Medaram Jatara 2024 : మేడారం మహాజాతర - ఆ నాలుగు రోజుల్లో జరిగే ప్రధాన ఘట్టాలివే
Medaram Maha Jatara 2024 Updates: తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 21వ తేదీన జాతర ప్రారంభం కానుంది. అయితే జాతరలో జరిగే కీలక ఘట్టాలను ఓసారి చూద్దాం….
Medaram Sammakka Sarakka Maha Jatara 2024 Updates: మేడారం మహా జాతరకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే తేదీలను ఖరారు చేయగా… ఏర్పాట్ల విషయంలో స్పీడ్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఓవైపు భక్తుల రాకపోకలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిర్దిష్ట సమయంలో పనులన్నీ పూర్తి చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సర్కార్ భావిస్తోంది. ఫిబ్రవరి 21వ తేదీన ఈ మహాజాతర ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు సాగే ఈ మహాజాతరలో నిర్వహించే కీలక ఘట్టాలను ఇక్కడ చూద్దాం….
మహాజాతరలోని ముఖ్యమైన ఘట్టాలు
ఈ ఏడాది జరగబోయే జాతరలోని తేదీలను చూస్తే…. ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన సమ్మక్క దేవతను గద్దెకు చేరుకుంటుంది. ఫిబ్రవరి 23వ తేదీన భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఫిబ్రవరి 24వ తేదీన దేవతల వనప్రవేశం ఉండగా... ఫిబ్రవరి 28వ జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి.
పగిడిద్దరాజను తీసుకురావడం మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం. పగిడిద్దరాజును గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో మేడారానికి తీసుకువస్తారు. జాతరలో పగిడిద్దరాజుది ప్రత్యేక స్థానం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలో జాతరకు ఒకరోజు ముందు పగిడిద్దరాజును పెళ్లికొడుకును చేస్తారు. ఆ తర్వాత మర్నాడు ఆలయానికి చేరుకొని, బలి, ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త దుస్తులతో పగిడిద్ద రాజును సిద్ధం చేసి మేడారానికి బయలుదేరుతారు. సాయంత్రానికి మేడారం చేరుకుంటారు.
పగిడిద్దరాజును తీసుకొచ్చిన విషయాన్ని.. సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. అప్పటికే జాతర కోసం.. ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు. ఆ తర్వాత.. పగిడిద్ద రాజుకు ఆహ్వానం ఇస్తారు. వారిద్దరినీ ఎదురుదెరుగా కూర్చొబెట్టి.. వాయనం ఇచ్చిపుచ్చుకుని.. వివాహం పూర్తి చేస్తారు. పగిడిద్ద రాజును సారలమ్మ గద్దెల వద్దకు తీసుకుని పోతారు. అదే రోజు సారలమ్మకు కన్నెపల్లిలో ఉదయమే రెండు మూడు గంటలపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడ నుంచి మేడారం తీసుకువస్తారు. గద్దెల నుంచి ఈ ప్రాంతం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగిడిద్దరాజు ప్రత్యక్షం అవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజును సైతం.. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి తీసుకువస్తారు. గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకుని ఊరేగింపుగా మేడారానికి వస్తారు. ఒకే రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులస్వామి గద్దెలపైకి చేరుకుంటారు.
ఆ తర్వాత చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకుని వస్తారు. అధికార లాంఛనాలతో పోలీసుల తుపాకీ కాల్పుల గౌరవ వందనం, ఎదురుకోళ్ల ఘట్టంతో సమ్మక్కను ఆహ్వానిస్తారు. అయితే మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపై నారచెట్టుకింద ఉన్న కుంకుమ భరిణె రూపంలోని సమ్మక్క ఉంటుంది. ఆమెను కుంకుమ భరిణే రూపంలో పూజారులు తీసుకొస్తారు. అనంతరం గద్దెపై ప్రతిష్టిస్తారు. మేడారం జాతర మెుత్తానికి ఇదే కీలక ఘట్టం. ఈ తంతు తర్వాత ఉత్సవ మూర్తులంతా గద్దెలపై కొలువై మూడో రోజు భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. జాతరలో చివరి రోజున దేవతలను మళ్లీ వనంలోకి పంపిస్తారు. దేవతలు.. వనప్రవేశం చేయడంతో.. మేడారం మహాజాతర పరిపూర్ణం అవుతుంది.