MLA Rajasingh : రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు.. ఇప్పటి వరకు ఏం జరిగిందంటే?-suspended bjp mla raja singh granted bail hours after arrest ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mla Rajasingh : రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు.. ఇప్పటి వరకు ఏం జరిగిందంటే?

MLA Rajasingh : రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు.. ఇప్పటి వరకు ఏం జరిగిందంటే?

Anand Sai HT Telugu
Aug 23, 2022 11:14 PM IST

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారని రాజాసింగ్‌ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.

<p>ఎమ్మెల్యే రాజాసింగ్</p>
ఎమ్మెల్యే రాజాసింగ్ (REUTERS)

నాంపల్లిలోని 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్‌ చేయడం చట్టవిరుద్దమని రాజాసింగ్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆయన పాత కేసులు కూడా పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. కేసు దర్యాప్తులో పోలీసు అధికారులకు సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

నాంపల్లి కోర్టు వద్ద రాజాసింగ్‌కు మద్దతుగా ఆయన అనుచరులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు రోజు ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో AIMIM ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా నిరసనల తెలిపారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వీడియోలో హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్.. స్టాండప్ కమెడియన్ మునవర్ ఫరూఖీపై విమర్శలు చేశారు. అదే సమయంలో ప్రవక్త ముహమ్మద్ గురించి మాట్లాడారు. దీనిపై దుమారం రేగింది.

సోమవారం రాత్రి వీడియో వైరల్ కావడంతో హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లు నిరసనలకు కేంద్ర బిందువుగా మారాయి. బషీర్‌బాగ్ ప్రాంతంలోని సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం వెలుపల నిరసనకారులు మొత్తం రహదారిని దిగ్బంధించారు. సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్, ఈస్ట్, వెస్ట్ జోన్‌ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో రాజా సింగ్‌పై ఫిర్యాదులు నమోదయ్యాయి. రాజా సింగ్ పై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా దబీర్‌పూర్ పోలీసులు తెలిపారు. మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడానికి వ్యాఖ్యలు చేసినట్టుగా ఎఫ్‌ఐఆర్ లో నమోదు చేశారు.

నిరసనల నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్ ను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వీడియోను అప్‌లోడ్ చేసినా.. యూట్యూబ్ నుంచి తీసివేశారని చెప్పారు. విడుదలైన తర్వాత పార్ట్-2 అప్‌లోడ్ చేస్తానని తెలిపారు. తాను ధర్మం కోసం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం మెంబర్ సెక్రటరీ పేరుతో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ తోపాటుగా.. ఆయనకు ఉన్న బాధ్యతల నుంచి వెంటనే తొలగిస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఈ కారణంగా బీజేపీ శాసనసభపక్ష నేత పదవి నుంచి సైతం రాజాసింగ్ ను తప్పించినట్టు అయింది. పార్టీ నియామావళికి విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఎందుకు సస్పెండ్ చేయకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సెప్టెంబర్ 2 వ తేదీ లోపుగా ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని చెప్పింది.

ఎమ్మెల్యే రాజాసింగ్ గతవారం హైదరాబాద్‌లో కమెడియన్ ఫరూఖీ ప్రదర్శనకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించారు. అంతకుముందు షో నిర్వహించొద్దని కామెంట్లు చేశారు రాజాసింగ్. మాదాపూర్‌లోని వేదిక వద్దకు వెళ్లాలని చూశారు. కానీ పోలీసు బందోబస్తు నేపథ్యంలో వీలు కాలేదు. ఫరూఖీ గతంలో తన షోలో హిందూ దేవుళ్లను అవమానించాడని రాజాసింగ్ అన్నారు. ఫరూఖీపై విమర్శలు చేస్తూ.. వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత సోమవారం ఎంఐఎం ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు అయ్యారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Whats_app_banner