Medaram Jatara 2024 : మేడారం జాతరలో ‘ట్రైబల్ ఆర్ట్ సమ్మేళనం’
Medaram Sammakka Sarakka Jatara 2024 Updates: ఫిబ్రవరి 21 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. అయితే ఈసారి గిరిజన కళలకు సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టూరిజం అధికారులు కసరత్తు చేపట్టారు.
Medaram Sammakka Sarakka Maha Jatara 2024 Updates: గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం మహాజాతర మరికొద్దిరోజుల్లోనే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 21 నుంచి జరగనున్న ఈ జాతరకు దేశ, విదేశాల నుంచి కోటిన్నరకుపైగా భక్తులు వనదేవతల దర్శనానికి తరలివస్తారని అంచనా. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండగా.. జాతర సమయంలో మేడారంలో ట్రైబల్ ఆర్ట్ సమ్మేళనం(గిరిజన సంప్రదాయాలకు సంబంధించిన ఎగ్జిబిషన్) ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో గిరిజన కళలకు సంబంధించిన హ్యాండ్లూమ్స్, హ్యాండీ క్రాప్ట్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన కళాకారులతో దీనిని ఏర్పాటు చేయనుండగా.. వాటిని ప్రదర్శించడంతో పాటు అమ్మకాలకు కూడా పెట్టనున్నారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ అనువైన స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధిశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో సంబంధిత అధికారులు శుక్రవారం మేడారంలో పర్యటించారు.
20 మంది కళాకారులతో ఏర్పాటు
విభిన్న సంస్కృతులకు నిలయంగా విలసిల్లుతున్న భారతదేశంలో ఎన్నో రకాల గిరిజన తెగలున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన గిరిజన సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయి. కాగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనుల సంప్రదాయాలు, కళలను మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు వచ్చే ప్రజల కళ్లకు కట్టేందుకు ట్రైబల్ ఆర్ట్ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు దేశంలోని 20 మంది ట్రైబల్ కళాకారులతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నారు. గిరిజన కళలకు అద్దం పట్టేలా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాప్స్ తో ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. జాతరకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేసి, ఔత్సాహికులకు గిరిజనుల సంప్రదాయాలకు తగ్గట్టుగా తయారు చేసిన కళాఖండాల విక్రయాలు కూడా జరపనున్నారు.
మేడారంలో పర్యటించిన అధికారులు
మేడారంలో ట్రైబల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు టెక్స్ టైల్ మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ ఆఫీసర్ అరుణ్ కుమార్ శుక్రవారం మేడారంలో పర్యటించారు. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి మేడారంలోని ట్రైబల్ మ్యూజియం, హరిత హోటల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాప్ట్స్ తో ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర టెక్స్ టైల్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో థీమ్ ఫెవిలియం ఏర్పాటు చేస్తామని, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సాంప్రదాయలు, సంస్కృతుల కళాఖండాలను ప్రదర్శిస్తామన్నారు. గిరిజన కళాకృత సమ్మేళనానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తామని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. గిరిజన కళాకారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం టెక్స్ టైల్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అరుణ్ వనదేవతలను దర్శించుకున్నారు. వారి వెంట ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఎండోమెంట్ ఆఫీసర్ రాజేందర్, ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వసంతరావు, డీపీవో వెంకయ్య, ఐటీడీఏ ఏఎస్వో రాజ్ కుమార్, తదితరులున్నారు.