Hyderabad : వారి గూడుని కూల్చేశారు.. వారి కలలను చిదిమేశారు.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో-ktr posted an emotional video on demolition in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : వారి గూడుని కూల్చేశారు.. వారి కలలను చిదిమేశారు.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో

Hyderabad : వారి గూడుని కూల్చేశారు.. వారి కలలను చిదిమేశారు.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో

Basani Shiva Kumar HT Telugu
Oct 01, 2024 05:35 PM IST

Hyderabad : హైదరాబాద్ నగరంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ కూల్చివేతలపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. తాజాగా కేటీఆర్ ఓ ఎమోషనల్ వీడియోను పోస్టు చేశారు. ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు. పేద పిల్లల పట్ల కనికరం లేదా అని కేటీఆర్ వీడియోకు నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.

కూల్చివేసిన ఇంటి దగ్గర చిన్నారులు
కూల్చివేసిన ఇంటి దగ్గర చిన్నారులు

హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వీటిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. బాధితులను కలుస్తూ.. ఓదారుస్తోంది. మంగళవారం కేటీఆర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కూల్చివేతల బాధితులను పరామర్శించారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఎమోషనల్ ట్వీట్..

తాజా కేటీఆర్ ఓ ఎమోషనల్ వీడియోను పోస్టు చేశారు. 'వారి గూడుని కూల్చేశారు! వారి కలలను చిదిమేశారు! ఆ కూలిన ఇంటి శిథిలాల్లో వారి జీవితాలను వెత్తుకుంటున్నారు! మీ మంత్రులను వచ్చి చెప్పమనండి.. వీళ్లు కూడా డబ్బులు తీసుకున్నారని! మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి.. మీ ఇళ్లు కూల్చి, మాల్స్ కడుతున్నాము.. మీ బ్రతుకులు బాగుపడతాయని. ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన!!! డియర్ రాహుల్ గాంధీ.. దయచేసి తెలంగాణలో మీ కూల్చివేత సర్కార్‌ని ఒకసారి చూడండి' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

నెటిజన్లు ఫైర్..

కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. కేటీఆర్ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. పేద పిల్లల పట్ల కనికరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. 'ఎంతటి రాతి గుండె అయినా ఇలాంటివి చూసినప్పుడు మనసు కరిగిపోయి కళ్లల్లో నీళ్లు తిరుగుతయ్. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దల మనసు మాత్రం మారడం లేదు' అంటూ ఓ నెటిజన్ రిప్లై ఇచ్చారు. 'ఏం రాజకీయమో ఏమో.. ప్రజల జీవితం అస్తవ్యస్తం చేస్తున్నారు' అని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా బాధాకరం అని చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇది పెద్ద స్కామ్..

'మూసీ ప్రక్షాళన అనేది పెద్ద స్కాం. 2400 కిలోమీటర్లు ఉండే గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది. అదే 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50 వేల కోట్లు అవుతుందంటే.. దీన్ని స్కాం అనే అంటారు. కూల్చే పరిస్థితులు వస్తే.. ముందు కూల్చాల్సింది హుస్సేన్ సాగర్ నాలా మీద ఉన్న హైడ్రా కార్యాలయాన్ని కుల్చండి' అని కేటీఆర్ సోమవారం వ్యాఖ్యానించారు.

ఆగమంటే.. ఆగరెందుకు..

అటు కూల్చివేతల సమయంలో.. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 'సామాన్లు తీసుకునే వరకు ఆగమంటే ఆగరెందుకు.. చెప్తే వినకుండా రాజకీయం చేస్తున్నారా.. వెళ్లిపోండి మీరు ఇక్కడి నుంచి' అంటూ ప్రజలు అధికారులతో గొడవకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సడెన్‌గా వచ్చి ఇళ్లు కూల్చేస్తే.. ఎక్కడికి పోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు.