Minister Konda Surekha : వారిద్దరి విడాకులకు కారణం కేటీఆర్ - మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు
02 October 2024, 15:01 IST
- కేటీఆర్ పై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత - నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అని ఆరోపించారు. కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డారని విమర్శించారు. తనపై సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
మంత్రి కొండా సురేఖ
నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె… చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడానికి కూడా కేటీఆర్ కారణమని సంచలన ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన మూడు సోషల్ మీడియా అకౌంట్లు దుబాయ్ నుంచి ఆపరేషన్స్ జరుగుతున్నాయని అన్నారు. తనపై అసభ్యకరమైన పోస్టులు పోస్టులు పెడితే కనీసం ఖండించకుండా... ఇష్టానుసారంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్… పోస్టులు పెట్టిన వారిని పార్టీ నుంచి బహిష్కరించకుండా... వెనకేసుకొచ్చేలా మాట్లాడతున్నారని అన్నారు. పోస్టుల వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
"కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాడు. నాగచైతన్య - సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లడానికి కూడా కారణం కేటీఆర్. ఈ విషయం అందరికి తెలుసు" అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.
మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీశ్ రావు కనీసం ఖండించారని గుర్తు చేశారు. కానీ కేటీఆర్ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో మేయర్ విజయలక్ష్మీ, మంత్రి సీతక్కపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. ఈ పోస్టుల వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.
పెడబొబ్బలు దేనికి…? - కేటీఆర్
బుధవారం మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ మంత్రులపై విరుచుకుపడ్డారు. కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి? అని ప్రశ్నించారు. తమపార్టీ తరఫున ఆమెపై ఎవరు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.
“ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? కొండా సురేఖ గారు గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా.. ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకు? మీ కావాలంటే.. గతంలో ఇదే కొండా సురేఖ గారు మాట్లాడిన వీడియోలు పంపిస్తా. ఇదే కొండా సురేఖ గారు హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారు ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్ళు ఏడ్వరా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్ని మంత్రులకు పంపిస్తానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలి. మంత్రి వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదు. ఆయనకి ఏం తెలువదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలి. అప్పుడు వెంకట్ రెడ్డికి మూసీ వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారు” అని కేటీఆర్ అన్నారు.
వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదన్న కేటీఆర్.. ఆయనకి ఏం తెలువదని విమర్శించారు. మూసీపైన ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ)లపై కూడా ఆయనకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఎస్టీపీలు పూర్తి అయిన తర్వాత మూసీలో మురికి నీళ్లు ప్రక్షాళణ అవుతాయని చెప్పుకొచ్చారు.