Medaram Jatara 2024 : మేడారం భక్తులకు గుడ్ న్యూస్ - ఇంటి నుంచే తల్లులకు బంగారం సమర్పించుకోవచ్చు, పూర్తి వివరాలివే
Medaram Maha Jatara 2024 Updates: మేడారం వెళ్లటం కుదరటం లేదా…? అమ్మవారికి మొక్కులు ఎలా చెల్లించుకోవాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇంటి నుంచే తల్లులకు ఎత్తు బంగారం సమర్పించే ఛాన్స్ కల్పించింది. ఆ వివరాలెంటో ఇక్కడ చూడండి…..
Medaram Sammakka Sarakka Maha Jatara 2024: మేడారం వనదేవతల మహాజాతరకు సమయం దగ్గరపడుతోంది. మరో రెండు వారాల్లోనే గిరిజన జాతర ప్రారంభం కానుండగా ఇప్పటికే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పించుకునేందుకు మేడారం బాట పడుతున్నారు. జాతర ప్రారంభమైతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో చాలామంది భక్తులు ముందస్తు మొక్కులు సమర్పిస్తున్నారు. కొంతమంది భక్తులు ముందస్తు మొక్కులు పెడుతుండటంతో సందడి కనిపిస్తుండగా.. మరికొంతమంది జాతర సమయంలోనే మొక్కులు చెల్లించుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అందుబాటులో లేకనో.. ఆరోగ్య కారణాలతోనో.. మరే ఇతర కారణాలతో మేడారం దాక వెళ్లి వనదేవతలను దర్శించుకోలేని భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మేడారం వరకూ వెళ్లలేని భక్తులు ఉన్నచోటు నుంచే మొక్కులు చెల్లించుకునేలా అవకాశం కల్పిస్తోంది.
ఆన్ లైన్ పేమెంట్ చేస్తే చాలు
మేడారం వరకు వెళ్లలేని భక్తులు ఇంటి నుంచే మొక్కులు చెల్లించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. ఈ మేరకు ఆన్ లైన్ లో పేమెంట్ చేస్తే సమ్మక్క–సారలమ్మ(Medaram Sammakka Sarakka) గద్దెల వద్దకు ఎత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయం తీసుకొచ్చింది. కిలో ఎత్తు బంగారానికి రూ.60 చొప్పున చెల్లిస్తే ప్రభుత్వమే సంబంధిత వ్యక్తుల పేరున బెల్లాన్ని సమ్మక్క గద్దెలకు చేరుస్తుంది. ఎత్తు బంగారానికి అయ్యే ఛార్జీలతో పాటు పోస్టల్ ఛార్జీలు కూడా చెల్లిస్తే కొంత బెల్లాన్ని ప్రసాదం రూపంలో ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఆన్ లైన్ సేవల కింద రూ.35 ఛార్జీలతో పాటు ప్రసాదం ఇంటికి పంపించేందుకు పోస్టల్ ఛార్జీల కింద మరో రూ.100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎత్తు బంగారం సమర్పించాలనుకునే భక్తుడు 50 కిలోల బరువున్నారనుకుందాం. ఆయన 50 కిలోల ఎత్తు బంగారం సమర్పించడానికి కిలోకు రూ.60 చొప్పున రూ.3 వేలు, ఫీజు కింద రూ.35, ప్రసాదం ఇంటికి పంపించేందుకు మరో రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా రూ.3,135 చెల్లిస్తే.. బెల్లాన్ని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద సమర్పించి, కొంత బంగారాన్ని మన ఇంటికి చేరుస్తారన్నమాట.
అప్లై చేసుకోవడం ఎలా..?
ఆన్ లైన్ ద్వారా ఎత్తు బంగారాన్ని సమర్పించాలనుకునే భక్తులు మీసేవా కేంద్రాలను సమర్పిస్తే సరిపోతుంది. మీసేవా కేంద్రంలో లేదా ‘టీ యాప్ ఫోలియో’ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దరఖాస్తులో పేరు, అడ్రస్ వివరాలతో పాటు ఆన్ లైన్ చెల్లింపులకు సంబంధించిన సమాచారం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత భక్తుల పేరు మీద ఎత్తు బంగారాన్ని సమర్పించిన అనంతరం ప్రభుత్వమే ప్రసాదాన్ని ఇంటికి చేరుస్తుంది. కాగా ఇలా ఆన్ లైన్ మొక్కులు చెల్లించుకునే అవకాశం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కేవలం ఈ నాలుగు రోజుల్లో మొక్కులు చెల్లించుకోవాలనుకునే భక్తులు మాత్రమే ఈ ఆన్ లైన్ సేవలను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఆన్ లైన్ సేవల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి సేవలను పర్యవేక్షించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది.
ఇప్పటినుంచే ఫుల్ రష్
ఫిబ్రవరి 21 నుంచి మేడారం మహాజాతర(Medaram Maha Jatara 2024) ప్రారంభం కానుండగా ఇప్పటినుంచే అక్కడ ఫుల్ రష్ కనిపిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లిస్తుండగా సెలవు దినాల్లో ఆ సంఖ్య లక్షలకు చేరుతోంది. అయినా మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలకు చేరిన తరువాత మొక్కులు చెల్లించాలనే భావన చాలామంది భక్తుల్లో ఉంటుంది. కానీ ఫిబ్రవరి 21 నుంచి జాతర జరిగే నాలుగు రోజుల్లో నిత్య లక్షలాది జనం అక్కడికి వస్తుంటారు. అంతమందిలో మొక్కులు చెల్లించడం ఇబ్బందిగా అనిపించినా.. అందుబాటులో లేకపోయినా.. ఇతర ఏ కారణాలతో వనదేవతల దర్శనానికి వెళ్లలేని భక్తులు ఈ ఆన్ లైన్ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి.
సంబంధిత కథనం