తెలుగు న్యూస్  /  Telangana  /  Revanth Reddy Open Letter To Cm Kcr On Farmer Suicides And Issues

Revanth Reddy : సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

HT Telugu Desk HT Telugu

31 December 2022, 19:22 IST

    • Revanth Reddy : ముఖ్యమంత్రి కేసీఆర్ కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పత్తి రైతులకి క్వింటాల్ కు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని పేర్కొంటూ.. ప్రభుత్వ విధానాలే రైతును సంక్షోభంలో పడేశాయని ఆరోపించారు. 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Revanth Reddy: రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని జాతీయ క్రైం బ్యూరో (NCRB) వెల్లడించిన నేపథ్యంలో... రాష్ట్రంలో రైతు సమస్యలను ప్రస్తావిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ విధానాలే రైతును సంక్షోభంలో పడేశాయని... 9 ఏళ్లలో 7,069 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సగటున రోజుకి ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది కౌలు రైతులేనని... ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు అన్నింటినీ కౌలు రైతులకూ వర్తింపజేయాలని... ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Karimnagar landgrabbers: కరీంనగర్‌ భూకబ్జాదారులపై ఉక్కుపాదం, పోలీసు కస్టడీకి 9మంది నిందితులు

పత్తికి మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కిన అంశాన్ని రేవంత్ లేఖలో ప్రస్తావించారు. క్వింటాల్ కి రూ. 6 నుంచి 8 వేలు చెల్లించి దళారులు పత్తి రైతుని దగా చేస్తున్నా.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. మద్దతు ధర పొందడం రైతు హక్కు అని... పత్తికి క్వింటాల్ కు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కర్షకులు మద్దతు ధర కోసం రోడ్డెక్కినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం సమస్యలపై స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే... రైతులు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. గొప్ప పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటనలు ఇచ్చుకుంటున్న సర్కార్ కి.. క్షేత్రస్థాయిలో రైతుల బాధలు కనిపించడం లేదా అని నిలదీశారు. రైతులకి ఇచ్చిన హామీ మేరకు... తక్షణం రూ. లక్ష రుణమాఫీ అమలు చేయాలని.. పంటల బీమా పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని లేఖలో రేవంత్ డిమాండ్ చేశారు.

వ్యాపారులందరూ సిండికేట్ గా మారి క్వింటాల్ పత్తికి రూ. 6 - 7 వేలే చెల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆసిఫాబాద్ లో శుక్రవారం రైతులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో భారీ సంఖ్యలో పత్తి రైతులు పాల్గొన్నారు. దళారులు మోసం చేస్తున్నారని... ప్రభుత్వం కల్పించుకొని పత్తికి క్వింటాల్ కి రూ. 15 వేలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు పత్తి ధర ఒక్కసారిగా పడిపోవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా పత్తి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచి రేటు వస్తుందన్న ఆశతో ఉన్న వారిని మార్కెట్లలో ఎదురవుతోన్న పరిస్థితులు కంగారుపెడుతున్నాయి. లక్షల పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే... దళారులు మాత్రం అతి తక్కువ రేటు ఇస్తున్నారని... సీసీఐ కేంద్రాల్లోను వారిదే ఇష్టారాజ్యమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకొని రైతుకి మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.