఏది చేసినా వారికే చెల్లుతుంది. ఏ నేత ఎటువైపు ఉంటారో కూడా కరెక్ట్ గా అంచనా వేయలేం...! ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేం..! అలా సాగే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో... కొద్దిరోజులుగా పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయి. ఠాగూర్ ప్లేస్ లో ఇంఛార్జ్ గా ఠాక్రే రావటం... ఆయన నేతలతో భేటీ అవటం చకచక జరిగిపోయాయి. మరోవైపు ఎన్నికల ఏడాది కావటంతో.. యుద్ధానికి సిద్ధమయ్యే పనిలో పడింది. ఓవైపు అగ్రనేత రాహుల్ చేపట్టిన జోడో యాత్ర స్ఫూర్తితో... రాష్ట్రంలోనే హాత్ సే హాత్ జోడో చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు నుంచి యాత్రను ప్రారంభించారు. సీన్ కట్ చేస్తే... మరోసారి సీనియర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. యాత్ర ప్రారంభమే కాదు... ప్రగతి భవన్ పై రేవంత్ కామెంట్స్ వివాదంలోనూ సైలెన్స్ గా ఉండటం.... హాట్ టాపిక్ గా మారింది.

యాత్రలో కనిపించని సీనియర్లు..!

మేడారం వేదికగా రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, స్థానిక నేతలు తరలివచ్చినప్పటికీ... సీనియర్ నేతలు మాత్రం రాలేదు. ఒక్కరిద్దరూ కనిపించినప్పటికీ... మిగతా నేతలు రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. కనీసం ప్రారంభం రోజైనా రాకపోవటం ఏంటన్న చర్చ మొదలైంది. నిజానికి పాదయాత్ర విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ విభిన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. భద్రాచలం నుంచి ప్రారంభం కావాల్సిన యాత్ర... ములుగుకి షిఫ్ట్ అవటం వెనక కూడా పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్నుంచి రేవంత్ పాదయాత్రకు సీనియర్ల మద్దతు ఉంటుందా..? లేదా..? అన్న చర్చ కూడా జరిగింది. అయితే ఠాక్రే నియామకం తర్వాత... సీన్ మారినట్లు కనిపించింది. కానీ అనూహ్యంగా పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి సీనియర్లు రాకపోవటంతో... మరోసారి విబేధాల అంశంపై తెరపైకి వచ్చినట్లు అయింది.

ఇదిలా ఉంటే పాదయాత్రలో భాగంగా... ప్రగతి భవన్ పై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేయాలంటూ మాట్లాడారు. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీతో పాటు పలువురి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఏ ఒక్క కాంగ్రెస్ సీనియర్ నేత మాత్రం... రేవంత్ కు మద్దతుగా మాట్లాడలేదు. కనీసం ఈ అంశంపై స్పందించలేదు. మరోవైపు రేవంత్ అనుచరులు, మద్దతుదారులు మాత్రం... రేవంత్ కామెంట్స్ లో తప్పులేదని అంటున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి స్పందిస్తూ... నక్సలైట్లు అజెండానే తనది అన్న కేసీఆర్ ను ఎలా సమర్థించారని ప్రశ్నించారు. తనపై విమర్శలు చేసే వారు ఆలోచించుకోవాలంటూ హితవు పలికారు. ఇంత జరుగుతున్న సీనియర్ నేతలు... మౌనంగా ఉండటంపై అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలతో పాటు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కారణంతో కూడా పలువురు నేతలు పాదయాత్రలో పాల్గొనకుండా పక్కకు జరుగుతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ములుగులో పూర్తి కాగ... మహబూబాబాద్ నియోజకవర్గంలో జరుగుతోంది. అయితే రాబోయే రోజుల్లో ముఖ్య నేతల నియోజకవర్గాల్లో సాగే యాత్రకు వారి నుంచి ఎలాంటి సాకారం ఉంటుందనేది చూడాలి.

తదుపరి వ్యాసం