Revanth Reddy Padayatra : రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం...
Revanth Reddy Padayatra : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర మేడారం నుంచి ప్రారంభమైంది. వనదేవతలను దర్శించుకొని.. రేవంత్ యాత్రను మొదలు పెట్టారు.
Revanth Reddy Padayatra : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ములుగు జిల్లా మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను రేవంత్ ప్రారంభించారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి.. అమ్మల ఆశీర్వాదం తీసుకొని.. యాత్రలో తొలి అడుగు వేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో యాత్ర ప్రారంభం కాగా... ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మల్లు రవి, తదితర నాయకులు.. రేవంత్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు మేడారంకు తరలివచ్చారు.
ట్రెండింగ్ వార్తలు
అంతకముందు.. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర కోసం.... వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకున్నారు. రేవంత్ కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే సీతక్క... అనుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తూ... రేవంత్ కి వీర తిలకం దిద్దారు. అనంతరం.... మేడారంలోని ఘట్టమ్మ దేవాలయం... సాయిబాబా దేవాలయంలో ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వనదేవతలను దర్శించుకుని... పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మేడారం నుంచి పస్రా చేరుకొని... అక్కడే కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి రేవంత్ ప్రసంగిస్తారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ సహా పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం.. పస్రా నుంచి మొదలై... రాత్రి 8 గంటలకు పాదయాత్ర రామప్ప గ్రామానికి చేరుకుంటుంది. రాత్రి ఆ గ్రామంలోనే బస చేస్తారు. కాగా.. ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముఖ్యనేతలు హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రల ద్వారా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ఛార్జిషీట్ల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గడప గడపకూ వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని పేర్కొంటున్నారు.