TG Family Digital Cards : తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ జారీపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు-key instructions of chief minister revanth reddy regarding the issuance of telangana family digital cards ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Family Digital Cards : తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ జారీపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

TG Family Digital Cards : తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ జారీపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Basani Shiva Kumar HT Telugu
Sep 30, 2024 05:40 PM IST

TG Family Digital Cards : తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ జారీపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కుటుంబ ఫొటో దిగ‌డం ఆప్ష‌న్ మాత్ర‌మేనని స్పష్టం చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వ‌ర‌కు పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌ చేయాలని ఆదేశించారు.

సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ జారీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయిలో పైలెట్ ప్రాజెక్టుగా చేప‌ట్ట‌నున్న ప‌రిశీల‌న స‌మ‌ర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక ప‌ట్ట‌ణ‌, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేశారు. పూర్తిగా ప‌ట్ట‌ణం, న‌గ‌ర ప్రాంత‌మైతే.. రెండు వార్డులు, డివిజ‌న్లు.. పూర్తిగా గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గ‌మైతే రెండు గ్రామాల్లో.. మొత్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌ చేప‌ట్టాల‌ని రేవంత్ ఆదేశించారు.

వార్డులు, డివిజ‌న్ల‌లో జ‌నాభా ఎక్క‌వగా ఉండే అవ‌కాశం ఉన్నందున.. ప‌రిశీల‌న బృందాల సంఖ్య‌ను పెంచుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలెట్ ప్రాజెక్టు, సేక‌రించే వివ‌రాల‌ను అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌ చేప‌ట్ట‌నున్న గ్రామాలు, వార్డులు, డివిజ‌న్ల ఎంపిక పూర్త‌యింద‌ని అధికారులు రేవంత్ రెడ్డికి వివ‌రించారు.

పైలెట్ ప్రాజెక్టును ఎన్ని రోజుల పాటు చేప‌డ‌తార‌ని సీఎం ప్ర‌శ్నించగా.. అక్టోబ‌రు మూడో తేదీ నుంచి ఏడో తేదీ వ‌ర‌కు 5 రోజుల పాటు చేప‌డ‌తామ‌ని అధికారులు తెలిపారు. కుటుంబ స‌భ్యులు అంతా స‌మ్మ‌తిస్తే ఫొటో తీయాల‌ని, అదో అప్ష‌న‌ల్‌గా ఉండాల‌ని సీఎం స్పష్టం చేశారు. కుటుంబం స‌మ్మ‌తి లేకుంటే ఆ ఫొటో తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌కు సంబంధించి ఉమ్మ‌డి జిల్లాల‌కు ఉన్న నోడ‌ల్ అధికారులు.. క‌లెక్ట‌ర్ల‌కు మార్గ‌నిర్దేశం చేయాల‌ని.. అప్పుడే ప‌క‌డ్బందీగా కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని ముఖ్య‌మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్ర‌భుత్వం వ‌ద్దనున్న రేష‌న్ కార్డు, పింఛ‌ను, స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతు భ‌రోసా, రుణ‌మాఫీ, బీమా, ఆరోగ్య శ్రీ‌, కంటి వెలుగు త‌దిత‌ర డేటాల ఆధారంగా ఇప్ప‌టికే కుటుంబాల‌ గుర్తింపున‌కు సంబంధించిన ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని.. పైలెట్ ప్రాజెక్టులో దానిని నిర్ధారించుకోవ‌డంతో పాటు కొత్త స‌భ్యులను జ‌త చేయ‌డం, మృతి చెందిన వారిని తొల‌గించ‌డం చేస్తామ‌ని అధికారులు ముఖ్యమంత్రికి వివ‌రించారు.

కుటుంబ స‌భ్యుల వివ‌రాల న‌మోదు, మార్పులు చేర్పుల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఎటువంటి పొర‌పాట్ల‌కు తావివ్వ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. పైలెట్ ప్రాజెక్టుతో బ‌య‌ట‌కు వ‌చ్చిన సానుకూల‌త‌లు, ఎదురైన ఇబ్బందుల‌తో నివేదిక త‌యారు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆ నివేదిక‌పై చ‌ర్చించి లోపాల‌ను ప‌రిహారించిన అనంత‌ర.. పూర్తిస్థాయి క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌ చేప‌డ‌దామ‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు.