Karimnagar : పదవుల్లో కరీంనగర్ కు పెద్దపీట-అభివృద్ధిపై గంపెడాశలు
15 June 2024, 15:33 IST
- Karimnagar : దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ కీలకంగా మారింది. ఇక్కడి నుంచి గెలిచిన నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా పదవులు పొందారు. దీంతో కరీంనగర్ అభివృద్ధిపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.
పదవుల్లో కరీంనగర్ కు పెద్దపీట-అభివృద్ధిపై గంపెడాశలు
Karimnagar : ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జిల్లా నేతలు కీలక పదవుల్లో కొనసాగుతుండటంతో అభివృద్ధిపై ఉమ్మడి జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలే అడ్డగోలుగా కొనసాగాయంటూ సర్వత్రా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువు దీరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జిల్లా నేతలు కీలక బాధ్యతలు నిర్వహిస్తుండటంతో రానున్న రోజుల్లో మంచి జరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాల పునఃర్విభజన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగు ముక్కలై చెల్లాచెదురుగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి జిల్లాగా పరిగణించి ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించడం ద్వారా పాత జిల్లాల ప్రాధాన్యత గురించి రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్దేశాన్ని ముందే స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాను లెక్కలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి పలువురు నేతలు కీలక పదవుల్లో ఉండటంతో రానున్న రోజుల్లో జిల్లాకు నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వరదలా వచ్చే అవకాశం లేకపోలేదని జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు.
కేంద్రమంత్రిగా బండి సంజయ్
కరీంనగర్ కు చెందిన బండి సంజయ్ కుమార్ రెండోసారి ఎంపీగా గెలుపొంది మోదీ కేబినెట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు. పలువురు ఎంపీలు పోటీపడినా కూడా పార్టీకి విధేయతను పరిగణనలోకి తీసుకొని బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవిని కేటాయించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సర్కారుపై గత నాలుగేళ్ల పాటు బండి సంజయ్ చేసిన నిరంతర పోరాటాన్ని, బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి బండి సంజయ్ చేసిన కృషిని బీజేపీ జాతీయ నాయకత్వం గుర్తించి కీలకమైన హోంశాఖలో సహాయ మంత్రి పదవిని కేటాయించిందని తెలుస్తోంది. రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డితోపాటు బండి సంజయ్ కి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కగా రానున్న రోజుల్లో అటు రాష్ట్రానికి, ఇటు జిల్లాకు కూడా కేంద్ర నిధులను రాబట్టు కోవడానికి వీలు కలిగిందని తెలుస్తోంది. 2004లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ కొంతకాలం మాత్రమే కేంద్ర మంత్రిగా ఉన్నా ఉద్యమ సమయం కావడంతో జిల్లాకు ఎటువంటి ప్రాధాన్యత దక్కలేదు. అంతకు ముందు 1999 నుంచి 2004 వరకు చెన్నమనేని విద్యాసాగర్ రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేసిన సమయంలో జిల్లాకు తగిన ప్రాధాన్యత లభించింది. ఈ క్రమంలో బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి దక్కడం వల్ల జిల్లాకు మేలు కలుగుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
రాష్ట్ర మంత్రులుగా దుద్దిళ్ళ, పొన్నం
కాంగ్రెస్ పార్టీ దశాబ్దం తర్వాత అధికారాన్ని దక్కించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయగా జిల్లా నుంచి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే లోక్ సభ ఎన్నికలు రావడం.. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అభివృద్ధి నిలిచిపోయింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఇటు అభివృద్ధి, అటు సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు మంత్రులు కీలక శాఖల్లో కొనసాగుతుండటంతో జిల్లాకు మేలు జరిగే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. మంథని నుంచి ఐదోసారి గెలుపొందిన శ్రీధర్ బాబు వైఎస్ కేబినెట్ లో, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో సీనియర్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. దశాబ్దం తర్వాత తిరిగి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ, పరిశ్రమల శాఖలను నిర్వహిస్తున్నారు. దీంతో ఇటు ఐటీ పరంగా.. అటు పరిశ్రమల విస్తరణ పరంగా ఉమ్మడి జిల్లాకు లాభం కలిగే దిశగా చర్యలు చేపడుతారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఇద్దరికి ప్రభుత్వ విప్ పదవులు
ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కడంతో పాటు మరో ఇద్దరికి ప్రభుత్వ విప్ బాధ్యతలు కూడా దక్కాయి. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గా లకు కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను దక్కించుకుంది. దీంతో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మన్ కుమార్ కు ప్రభుత్వ విప్ పదవులు దక్కాయి. ప్రభుత్వంలో నలుగురు కీలక పదవుల్లో ఉండటం కూడా జిల్లాకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.
ఆ శాఖలు మళ్లీ కరీంనగర్ కే
బీఆర్ఎస్ హయాంలో జిల్లాకు చెందిన కేటీఆర్ ఐటీ శాఖను చేపట్టగా గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖను చేపట్టారు. తాజాగా ఈ రెండు శాఖలు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చేపడుతుండటం గమనార్హం. అలాగే గతంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో చెన్నమనేని విద్యాసాగర్ రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిత్వ శాఖను చేపట్టగా తాజాగా బండి సంజయ్ కుమార్ కూడా అదే శాఖను చేపట్టడం విశేషం. గతంలో జిల్లా నుంచి నేతలు చేపట్టిన శాఖలే తిరిగి జిల్లాను వరించడం కూడా చర్చనీయాంశంగా మారింది.
HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి