HYDRA Musi River : మూసీ, హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ నేతల బృందం - కాలనీల్లో భారీ ర్యాలీ
మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ నేతల బృందం పర్యటిస్తోంది. మూసీ, హైడ్రా బాధితులతో మాట్లాడి వివరాలను తెలుసుకుంటోంది. మాజీ మంత్రి హరీశ్ రావ్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నగరానికి చెందిన నేతలు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ చెప్పిన సంగతి తెలిసిందే. బాధితులు ఏ క్షణమైనా తెలంగాణ భవన్ కు రావొచ్చని కూడా ప్రకటని చేసింది. న్యాయపరంగా పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని కూడా బాధితులకు భరోసానిచ్చారు. ఈ క్రమంలోనే… ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తోంది.
ముందుగా హైదర్‌షా కోట్‌లో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలించారు. కాలనీవాసులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ నేతల బృందం పర్యటనలో ప్రభుత్వానికి వ్యతిరేక ఫ్లకార్డులను ప్రదర్శించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య నేతలు… బీఆర్ఎస్ పార్టీ తరపున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. పలు కాలనీల్లో మూసీ బాధితులు భారీ ర్యాలీ చేపట్టగా… ధర్నాకు నేతలు మద్దతు తెలిపారు.
రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మీద దృష్టి ఎక్కువ పెట్టాడని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఫార్మా సిటీని పక్కనబెట్టి ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపాడని విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరుతో ఇదంతా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేనట్లు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు డీపీఆర్ కే రూ. 1500 కోట్లు ఖర్చు పెడుతున్నాడు తుగ్లక్ రేవంత్’ అంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తప్పుడు ప్రచారం చేస్తున్నారు - హైడ్రా కమిషనర్
హైడ్రా అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన కొన్ని కట్టడాలు కూల్చివేసినప్పుడు హైడ్రాను ప్రశంసించారని, ఇప్పుడు అవాస్తవాలు ప్రచారం చేస్తు్న్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందన్నారు.
అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయన్నారు. అమీన్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిపై గతంలో చర్యలు తీసుకున్నా మళ్లీ తిరిగి నిర్మించారన్నారు. ఆ ఆసుపత్రిని కూల్చిన సమయంలో అందులో పేషెంట్లు ఎవరూ లేరన్నారు.
ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశామని, దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజలు నివసిస్తున్న భవనాలను ఎక్కడా కూల్చలేదని తెలిపారు. ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు భవనాలను ఖాళీ చేయడంలేదన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి భవనాలు కట్టిన వారికి సరైన సమయం ఇచ్చిన తర్వాతే ఆ ఆక్రమణలు కూల్చివేస్తున్నామన్నారు. కూకట్‌పల్లి నల్ల చెరువులో ఆక్రమణలు కూల్చివేశామన్నారు.