Medaram Jatara: సీతమ్మ తల్లి జన్మకు.. సమ్మక్క పుట్టుకకు పోలికుందా..? మేడారం సమ్మక్క పుట్టిందెక్కడ...?-where is the birth place of medaram sammakka ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jatara: సీతమ్మ తల్లి జన్మకు.. సమ్మక్క పుట్టుకకు పోలికుందా..? మేడారం సమ్మక్క పుట్టిందెక్కడ...?

Medaram Jatara: సీతమ్మ తల్లి జన్మకు.. సమ్మక్క పుట్టుకకు పోలికుందా..? మేడారం సమ్మక్క పుట్టిందెక్కడ...?

HT Telugu Desk HT Telugu
Feb 07, 2024 07:48 AM IST

Medaram Jatara: రామాయణంలో సీతమ్మ Sitamma తల్లి జన్మకు.. మేడారం సమ్మక్క పుట్టుకకు పోలికుందా..? సీతమ్మ తల్లి.. సమ్మక్క తల్లి.. ఇద్దరి జన్మకు ఉన్న సారూప్యత ఏంటి..? నానారకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అసలు సమ్మక్క తల్లి పుట్టిందెక్కడ..?

సమ్మక్క జన్మస్థలం ఎక్కడ
సమ్మక్క జన్మస్థలం ఎక్కడ

Medaram Jatara: మేడారం మహాజాతర సమీపిస్తున్న వేళ చాలామంది మదిలో మెదిలే ప్రశ్నే ఇది. ఈ ప్రశ్నకు చాలామంది చరిత్రకారులు, పరిశోధకుల వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. భూదేవి కుమార్తెగా పేరున్న సీతమ్మ తల్లికి.. సమ్మక్కకు ఉన్న సంబంధం ఏంటి.. అసలు సమ్మక్క జన్మ గురించి ఏఏ కథలు ప్రచారంలో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భూదేవి కుమార్తె సీత

రామాయణంలో సీతమ్మ తల్లి భూదేవి Bhudevi కుమార్తె.. కాగా మేడారం సమ్మక్కకు సంబంధించిన ఓ కథలో కూడా సమ్మక్కను భూదేవి కుమార్తెగానే అభివర్ణిస్తున్నారు. రామాయణం ప్రకారం మిథిలాపుర రాజైన జనకమహారాజు ఒకానొక సమయంలో భూమి దున్నుతున్న సమయంలో ఏదో అడ్డు తగిలి నాగలి ముందుకు కదలకుండా ఆగిపోతుంది.

ఎంత ప్రయత్నించినా నాగలి కొంచెం కూడా కదలకుండా ఆగిపోవడంతో జనక మహారాజు వెంటనే వచ్చి నాగలి కర్రును పరిశీలిస్తాడు. నాగలికి ఏదో అడ్డుతగిలిందని గమనించి వెంటనే అక్కడ మట్టిని తోడగా.. ఒక పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టెను బయటకు తీసి, తెరచి చూడటంతో అందులో ఒక పసిపాప దర్శనిమిస్తుంది.

దీంతో జనక మహారాజు ఆ పసిపాపను చేతుల్లోకి తీసుకుని, ఇంటికి తీసుకెళ్తాడు. పసిపాపకు సీతాదేవిSeethadevi అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా పెంచుతాడు. నాగలితో దున్నుతుంటే భూమి లోపల దొరికింది కాబట్టి సీతను భూదేవి Bhudevi

కుమార్తె అని కూడా అంటుంటారు.

సమ్మక్క కూడా భూదేవి బిడ్డేనా..?

సమ్మక్క sammakka పుట్టుక గురించి రెండు, మూడు కథలు ప్రచారంలో ఉండగా.. అందులో ఒక కథ సీత జన్మకు అత్యంత దగ్గర పోలికను కలిగి ఉంది. చరిత్రకారులు, కొందరు పూర్వీకులు చెబుతున్న ప్రకారం.. ములుగు జిల్లాలోని బయ్యక్కపేటలో ఆదివాసీ కోయ తెగకు చెందిన చందా వంశస్తులున్నారు.

సమ్మక్కను తమ వంశపు ఆడబిడ్డగా ఇక్కడి చందా వంశస్తులు చెబుతుంటారు. పూర్వం రాయిబండరాజు పెద్ద భార్య చందా బోయిరాలు ఒకరోజు దుంపల కోసం అడవిలోని కంకవనానికి వెళ్తుంది. అక్కడ ఎల్లేరు గడ్డ కోసం తవ్వుతుండగా గడ్డపారకు ఏదో గట్టి వస్తువు తగిలింది. దీంతో చందాబోయిరాలు ఆ మట్టిని పక్కకు తవ్వి చూడగా అందులో ఓ పెట్టె కనిపించింది.

అనంతరం ఆ పెట్టెను తెరచి చూడగా అందులో పసిపాప కనిపించింది. సంతానం లేని తనకు భూమాత బిడ్డను ప్రసాదించిందని సంతోషంగా పసిపాపను ఇంటికి తీసుకెళ్లి బిడ్డకు సమ్మక్క అని నామకరణం చేసి సాదుకున్నారని చందా వంశస్తులు చెబుతుంటారు. దీంతోనే సమ్మక్క బయ్యక్కపేట బిడ్డ అని పూర్వీకులు వాదిస్తుంటారు.

కాకతీయులతో యుద్ధం తరువాత మేడారం జాతరను మొదట బయ్యక్కపేటలోనే నిర్వహించేవారు. సమ్మక్క–సారలమ్మను దేవతలుగా ప్రతిష్టించుకుని కొలిచేవారు. ఇదే గ్రామానికి చెందిన సిద్దబోయిన వంశస్తులు కూడా అమ్మవార్లను కొలిచేవారు. కానీ 1962 తరువాత పరిణామాల నేపథ్యంలో చందా వంశస్తులు కరువు కాటకాలతో జాతర నిర్వహించలేకపోయారు.

ఈ మేరకు సిద్దబోయిన వంశస్తులతో ఒప్పందం మేరకు అప్పటినుంచి జాతరను మేడారంలోనే నిర్వహిస్తున్నారు. కాగా ప్రతి జాతర సమయంలో బయ్యక్కపేట పూజారులు ఒడిబియ్యం, చీర, సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రెండు కథల ప్రకారం సీతమ్మ తల్లి, సమ్మక్క తల్లి.. ఇద్దరి జన్మల మధ్య సారూప్యం ఉండటంతో సమ్మక్కను కూడా కొందరు భూదేవి కుమార్తెగానే భావిస్తూ కథలు చెబుతుంటారు.

ప్రచారంలో మరికొన్ని కథలు

సమ్మక్క పుట్టుక గురించి ఒక్కోచోట ఒక్కో రకమైన కథ ప్రచారంలో ఉంది. ములుగు జిల్లా బయ్యక్కపేటనే సమ్మక్క తల్లి జన్మస్థలమని కొందరు అంటుండగా.. జగిత్యాల జిల్లా పొలవాస అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరేమో సమ్మక్క తల్లి పుట్టింది ప్రస్తుత హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహడ్ అని కూడా చెబుతుంటే.. సమ్మక్క తల్లి ఛత్తీస్ గడ్ లోనే పుట్టిందని అక్కడి జనాల ప్రచారంలో కూడా ఉంది.

పొలవాసలో పుట్టిందా..?

కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని ‘పొలవాస’ను 12వ శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేట కోసం అడవికి వెళ్లిన ఆయనకు పులుల మధ్మన, దివ్యకాంతులతో ఒక పుట్ట మీద పసిపాప కనిపించగా తెచ్చి సమ్మక్క అని పేరు పెట్టారు. ఆ పసిపాప రాజ్యంలో కాలుమోసిన తరువాత అక్కడ అన్నీ శుభాలే జరిగాయని పూర్వీకులు చెబుతుంటారు.

ఈ కథ చాలాచోట్లా ప్రచారంలో ఉండగా సమ్మక్క జన్మ స్థలం పొలవాస అనే వాదనలు వినిపిస్తుంటాయి. కాగా సమ్మక్కను పెంచి పెద్ద చేసిన అనంతరం మేడరాజు తన మేనల్లుడైన మేడారం ప్రాంతాన్ని పరిపాలించే పగిడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి జరిపించాడు. వీరికి సారలమ్మ, నాగులమ్మ కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు పుట్టారు. సారలమ్మకు గోవిందరాజులుతో వివాహం జరిగింది.

ఆ తరువాత కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు రాజ్య కాంక్షతో మేడారంపై దండెత్తగా.. మేడరాజు మేడారానికి వెళ్లి అజ్ఞాతంలోకి చేరుతాడు. ఇక పోరులో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. జంపన్న సంపెంగ వాగులో దూకి చనిపోయాడు. సమ్మక్క తీవ్ర గాయాలతో శత్రువులను హతమార్చుతూ మేడారానికి తూర్పు దిశగా ఉన్న చిలకలగుట్ట వైపు సాగుతూ అదృశ్యమైంది.

అగ్రంపహడ్.. చత్తీస్ గడ్..?

ఇప్పటికే సమ్మక్క పుట్టింది బయ్యక్కపేటనా లేదా పొలవాసనా అనే గందరగోళం ఉండగా అసలు సమ్మక్క పుట్టింది హనుమకొండ జిల్లాలోని అగ్రంపహడ్ గ్రామమేనని అక్కడి పూర్వీకులు చెబుతున్నారు.

సమ్మక్క జన్మ స్థలం అగ్రం పహడ్ అనే భావనతో ఇక్కడ మేడారం తరువాత మేడారం అంతటి స్థాయిలో జాతర నిర్వహిస్తుంటారు. ఇక్కడికి ప్రతి జాతర సమయంలో 50 లక్షల నుంచి 60 లక్షల మంది వరకు భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు.

ఛత్తీస్ గడ్ లోని కొందరు ఆదివాసీలు మాత్రం సమ్మక్క తమ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డేనని చెబుతుంటారు. సమ్మక్క ఛత్తీస్ గడ్ లో పుట్టి, మేడారానికి వచ్చిందని అక్కడి ప్రాంతంలో మరో రకమైన కథను ప్రచారం చేశారు. దీంతోనే సమ్మక్క ఎక్కడ పుట్టిందనే విషయంపై నానారకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి.

బయ్యక్కపేట లేదా పొలవాస ఈ రెండు ప్రాంతాల్లోనే సమ్మక్క పుట్టిందనే చాలామంది చరిత్రకారులు బలంగా చెబుతుండటం గమనార్హం. వాస్తవానికి సమ్మక్క పుట్టుక గురించి కచ్చితమైన పరిశోధనలు జరగకపోగా.. ఆ తల్లి జన్మకు సంబంధించి లిఖితపూర్వక ఆధారాలు, శాసనాలు ఏమీ లేవని చరిత్రకారులు కూడా చెబుతున్నారు.

( హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner