Kukatpally Hydra Demolitions : కూకట్ పల్లి నల్లచెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు, కన్నీరు పెట్టిస్తున్న బాధితుల దృశ్యాలు
Kukatpally Hydra Demolitions : హైడ్రా కూకట్ పల్లి నల్లచెరువు ఆక్రమణలను ఆదివారం తొలగించింది. అయితే నల్లచెరువు పరిధిలో వాణిజ్య షెడ్లు నిర్మించి క్యాటరింగ్ సర్వీసులు నడుపుకుంటున్నారు కొందరు. వీటిని హైడ్రా కూల్చివేయడంతో... షెడ్లు అద్దెకు తీసుకున్నవారు ఆవేదన చెందారు. తమకు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.
Kukatpally Hydra Demolitions : "రేవంత్ నీ ప్రభుత్వం ఇంత అన్యాయమా? నీ గురించి ఓట్లేసినాం. నువ్వు బాగుండాలని వేడుకున్నాం. కానీ మాకు ఇంత అన్యాయం చేస్తావనుకోలేదు. మీరు కూల్చుడు తప్పుకాదు. కానీ టైమ్ ఇవ్వండి. ఓనర్ ది తప్పా? రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న నా కొడుకుది తప్పా? రెంట్ కు ఉన్న వాళ్లకు కూడా టైమ్ ఇవ్వకపోతే ఎలా? మాకేం తెలుసు. సామాన్లు తీసుకునే టైమ్ అయినా ఇవ్వాలి కదా. నా కొడుకు రూపాయి రూపాయి కష్టబడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్. మా బతుకులు అన్యాయం చేస్తారా?" - హైడ్రా షెడ్డు కూల్చివేతతో ఓ మహిళ ఆవేదన
కూకట్ పల్లి లేక్/ నల్లచెరువు పరిధిలో కూకట్ పల్లి విలేజ్, బాలానగర్ మండల పరిధిలోని సర్వే నంబరు 66,67,68,69 లో హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. చెరువును ఆనుకుని నిర్మించిన 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలు కూల్చివేశారు. కూకట్ పల్లి లేక్/నల్లచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ పరిధిలో వాణిజ్య కార్యకలాపాల కోసం షెడ్లను నిర్మించారు. హైడ్రా అధికారులు వీటిని గుర్తించి ఆదివారం కూల్చివేశారు. కొంతమంది వ్యక్తులు కూకట్ పల్లి లేక్ వెంబడి క్యాటరింగ్ వ్యాపారాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల కోసం పెద్ద షెడ్లను నిర్మించారు. వీటిలో క్యాటరింగ్ కోసం పెద్ద కిచెన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ షెడ్లు అద్దెకు తీసుకుని భోజన హోటళ్లు నడుపుతున్నారు కొందరు. ఈ కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారు అక్కడే నివసిస్తున్నారు.
"క్యాటరింగ్ కోసం లక్షల పెట్టి కిచెన్ ఏర్పాటు చేసుకున్నాను. నాకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కొంత సమయం ఇస్తే నేను ఖాళీ చేస్తాను. ఇటీవలె నేను ఇక్కడకు వచ్చాను. ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టినా... ఇప్పుడు కూల్చివేస్తామంటే నాకు ఎలా ఉంటుంది. నాకు కొంచెం టైమ్ ఇవ్వండి. నేను వీటిని తొలగిస్తాను. నేను మందికి భోజనాలు సప్లై చేస్తున్నాను."-క్యాటరింగ్ షెడ్డు నడుపుతున్న వ్యక్తి
ఇలా క్యాటరింగ్ షెడ్డు నడుపుతున్న మరో వ్యక్తి...కూల్చివేతలు చూసి బోరున విలపించాడు. ఇన్నాళ్లు పడిన కష్టం కళ్ల ముందే కూల్చుతున్నారని ఆవేదన చెందాడు. అతడు విలపించిన తీరు, పిల్లలు ఓదార్పు చూసి స్థానికులు కూడా చలించిపోయారు. అద్దెకు షెడ్డులలో ఉంటున్న వారికి కొంత సమయం ఇవ్వాలని స్థానికులు సైతం కోరుతున్నారు.
కూకట్‌పల్లిలోని నల్లచెరువులో ఆక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా ఆదివారం కూల్చివేసింది. హైడ్రా అధికారులు ఆదివారం ఉదయం 5 గంటలకు కూకట్ పల్లి నల్ల చెరువు వద్దకు చేరుకున్నారు. అక్రమ నిర్మాణాల్లో ఉంటున్న వారికి ఖాళీ చేయడానికి రెండు గంటల సమయం ఇచ్చారని కొందరు స్థానికులు అంటున్నారు. అయితే ఈ పరిస్థితికి గతంలో పనిచేసిన అధికారులే ప్రధాన కారణం ఆరోపిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ముందుగా సమాచారం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. సరైన సమాచారం లేక చాలా మంది అక్రమ నిర్మాణాల్లో అద్దెకు ఉంటున్నారని అంటున్నారు.
సంబంధిత కథనం