తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Konda Surekha : సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ బీఆర్ఎస్ రాక్షసానందం పొందుతుంది- కంటతడి పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ

Konda Surekha : సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ బీఆర్ఎస్ రాక్షసానందం పొందుతుంది- కంటతడి పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ

30 September 2024, 22:30 IST

google News
    • Minister Konda Surekha : బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై అభ్యంతరకర రీతిలో పోస్టులు చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చేలా ట్రోలింగ్స్ చేశారని మంత్రి సురేఖ కంటతడి పెట్టారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వ్యవహారంతో ముడిపెట్టి, బంధాన్ని అంటగట్టి బీఆర్ఎస్ హేయమైన చర్యలకు పాల్పడిందని మండిపడ్డారు. 
సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ బీఆర్ఎస్ రాక్షసానందం పొందుతుంది- కంటతడి పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ
సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ బీఆర్ఎస్ రాక్షసానందం పొందుతుంది- కంటతడి పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ

సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ బీఆర్ఎస్ రాక్షసానందం పొందుతుంది- కంటతడి పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ

Minister Konda Surekha : మహిళలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తల వైఖరి జుగుప్సాకరంగా ఉంటున్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎస్టీ మహిళ అయిన సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అవమానకరమైన పోస్టులను మరువక ముందే తనను, బీజేపీ ఎంపీ రఘునందన్ రావును కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వ్యవహారంతో ముడిపెట్టి, బంధాన్ని అంటగట్టి బీఆర్ఎస్ హేయమైన చర్యలకు పాల్పడ్డారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం అభ్యంతరకర రీతిలో పోస్టులు చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చేలా ట్రోలింగ్స్ చేయడాన్ని నిరసిస్తూ మంత్రి సురేఖ మీడియా ముఖంగా కంటతడి పెట్టారు. సోమవారం గాంధీభవన్ లో ప్రెస్ మీట్ లో మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడారు. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టడం పట్ల మంత్రి సురేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ... తెలంగాణతో పాటు పక్క రాష్ట్రానికి వెళ్లినా అన్ని పార్టీల వాళ్లు తనను అక్కా అని, తన భర్త కొండా మురళిని బావ ఎంతో గౌరవంగా పిలుస్తారని అన్నారు. ఓడిపోయామన్న అసహనంతో, నిరాశావాదంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వెనుకుండి సోషల్ మీడియాను పావుగా వాడుకుంటూ ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని మంత్రి సురేఖ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మహిళలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతూ, ట్రోలింగ్స్ చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రాక్షసానందం పొందుతున్నదని మంత్రి సురేఖ మండిపడ్డారు.

మన శరీరాన్ని వస్త్రంతో కప్పుకుని నాగరికులుగా ఎదగానికి, గౌరవప్రదంగా బతకడానికి కారణమైన చేనేతలను అవమానించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తించిందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. చేనేతలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా ఇంకా ఇలా అవమానిస్తున్నారని దుఃఖించారు. ప్రభుత్వ విధానాల పరంగా ఎలా విమర్శించినా భరిస్తాం కానీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారేలా ప్రవర్తిస్తే తీవ్ర చర్యలుంటాయని మంత్రి సురేఖ హెచ్చరించారు. ఇలాంటి ట్రోలింగ్స్ ను మీ తల్లి, చెల్లి హర్షిస్తారా అని మంత్రి సురేఖ కేటీఆర్ ను ప్రశ్నించారు. ఇలా చేస్తే కేటీఆర్ బట్టలు ఊడదీసి పరుగెత్తిస్తామని మంత్రి ఘాటుగా స్పందించారు. ఇక పై కాంగ్రెస్ పార్టీ మహిళలపై కానీ, సమాజంలోని ఏ మహిళ జోలికి వచ్చినా తీవ్ర చర్యలు తీసుకుంటామని, అంతుచూస్తామని మంత్రి సురేఖ హెచ్చరించారు. చేనేతలకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మంత్రి సురేఖ బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ట్రోల‌ర్స్ పై సీత‌క్క ఫైర్

మంత్రి కొండా సురేఖ‌కు బాస‌ట‌గా నిలిచారు మంత్రి సీత‌క్క. బీఆర్ఎస్ కు మ‌హిళ‌లు అంటే చుల‌క‌న, అందుకే ట్రోల్ చేస్తారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అన్న దుర్మార్గుల పార్టీ బీఆర్ఎస్ అన్నారు. మ‌హిళా మంత్రిగా తాను, సోద‌ర మంత్రి పొన్నం అసెంబ్లీలో మాట్లాడిన ఫోటోల‌ను కూడా మార్ఫింగ్ చేసి దుర్మారంగా వ్యవ‌హ‌రించారన్నారు. మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వ‌క్రీక‌రించి దారుణంగా ప్రచారం చేస్తున్నారన్నారు. మ‌హిళా మంత్రుల‌ను, మ‌హిళా నేత‌లు వెంట‌ప‌డి మ‌రీ బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా వేధిస్తుందన్నారు. మహిళలు రాజకీయాల్లో ఉండాలా వద్దా బీఆర్ఎస్ స్పష్టం చేయాలన్నారు.

"సీఎం కుటుంబాన్ని, వారి పిల్లల్ని వేధిస్తున్న మీరు మ‌నుషులేనా? బీఆర్ఎస్ బీకారు నాయ‌కులారా ప‌ద్దతి మార్చుకోండి. మీ ఇంట్లో మ‌హిళ‌లు ఏ వ్యాపారాలు చేసారో దేశానికి తెలుసు. అయినా ఆడ‌కూతురు అన్న కార‌ణంతో మేము ఏనాడు చెడుగా స్పందించలేదు. దోర ఆహ‌కారంతోనే బీఆర్ఎస్ మ‌హిళా నేత‌ల‌ను టార్గెట్ చేస్తుంది. రాజ‌కీయాల్లో, ప్రజా జీవితంలో క్రీయా శీల‌కంగా ప‌నిచేసే వాల్లపై బుర‌ద చ‌ల్లుతున్నారు. ఎన్నో క‌ష్ట న‌ష్టాలు అధిగ‌మించి రాజ‌కీయాల్లో ఎదిగొచ్చిన మ‌హిళా నేత‌ల‌పై త‌ప్పుడు ప్రచారాలా? ఇది మీ ఫ్యూడ‌ల్ మెంటాలిటికి, పిత్రుస్వామ్య బావ‌జాలానికి నిద‌ర్శనం"- మంత్రి సీతక్క

విమర్శలకు ఓ హద్దు ఉండాలి - మంత్రి పొన్నం

మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేతలు గుర్తించాలన్నారు.

బాధ్యతగల ప్రతిపక్షాలు మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై విమర్శించదలుచుకుంటే ఓ హద్దు ఉండాలన్నారు.

మహిళా మంత్రులను అవమాన పరిచేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రాజకీయంగా మహిళలకు 50 శాతం కోటా ఇచ్చేవిధంగా సోనియా కృషి చేశారని గుర్తుచేశారు. చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.

గతంలో తన మీద, సీతక్క గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు మంత్రి పదవులీయని వారి గురించి, చేయలేని వ్యాపారం చేసి జైలుకు వెళ్లిన మహిళల గురించి మేం మాట్లాడటం లేదన్నారు.

ఈ చర్యలను ఖండిస్తున్నా - హరీష్ రావు

"మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోం. మంత్రి కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేనూ చింతిస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నాను. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందరిని కోరుతున్నాను" -మాజీ మంత్రి హరీష్ రావు

తదుపరి వ్యాసం