BJP : ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. రాజాసింగ్ పై వేటు వేసింది. ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని కూడా చెప్పింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడింది. తక్షణమే రాజాసింగ్‌కు ఇచ్చిన బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. బీజేపీకి తెలంగాణ శాసనసభలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ శాసనసభపక్ష నేతగా రాజాసింగ్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ పై సస్పెన్షన్ పడింది.
హైదరాబాద్ లో స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫరూఖీ షో వద్దని చెప్పినా.. కార్యక్రమం నిర్వహించడంపై సోషల్ మీడియాలో రాజాసింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా ఎంఐఎం ఆరోపిస్తుంది. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు సీపీ కార్యాలయం ముందు ఆందోళన జరిగింది.
ఈ పరిణామాలతో ఉదయం రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా అందినట్టుగా తెలుస్తోంది. డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ రాజాసింగ్ పై సీరియస్ అయింది. సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలని అడిగింది.
బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం మెంబర్ సెక్రటరీ పేరుతో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ తోపాటుగా.. ఆయనకు ఉన్న బాధ్యతల నుంచి వెంటనే తొలగిస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఈ కారణంగా బీజేపీ శాసనసభపక్ష నేత పదవి నుంచి సైతం రాజాసింగ్ ను తప్పించినట్టు అయింది. పార్టీ నియామావళికి విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని పార్టీ స్పష్టం చేసింది. ఎందుకు సస్పెండ్ చేయకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సెప్టెంబర్ 2 వ తేదీ లోపుగా ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని చెప్పింది.
సోషల్ మీడియాలలో రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయని.. ఎంఐఎం నిరసన వ్యక్తం చేసింది. గతంలో నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నుపుర్ శర్మపై బీజేపీ పార్టీ సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇలాంటి క్రమంలో రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం.. వెంటనే సస్పెండ్ చేస్తున్నట్టుగా పార్టీ ప్రకటించడం జరిగిపోయాయి. రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియో విషయమై పోలీసుల వినతి మేరకు యూట్యూబ్ వీడియోను తొలగించింది.