Medaram Jatara: మేడారం మహా జాతరకు నేడే అంకురార్పణ.. గుడిమెలిగె పండుగతో సమ్మక్క, సారలమ్మ ఆలయాల శుద్ధి-medaram maha jatara will be inaugurated today purification of sammakka and saralamma temples with gudimelige festival ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jatara: మేడారం మహా జాతరకు నేడే అంకురార్పణ.. గుడిమెలిగె పండుగతో సమ్మక్క, సారలమ్మ ఆలయాల శుద్ధి

Medaram Jatara: మేడారం మహా జాతరకు నేడే అంకురార్పణ.. గుడిమెలిగె పండుగతో సమ్మక్క, సారలమ్మ ఆలయాల శుద్ధి

HT Telugu Desk HT Telugu
Feb 07, 2024 01:12 PM IST

Medaram Jatara: తెలంగాణ కుంభమేళా, కోట్లాది మంది భక్తుల జనం తరలివచ్చే మేడారం మహాజాతరకు నేడే అంకురార్పరణ జరగనుంది. వనదేవతల మహాజాతరలో భాగంగా రెండు వారాల ముందు నిర్వహించే తొలి కార్యక్రమమైన గుడిమెలిగె పండుగను బుధవారం నిర్వహించనున్నారు.

మేడారం సమ్మక్క ఆలయం
మేడారం సమ్మక్క ఆలయం

Medaram Jatara: తెలంగాణ కుంభమేళా, కోట్లాది మంది భక్తుల జనం తరలివచ్చే మేడారం మహాజాతరకు నేడే అంకురార్పరణ జరగనుంది. వనదేవతల మహాజాతరలో భాగంగా రెండు వారాల ముందు నిర్వహించే తొలి కార్యక్రమమైన గుడిమెలిగె పండుగను బుధవారం నిర్వహించనున్నారు.

ఈ గుడిమెలిగె పండుగలో భాగంగా పూజారులు మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాలను శుద్ధి చేసి అలంకరించనున్నారు. ఆ తరువాత మేడారం జాతరను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఇలా ఆలయాల శుద్ధి క్రతువుతో మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో తొలి ఘట్టం ప్రారంభమవుతుంది. ఈ తొలి పూజ కార్యక్రమ అనంతరం వారం రోజులకు మండమెలిగె పండుగ, ఆ తరువాత వారం రోజులకు మహాజాతర ప్రారంభం అవుతాయి.

రెండు వారాల ముందు..

ఫిబ్రవరి 21 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. సరిగ్గా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగె పండుగ ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ, పూనుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలోని గోవిందరాజు ఆలయాలను శుద్ధి చేస్తారు.

దీంతో మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఇక్కడి నుంచే ప్రారంభమవుతంది. ఒక్కప్పుడు మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయాలు గుడిసెలుగానే ఉండేవి.

ప్రతిజాతరకు ముందు ఆ గుడిసెలకు రిపేర్లు చేసి, కొత్తగా పైకప్పు ఏర్పాటు చేసేవారు. దీనినే గుడి మెలగడం అంటారు. కానీ ఇప్పుడు అమ్మవార్ల ఆలయాలను డెవలప్ చేశారు. గుడిసెల స్థానంలో భవనాలు నిర్మించారు. కాగా ఇప్పుడు గుడిసెలు లేకున్నా జాతరకు రెండు వారాల ముందు సంప్రదాయం ప్రకారం గుడిమెలిగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ గుడి మెలిగె క్రతువులో భాగంగా మేడారంలో సమ్మక్క పూజారులు తెల్లవారుజామునే తల స్నానం చేసి ఆలయానికి చేరుకుంటారు. మొదట ఆలయంలో బూజు దులిపే కార్యక్రమం చేపట్టి, ఆ తరువాత నీటితో ఆలయం లోపల, బయట శుభ్రం చేస్తారు.

అనంతరం పూజారులకు సంబంధించిన ఆడపడుచులు ఆలయాన్ని అలుకుపూతలతో సుందరంగా తీర్చిదిద్దుతారు. పసుపు, కుంకుమలతో ముగ్గులు వేస్తారు. గుడిలో భద్రపరిచి ఉన్న అమ్మవారి పూజాసామగ్రి, వస్త్రాలు, ఇతర వస్తువులను బయటకు తీసి నీటితో శుభ్రంగా శుద్ధి చేస్తారు. అనంతరం ధూపదీపాలతో అమ్మవారికి పూజలు చేస్తారు.

కన్నేపల్లి సారాలమ్మ ఆలయం
కన్నేపల్లి సారాలమ్మ ఆలయం

సారలమ్మ ఆలయంలో..

మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం ఉంటుంది. కాగా గుడిమెలిగె పండుగలో భాగంగా సారలమ్మ పూజారులు ఉదయాన్నే స్నానం చేసి ఆలయానికి చేరుకుంటారు. ఆలయం లోపల, బయట బూజు దులుపుతారు. నీటితో ఆలయాన్ని కడిగి శుభ్రం చేస్తారు. అనంతరం గుడి లోపల, బయట అలుకు పూతలు పూర్తి చేసి, పసుపు, కుంకుమలతో ముగ్గులు వేస్తారు.

ఆలయం చుట్టూరా మామిడి తోరణాలు కట్టి పూజిస్తారు. సారలమ్మ వస్త్రాలు, పూజా సామగ్రిని నీటితో శద్ధి చేసి, సారలమ్మ కుండలకు పసుపు, కుంకుమలతో అలంకరణ చేస్తారు. ధూపదీపాలు వెలిగించి సారలమ్మకు పూజలు చేస్తారు. ఇలా ప్రధానంగా సమ్మక్క–సారలమ్మ ఆలయాలను శుద్ధి చేసే గుడిమెలిగె పండుగతో మహాజాతర ప్రథమ ఘట్టం పూర్తవుతుంది. .

14న మండమెలిగె

మహాజాతరకు వారం రోజుల ముందు దేవతామూర్తులు ఉండే ఆవరణలను శుద్ధి చేసి ముగ్గులు వేస్తారు. ఆ పరిసరాలను అందంగా అలంకరిస్తారు. దీనిని మండమెలిగె పండుగగా పిలుస్తుంటారు. ఈ గుడిమెలిగె, మండమెలిగె పండుగలను తల్లులవారంగా పిలుచుకునే బుధవారమే నిర్వహిస్తారు. బుధవారాన్ని సమ్మక్క వారంగా భావించి భక్తులు తమ ఇళ్లను కూడా శుద్ధి చేసుకుంటారు. గుడిమెలిగె పూజా కార్యక్రమం ముగిసేంత వరకు వన దేవతల పూజారులు ఉపవాస దీక్షలోనే ఉంటారు.

21 నుంచే మహాజాతర

ఈ నెల 21 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా.. 24వ తేదీ వరకు కొనసాగుతుంది. 21వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకుంటారు. రెండో రోజు 22వ తేదీన సమ్మక్క గద్దెలకు వస్తుంది. ఆ తరువాత రోజు 23న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తరువాత 24వ తేదీన అమ్మవార్ల వన ప్రవేశ ఘట్టం ఉంటుంది.

ఈ నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలతో మహాజాతర ముగుస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ మేరకు దాదాపు 105 కోట్లతో ప్రభుత్వం పరంగా వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం మహాజాతరలో రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులు ఇప్పటినుంచే ముందస్తు మొక్కులు సమర్పించడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మేడారంలో ఇప్పటినుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోంది.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner