తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts High Court : 'నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు..' పేపర్స్ లీకేజీ కేసు సీబీఐకి ఇవ్వాలి

TS High Court : 'నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు..' పేపర్స్ లీకేజీ కేసు సీబీఐకి ఇవ్వాలి

HT Telugu Desk HT Telugu

20 March 2023, 16:14 IST

google News
  • TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సిట్ విచారణ చేస్తుంది. అయితే తాజాగా ప్రశ్నాపత్రం లీకేజీ నిందితుడి భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు (tshc )

తెలంగాణ హైకోర్టు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) ఘటనలో నిందితుడు రాజశేఖర్ భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజశేఖర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని వెల్లడించారు. వైద్య పరీక్షలు చేయించాలని కోర్టును కోరారు. కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కస్టడీ ముగిశాక కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు చేయిస్తామని కోర్టుకు చెప్పారు. సమస్య ఉంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది.

సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో రాజశేఖర్ భార్య సుచరిత కోర్టును కోరారు. తన భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ(Third Degree) ప్రయోగించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకూ జరిపిన విచారణ వీడియోలో చూపించాలన్నారు. ప్రతివాదులుగా డీజీపీ, చీఫ్ సెక్రటరీ, సిట్, హైదరాబాద్ సిటీ డీసీపీ సెంట్రల్ జోన్లను సుచరిత పేర్కొన్నారు. ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు(High Court).. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అభ్యంతరాలు ఉంటే.. సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

ఈ కేసులో సీబీఐ(CBI) విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత బల్మూరు వెంకట్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పేపర్ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్(KTR) పీఏ తిరుపతి పాత్రపై దర్యాప్తు జరిపించాలని కోరారు. గ్రూప్ 1 పేపర్ లో ఒకే జిల్లాకు చెందిన 20 మందికి అధిక మార్కులు రావడం అనుమానంగా ఉందని చెప్పారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానాలకు కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

పేపర్ లీక్ ఘటనలో ఇద్దరి పాత్ర మాత్రమే ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించాలన్నారు. అవి తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వెంకట్ పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేస్తుందని అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో హైకోర్టులో నిరుద్యోగులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కూడా మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు తెలిపింది.

తదుపరి వ్యాసం