TS Congress Yatra తెలంగాణలో రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరింది. రామప్ప ఆలయంలో పూజల అనంతరం పాలంపేట నుంచి ప్రారంభమైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. కేశపూర్ మీదుగా మధ్యాహ్న భోజనం విరామ సమయానికి నర్సాపూర్ క్రాస్ రోడ్ వరకు రేవంత్ రెడ్డి యాత్ర చేరుకోనుంది. ,దేశంలో సమస్యలు పక్కన పెట్టి మోదీ ఎన్నికల ప్రణాళికలో మునిగి తేలుతున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా పట్టించు కోవడం లేదన్నారు. ప్రజల ఆకాంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల రాశాయని, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో సమూల మార్పు రావాలంటే కేసీఆర్ ను గద్దె దించాలని, అందుకే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు. ,తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.పాదయాత్రలో రెండో రామప్ప నుంచి ములుగు వరకు, రేపు మహబూబాబాద్, గురువారం డోర్నకల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని చెప్పారు. ,రాష్ట్రంలో సమస్యల తీవ్రత పట్టించుకోకుండా కేసీఆర్ ఆస్తులు కూడబెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడ్డారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీకి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.