Paper leak prevention bill: పేపర్ లీకేజీకి పాల్పడితే 10 ఏళ్ల జైలు కోటి జరిమానా
Paper leak prevention bill: పేపర్ లీకేజీకి పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ. 1 కోటి జరిమానాకు గురయ్యేలా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును విధాన సభ ఆమోదించింది.
గుజరాత్: పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రం లీకేజీని నిరోధించడానికి గరిష్టంగా కోటి రూపాయల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే బిల్లును గుజరాత్ విధానసభ గురువారం ఆమోదించింది.
'గుజరాత్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (అక్రమాల నివారణ) బిల్లు, 2023' పేరుతో బిల్లును గుజరాత్ విధానసభ ఆమోదించింది.
పోటీ పరీక్షల్లో (10వ, 12వ, యూనివర్శిటీ విద్యార్థులు మినహా) అక్రమ మార్గాలకు పాల్గొనడం వంటి నేరాలు, జరిమానాలకు సంబంధించిన నిబంధనలు బిల్లులో పేర్కొన్నారు.
పరీక్షకు హాజరయ్యే వ్యక్తి సహా ఎవరైనా కుట్ర లేదా అవకతవకలకు పాల్పడితే, ఐదేళ్లకు తక్కువ కాకుండా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. 10 లక్షల రూపాయలకు తగ్గకుండా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే పరీక్షల్లో అవతవకలపై వ్యవస్థీకృత నేరాన్ని అరికట్టడానికి వీలుగా అటువంటి వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు తేలితే కనీసం ఏడేళ్లు, గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు కోటి రూపాయల జరిమానా విధిస్తారు.
నేరానికి పాల్పడిన అభ్యర్థి రెండేళ్లపాటు ఏ పబ్లిక్ పరీక్షలకు హాజరు కాకుండా డిబార్‌కు గురవుతాడు. దోషిగా తేలిన వ్యక్తి ఏదైనా తప్పుడు మార్గాల ద్వారా ప్రయోజనాలు పొందినట్టు తెలిస్తే ఆస్తిని కూడా జప్తు చేయవచ్చు.
పబ్లిక్ పరీక్షకు సంబంధించిన అన్ని ఖర్చులను చెల్లించాల్సి వస్తుంది. దోషిగా తేలితే పరీక్ష రాసేందుకు శాశ్వతంగా నిషేధానికి గురవ్వాల్సి వస్తుంది.
గుజరాత్ ప్రభుత్వం జనవరిలో గుజరాత్ పంచాయితీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ - జూనియర్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహణకు కొన్ని గంటల ముందు పేపర్ లీక్ కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది.
సంబంధిత కథనం
టాపిక్