Medaram Jathara | మేడారంలో చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చేది ఎవరో తెలుసా?
మేడారం జాతర వనదేవతలో పేర్లతో మారుమోగిపోతోంది. సమ్మక్కను గద్దెకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకు వస్తారు. కానీ ఇంతకీ ఆ వనదేవతను ఎవరు తీసుకొస్తారు? ఒక్కరే వెళ్తారా? లేదంటే.. చాలామంది వెళ్తారా?
మేడారం జాతర.. నాలుగురోజుల పాటు జరిగినా.. అసలు జాతర రెండో రోజే.. సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో ఆ ప్రాంతంలో అంతా.. ఓ రకమైన భక్తి పారవశ్యంగా మారిపోతుంది. ఎటు చూసినా.. సమ్మక్క రాక కోసం.. చూసే ఎదురు చూపులే. ఎటు విన్నా. అమ్మ నామ స్మరణే. చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం.
సమ్మక్క.. చిలుకలగుట్ట నుంచి వస్తుంటే.. అందరిచూపు అటు వైపే వెళ్తుంది. అదే సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి స్వాగతం పలుకుతూ.. గాల్లోకి తుపాకులతో కాల్పులు జరుపుతారు. సమ్మక్క కుంకుమ భరిణి రూపంలో వస్తారు. అయితే ఆ వనదేవతను కుంకుమ భరిణి రూపంలో తీసుకొచ్చేది ఒక్కరే. ఆయనే కొక్కెర కృష్ణయ్య. ప్రధాన వడ్డే. అంతకు ముందు అతడి కుటుంబ సభ్యులే తీసుకొచ్చేది. ఆ తర్వాత 2012 నుంచి అమ్మవారిని కృష్ణయ్య తీసుకొస్తున్నారు.
కొక్కెర కృష్ణయ్య మేడారంలోనే ఉంటారు. జాతర సమయంలో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కానీ.. ఆ తర్వాత వ్యవసాయం చేస్తారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జాతరు వారం రోజుల ముందు నుంచే కృష్ణయ్య నిష్ఠతో ఉంటాడు. చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను గద్దెల మీదకు చేర్చే వరకు జాగ్రత్తగా ఉంటారు. రాత్రి పూట పూజ చేసి మాత్రమే భోజనం చేస్తారు.
సమ్మక్కను తీసుకొచ్చే రోజున దేవాదాయశాఖ ఇచ్చిన కొత్త బట్టలు ధరించి.. కొక్కెర కృష్ణయ్య బృందం వెళ్తుంది. అయితే అందరూ అనుకున్నట్టుగా.. లోపలివరకూ అందరికి ప్రవేశం లేదు. కొక్కెర కృష్ణయ్య మాత్రమే వెళ్తారు. మిగిలిన వారంతా.. చిలుకలగట్ట సగం దగ్గరే ఆగిపోతారు. సమ్మక్క తల్లి కొలువై ఉండే రహస్య ప్రదేశంలో కృష్ణయ్య ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారిని కుంకుమ భరిణి రూపంలో తీసుకుని కిందకు దిగుతుంటే.. మిగిలిన బృందం సభ్యులంతా.. వాయిద్యాలతో శబ్ధాన్ని చేస్తారు. ఆ తర్వాత.. కిందకు రాగానే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం.. గాల్లోకి కాల్పులు జరుపుతారు.
ముందు రోజు కంకవనానికి వెళ్తారు
అయితే సారలమ్మ గద్దెల మీదకు రాగానే.. జాతరలో ఓ విధమైన ఎమోషన్ మెుదలవుతుంది. మరోవైపు.. సమ్మక్క పూజారులు, వడ్డేలు రహస్య పూజల కోసం మేడారం సమీపంలోని అడవికి వెళ్తారు. రెండేళ్లకోసారి.. జరిగే ఈ జాతర కోసం.. కంక వనం తెచ్చెందుకు వాళ్లు రహస్య ప్రాంతానికి వెళ్తారు. అక్కడకు ఎవరినీ రానివ్వరు. వడ్డేలు, పూజారులు, తలపతులు బుధవారం అర్ధరాత్రి అడవికి వెళ్తారు. సామాన్య భక్తులు, స్థానికులు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా ఎవరైనా సరే.. అసలు అనుమతించరు. వాళ్లు మాత్రమే వెళ్తారు. సమ్మక్కను గద్దెపై నిలబెట్టాలి. అందుకోసం.. కంక చెట్టు కోసం చూస్తారు. కంక చెట్టు వెతికేందుకు.. రహస్య పద్ధతిలో గంటలతరబడి పూజలు చేస్తారు.
అయితే ఈ పూజ కార్యక్రమం జరుగుతుండగానే.. సమ్మక్కను నుంచి ఆన వస్తుందని ఆదివాసులు చెబుతుంటారు. దాని ప్రకారమే.. ఓ కంక చెట్టును ఎంపిక చేస్తారు. అప్పటి నుంచి.. గురువారం తెల్లవారు జాము వరకు అడవిలోనే ఉంటారు. అప్పటి వరకు ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇలా అయిపోయిన తర్వాత.. చెట్టులో కొంత వెదురును నరుకుతారు.
అడవిలో నరికిన వెదురు బొంగులతో అక్కడ నుంచి బయలుదేరుతారు. తమ భుజాలపై మోస్తూ.. మేడారం తీసుకువస్తారు. మేడారానికి ప్రారంభంలో ఉన్న పోతారజు గుడి వద్ద వెదురు బొంగులకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం జాతర జరిగే ప్రదేశానికి వస్తారు. పూజల అనంతరం ఆ కంక వనాన్ని మేడారంలో సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత అమ్మవారిని కుంకుమ భరిణి రూపంలో కొక్కెర కృష్ణయ్య తీసుకొస్తారు.
సంబంధిత కథనం
టాపిక్