Warangal: మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి.. బాణసంచా కాలుస్తుంటే..
Warangal: మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి జరిగింది. బాణాసంచా కాలుస్తుండగా.. రోడ్డుపై ప్రయాణిస్తున్న యువతికి గాయలాయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో ఈ ఘటన జరిగింది.
వరంగల్ నగరం కాశిబుగ్గ జంక్షన్ వద్ద మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో రాఖీ కట్టడానికి వెళ్తున్న హరిణి అనే యువతి కాలిపై నిప్పు రవ్వలు పడ్డాయి. యువతి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. భయాందోళనకు గురైన హరిణి ఏడ్చారు. ఈ ఘటనపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్లేసులో ఇలాంటి పనులేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిత్యం రద్దీగా ఉండే జంక్షన్..
వరంగల్ నగరంలోని కాశిబుగ్గ జంక్షన్ నిత్యం రద్దీగా ఉంటుంది. రోడ్డు పక్కన షాపుల వద్ద నిత్యం ప్రజలు ఉంటారు. వందలాది వాహనాలు ఈ జంక్షన్ గుండా ప్రయాణిస్తాయి. పైగా సోమవారం రాఖీ పండగ కావడంతో.. రద్దీ ఇంకా ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో రోడ్డుపై బాణాసంచా పేల్చడం ఏంటని స్థానికులు ప్రశ్నించారు. గాయపడిన యువతికి ఏం సమాధానం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం శుభాకాంక్షలు..
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి శుభాకాంక్షలుపై మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు చెప్పారు.