తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jatara 2024 Updates : 500 సీసీ కెమెరాలు, 14 వేల మంది పోలీసులు - మేడారంలో భారీ బందోబస్తు

Medaram Jatara 2024 Updates : 500 సీసీ కెమెరాలు, 14 వేల మంది పోలీసులు - మేడారంలో భారీ బందోబస్తు

HT Telugu Desk HT Telugu

11 February 2024, 8:03 IST

google News
    • Medaram Jatara 2024 Updates: వరంగల్ మహాజాతరకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా… భారీ బందోబస్తును సిద్ధం చేసింది. జాతర పూర్తయ్యే వరకు 14 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.
మేడారం జాతర(ఫైల్ ఫొటో)
మేడారం జాతర(ఫైల్ ఫొటో)

మేడారం జాతర(ఫైల్ ఫొటో)

Sammakka Saralamma Jatara 2024: వనదేవతల మహాజాతర ఇంకో 10 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈసారి సుమారు కోటిన్నర మంది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని ఆంచనా. నాలుగు రోజులపాటు కిక్కిరిసిపోయే ఈ జాతరలో పోలీస్ వ్యవస్థే చాలా కీలకం. తల్లులను గద్దెలకు చేర్చడం నుంచి ప్రముఖులకు బందోబస్తు ఇవ్వడం, మేడారం తరలి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయడం, జాతరలో రష్ ను కంట్రోల్ చేయడం, ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడటం, దొంగతనాల నియంత్రణ ఇలా ప్రతి ఒక్క పనీ పోలీసుల పైనే ఆధార పడి ఉంటుంది. అందుకే మేడారం మహాజాతరలో పోలీసు బలగాలే కీలకం. ఈ మేరకు మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పోలీస్ ఫోర్స్ రెడీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేస్తున్నారు.

14 వేల మందితో భారీ ఫోర్స్

మేడారం అంటేనే పోలీసులకు సవాల్ గా మారే జాతర. జాతరలో(Sammakka Saralamma Jatara 2024) ఏం కొంచెం నిర్లక్ష్యం వహించినా.. తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతిచోటా పోలీస్ నిఘా ఉండేలా ఈసారి పెద్ద మొత్తంలో బలగాలను మోహరిస్తున్నారు. జాతర పూర్తయ్యే వరకు 14 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐజీ డా.తరుణ్ జోషి మేడారం మహాజాతర బందోబస్తు, నిఘాపై దృష్టి పెట్టి పనులు చేయిస్తున్నారు. గతంలో మేడారం ట్రాఫిక్ ఇన్ఛార్జ్ గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన జాతరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇక జాతర మొత్తం మీద ఐజీ, డీఐజీలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 డీఎస్పీలు, 400 సీఐలు, వెయ్యి మంది ఎస్సైలు, దాదాపు 12 వేల మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

500 సీసీ కెమెరాలు

ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం మహా జాతర(Medarama Sammakka Saralamma Jatara) ప్రారంభం కానుండగా.. ఆ నాలుగు రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అదికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున తరలివచ్చే భక్తుల క్రౌడ్ ను కంట్రోల్ చేయడం కత్తిమీద సాము లాంటిదే. ఇప్పటికే జాతర సమయంలో చిన్నాచితకా దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా పరమైన చర్యలతో పాటు జాతర క్రౌడ్ కంట్రోల్ కు పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతర పరిసరాల్లో మొత్తంగా 500 కుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మేడారం జాతరను పర్యవేక్షిస్తామని ములుగు ఎస్పీ శబరీష్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ప్రముఖుల రాకకు బందోబస్తు

సమ్మక్క–సారలమ్మను దర్శించుకోవడానికి ఈసారి ప్రముఖుల ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి జాతరకు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పనులపై ఫోకస్ పెట్టి, స్పీడప్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క మేడారం పనులను పర్యవేక్షిస్తుండగా.. జాతర సమయంలో రాష్ట్రంలోని అందరూ మంత్రులు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు సాధారణ భక్తులు, వీఐపీ, వీవీఐపీ దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉండే ఛాన్స్ ఉంది. దీంతోనే ప్రముఖుల కోసం స్పెషల్ గా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో 10 రోజుల్లోనే మహాజాతర ప్రారంభం కానుండగా.. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనివ్వాలని మనమూ కోరుకుందాం.

రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి.

తదుపరి వ్యాసం