Konda Surekha: ఎమ్మెల్యేకు దమ్కీ ఇచ్చిన మంత్రి సురేఖ! సోషల్ మీడియాలో ఆడియో వైరల్-minister surekhas words with mla prakash went viral ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Konda Surekha: ఎమ్మెల్యేకు దమ్కీ ఇచ్చిన మంత్రి సురేఖ! సోషల్ మీడియాలో ఆడియో వైరల్

Konda Surekha: ఎమ్మెల్యేకు దమ్కీ ఇచ్చిన మంత్రి సురేఖ! సోషల్ మీడియాలో ఆడియో వైరల్

HT Telugu Desk HT Telugu
May 09, 2024 01:00 PM IST

Konda Surekha: లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి మధ్య విభేదాలు బయటపడ్డాయి.

ఎమ్మెల్యేకు దమ్కీ ఇచ్చిన కొండా సురేఖ
ఎమ్మెల్యేకు దమ్కీ ఇచ్చిన కొండా సురేఖ

Konda Surekha: లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పార్టీలో సీనియర్, జూనియర్ పంచాయితీ నడుస్తుండగా.. ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా వాగ్వాదాలు, కొట్లాటలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో అంతర్గత కలహాలతో పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోందనే విషయం స్పష్టమవుతుండగా.. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి మధ్య విభేదాలు బయటపడ్డాయి. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న పరకాల నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల కిందట మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఆడియోలో మంత్రి సురేఖ ఎమ్మెల్యేకు ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు పార్టీకి చెందిన జిల్లాలోని మరికొందరు నేతల పేర్లు కూడా ప్రస్తావించడం ఉమ్మడి వరంగల్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఎమ్మెల్యేకు ఫోన్ చేసి సీరియస్

పరకాల కొండా దంపతులకు మంచి పట్టున్న నియోజకవర్గం. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో తాము వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తామని కొండా దంపతులు అధిష్టానానికి చెప్పుకోవడంతో పరకాల నియోజకవర్గ టికెట్ ను బీజేపీ నుంచి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో కొంతమేర కొండా దంపతులు కూడా ఆయన ఎన్నికకు సహకరించారు.

వరంగల్ జిల్లాలోని గీసుగొండ కొండా దంపతుల సొంత మండలం కాగా.. అక్కడ కొండా మురళి ముఖ్య అనుచరుడు, పార్టీ మండల అధ్యక్షుడు రడం భరత్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరారు. హస్తం పార్టీ గెలిచిన తరువాత తిరిగి కొండా సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు.

ఆయన చేరిక పట్ల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతోనే భరత్ కు రేవూరి ప్రాధాన్యం ఇవ్వడం మానేశారు. ఆయనను కాదని మరో వ్యక్తికి ప్రాధాన్యం ఎలా ఇస్తారంటూ కొద్ది రోజుల కిందట మంత్రి సురేఖ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డికి ఫోన్ చేసి సీరియస్ అయ్యారు.

దమ్కీ ఇస్తున్నవా..?: ఎమ్మెల్యే

ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా మాటామాట పెరగగా.. రడం భరత్ తో వచ్చిన ఇబ్బంది ఏంటని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిని మంత్రి సురేఖ ప్రశ్నించారు. దీంతో భరత్ తో తనకు ఇబ్బందేనని ఎమ్మెల్యే సమాధానం ఇవ్వగా.. ఇద్దరి మాటామాట పెరిగింది.

ప్రస్తుత కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, గీసుగొండ ఎంపీపీ పేర్లు ప్రస్తావిస్తూ మంత్రి విమర్శలు చేశారు. తమకు ఎవరు ఏంటో తెలుసని గట్టిగానే స్పందించారు. పది రోజుల ముందు రేవూరి కాంగ్రెస్ పార్టీలో చేరితే గెలిపించింది తామేనని మంత్రి స్పష్టం చేశారు. అంతేగాకుండా గీసుగొండ తమ సొంత మండలమని, అక్కడ తాము చెప్పినట్టే నడవాలని అన్నారు.

అలా కాదని వ్యవహరిస్తే మాత్రం వర్గపోరు మొదలవుతుందని హెచ్చరించారు. దీంతో దమ్కీ ఇస్తున్నవా అంటూ ఎమ్మెల్యే రేవూరి మంత్రి సురేఖకు ధీటుగానే సమాధానం ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడవగా.. ఆ ఫోన్ కాల్ ఆడియో కాస్త వైరల్ గా మారింది.

అధిష్టానం దృష్టి కి పరకాల వార్

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ, పరకాల నియోజకవర్గ రాజకీయాలు పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లినట్లు తెలిసింది. కొద్ది రోజుల కిందటనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లగా.. ఆయన ఇద్దరినీ పిలిచి సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో మెజారిటీ పార్లమెంట్ సీట్లు సాధించాలని పట్టుదలతో పని చేస్తుంటే గ్రూపు రాజకీయాలతో పార్టీ పరువు తీయొద్దని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది.

ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో తరచూ విభేదాలు బయటపడుతుండగా.. మంత్రి సురేఖ వ్యవహార శైలిపై పార్టీ ఎమ్మెల్యేలు, మరికొందరు నేతలు కూడా గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. కాగా లోక్ సభ ఎన్నికలు మరో నాలుగు రోజుల్లోనే జరగనుండగా.. పార్టీలో విభేదాలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం