MLC Kavitha: పిటిషన్ ముందస్తు విచారణపై సుప్రీంలో మెన్షనింగ్
ఈడీ నోటీసుల నేపథ్యంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానంలో తమ పిటిషన్ విచారణను త్వరగా చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద ప్రస్తావించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో తన పిటిషన్ విచారణ 24వ తేదీకి బదులుగా ముందస్తుగా చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. ఈ నెల20వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడంతో తన పిటిషన్లపై నేడు విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టులో కవిత తరపు న్యాయవాదులు మెన్షన్ చేయగా.. ఈ విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ తిరస్కరించారు.
కాగా సోమవారం కవిత ఈడీ ఎదుట ఎమ్మెల్సీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సుప్రీం కోర్టులో విచారణ తర్వాత స్పష్టత వచ్చాక ఈడీ విచారణకు హాజరవుతానని గురువారం ఈడీకి కవిత లేఖ రాసింది. మనీ లాండరింగ్ కేసుల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా విచారణ జరుగుతోందని, తనను కుట్ర పూరితంగా కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు.
మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు, 15ఏళ్లలోపు పిల్లలున్న తల్లుల విషయంలో విచారణపై గతంలో ఉన్న కోర్టు తీర్పులను ఉటంకిస్తూ తన న్యాయవాదితో లేఖను పంపారు. రాజకీయ కారణాలతోనే కవితకు ఈడీ నోటీసులు ఇస్తోందని ఆమె తరపు న్యాయవాది ఆరోపించారు. కవిత విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 20వ తేదీన విచారణకు స్వయంగా విచారణకు రావాలని సూచించింది. ఈడీ నోటీసుల నేపథ్యంలో 24వ తేదీకి వాయిదా వేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాలని ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాదులు శుక్రవారం సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు.
కాగా తాము ఈరోజు ఎలాంటి కొత్త పిటిషన్ వేయలేదని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. తమ పిటిషన్ 24న విచారణకు రానుందని పేర్కొన్నారు.