BJP MLA Raja Singh : మునావర్ ఫరూఖీ కామెడీ షోకి అనుమతిస్తే ఊరుకోం-standup comedian munawar faruqui announces his show in hyderabad again ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Mla Raja Singh : మునావర్ ఫరూఖీ కామెడీ షోకి అనుమతిస్తే ఊరుకోం

BJP MLA Raja Singh : మునావర్ ఫరూఖీ కామెడీ షోకి అనుమతిస్తే ఊరుకోం

HT Telugu Desk HT Telugu

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ హైదరాబాద్ పర్యటనపై వివాదం రేగుతోంది. ఫరూఖీ హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతిస్తే.. ఊరుకునేది లేదని బీజేపీ అంటోంది. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది.

మునావర్ ఫరూఖీ (Instagram)

ఆగస్ట్ 20వ తేదీన హైదరాబాద్‌లో స్టాండ్-అప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీ హెచ్చరించింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రదర్శన చేసేందుకు అనుమతిస్తే పరిణామాలు వేరేలా ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హిందూ దేవుళ్లపై గతంలో జోకులు వేశారని.., హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాజాసింగ్ ఆరోపించారు. 'హైదరాబాద్‌లో ప్రదర్శనకు ఆహ్వానిస్తే ఏం జరుగుతుందో చూస్తారు. ఎక్కడ కార్యక్రమం జరిగినా దాడి చేస్తాం. వేదికను తగులబెడతాం.' అని రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆగస్ట్ 20న హైదరాబాద్‌లో డోంగ్రీ టూ నోవేర్ షో ఉందని.. ఫరూకీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించాడు. రూ.499 రూపాయలకు ఈ టిక్కెట్లను BookMyShowలో విక్రయిస్తున్నారు.

వాస్తవానికి జనవరి 9న హైదరాబాద్‌లో తన 'Dhandho' షోను ప్రదర్శించాల్సి ఉంది. అయితే కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా అది రద్దు అయింది. ఈ ఏడాది ఏక్తా కపూర్ నిర్వహించిన క్యాఫ్టివ్ రియాలిటీ షో లాక్ అప్ లో మునావర్ విజేతగా నిలిచారు. ఆయనకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా ఆహ్వానం పలికారు. అప్పుడు కూడా తెలంగాణ బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రదర్శనను అనుమతించబోమని ప్రకటించింది. ఫరూఖీ కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ యువతకు పిలుపునిచ్చారు. హిందువులపై విద్వేషం సృష్టించేందుకే ఫరూఖీ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవద్దని రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు.

గతంలో హిందూ దేవుళ్లపై విద్వేషం సృష్టించినందుకు ఫరూఖీని అరెస్టు చేసి 37 రోజుల పాటు జైలులో ఉంచారని రాజా సింగ్ అన్నారు. జనవరిలో ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు. నవంబర్‌లో బెంగుళూరులో ఫరూఖీ ప్రదర్శన నిర్వహించాలి అనుకున్నాడు. కానీ నిరసనల తర్వాత రద్దు చేశారు.

డోంగ్రీ పేరుతో స్టాండప్ కామెడీ షోలను మునావర్ ఫరూఖీ నిర్వహిస్తుంటారు. హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలో మునావర్ షోలను నిషేధించారు. షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని రాజాసింగ్ హెచ్చరించడంతో ఆందోళన నెలకొంది.