Raja Singh Controversy: ఆది నుంచి వివాదాలే… ఎవరీ రాజాసింగ్?
24 August 2022, 7:49 IST
- Telangana BJP MLA T Raja Singh: రాజాసింగ్.... నిత్యం తన స్టేట్ మెంట్లతో హీట్ ను పుట్టిస్తుంటారు..! కామెంట్లు, సెటైర్లు, వార్నింగ్ లతో తన రూటే సపెరేట్ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు... దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాజాసింగ్ (ఫైల్ ఫొటో)
Raja singh Controversy: ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్ లోథ్ .... ఆయన ఓ వార్నింగ్ ఇస్తే పెద్ద రచ్చ జరగాల్సిందే..! గోరక్ష పేరుతో స్వయంగా అతనే రంగంలోకి దిగుతుంటారు..! హిందూ ధర్మ రక్షణే తన ధ్యేయం అంటూ దూకుడుగా ముందుకెళ్తుంటారు. శ్రీరామనవమి వస్తే... రాజాసింగ్ తలపెట్టే శోభాయాత్ర ఓ రేంజ్ లోనే ఉంటుంది. ఇందుకోసం భారీస్థాయిలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తుంటారు. తిరుమలలో సీఎం జగన్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ ఈ మధ్యనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మున్నావర్ షో తోనూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి.
టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ...
raja singh politiclal life: రాజాసింగ్ రాజకీయ ప్రవేశం కూడా ఆసక్తికరంగానే ఉంది. గో సంరక్షణ, హిందూ వాహిని సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన... శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రల నిర్వహణతో వెలుగులోకి వచ్చారు. అయితే రాజాసింగ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది మాత్రం తెలుగుదేశంతో కావటం ఆసక్తికరం. గతంలో టీడీపీ అభ్యర్థిగా మంగళహాట్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన... 2014, 2018లో మంగళ్‌హాట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. దీంతో శాసనసభా పక్ష నాయకుడిగానూ ఎన్నికయ్యారు.
2015లో ఓ పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారు రాజాసింగ్. అర్ధరాత్రి డీజే నిర్వహణను పోలీసులు ఆపివేసిన క్రమంలో ఈ ఘటన జరిగింది. దీనిపై రాజాసింగ్ పై కేసు నమోదైంది.
ఇక 2015లో మరో వివాదానికి తెరలేపారు రాజాసింగ్. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీనికి వ్యతిరేకంగా పిగ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామంటూ ప్రకటన ఇవ్వటం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.
2018 ఎన్నికల అఫిడవిట్ లో రాజాసింగ్ పేర్కొన్న వివరాలపై ప్రకారం... అతనిపై మొత్తం 43 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా విద్వేషపూరిత ప్రసంగాల విషయంలోనే నమోదైనవిగా ఉన్నాయి.
మరోవైపు రాజాసింగ్‌ను రెండేళ్ల క్రితం ప్రమాదకరమైన వ్యక్తిగా ఫేస్‌బుక్ లేబుల్ చేసింది. ఫేస్‌బుక్ ఫ్లాట్ ఫారం నుంచి తొలగించింది.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాజాసింగ్ ఆందోళన నిర్వహించారు. దీంతో ఆయనను అరెస్టు చేసి తర్వాత విడుదల చేశారు.
2022 ఏప్రిల్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది.
గతవారం హైదరాబాద్‌లో మునావర్ ఫరుఖీ షో సందర్భంగా రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ షో వేదికను తగలబెడతానని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో... పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.
తాజాగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు రాజాసింగ్. ఆయనపై తెలంగాణలోని పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
పార్టీ నుంచి సస్పెండ్…
Suspended Telangana BJP MLA Raj Singh: రాజా సింగ్ వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన బీజేపీ అధిష్టానం ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఉద్రిక్తత పరిస్థితిలు నెలకొన్నాయి. పలు ముస్లిం సంఘాలు ర్యాలీలు చేపట్టాయి. రాజాసింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే రాజాసింగ్ మద్దతుదారులు కూడా రోడ్లపైకి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పాతబస్తీతో పాటు గోషామహాల్ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
టాపిక్